ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగమే జగనన్న ఆరోగ్య సురక్ష  

తొలి పది రోజుల్లో 13.7 లక్షల ఓపీ సేవలు  

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట:  ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో  నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీ వరకు అంటే తొలి పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాల్లో ఏకంగా 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు.

మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించామన్నారు. ఇప్పటి వరకు 34 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి, పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు.

వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్‌హెచ్‌వోలు, ఆయా గ్రామాల సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చేవరకు ఫాలోఅప్‌ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్‌లైన్‌లో ముగుస్తుందని వెల్లడించారు. 

Back to Top