గుడివాడలో టీడీపీకి షాక్.. వైయ‌స్ఆర్‌సీపీలోకి నెరుసు చింతయ్య

కొడాలి నాని సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక.. నామినేషన్ ర్యాలీలో హోరెత్తిన నినాదాలు 

 గుడివాడ: గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత నెరుసు చింతయ్య వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతయ్య టీడీపీని వీడడానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వైఖరే కారణమని పేర్కొన్నారు.

టీడీపీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గౌరవం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ సీట్లను బేరం పెడుతున్నారని చింతయ్య ఆరోపించారు. ఒక్కో కౌన్సిలర్ సీటుకు రూ.25 లక్షల వరకు బేరం పెడుతున్నారని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీట్లను అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. కొడాలి నాని నాయకత్వంలో గుడివాడలో వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు.

 నినాదాలతో హోరెత్తిన గుడివాడ

మరోవైపు గుడివాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెరుగుమాల ప్రవీణ నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ సతీమణి ప్రవీణకు మద్దతుగా కొడాలి నాని పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గుడివాడ వీధులు సందడిగా మారాయి.

“జై జగన్.. జై కొడాలి నాని” నినాదాలతో నామినేషన్ ర్యాలీ హోరెత్తింది. ర్యాలీ నెహ్రూ చౌక్‌ వద్దకు చేరుకోగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల అడ్డంకుల మధ్యే ప్రవీణ నామినేషన్ కార్యక్రమం కొనసాగింది.

Back to Top