అక్కచెల్లెమ్మలకిచ్చిన మాట నిలబెట్టుకున్నా

వరుసగా రెండో ఏడాది ‘వైయస్‌ఆర్‌  ఆసరా’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

రెండో విడత కింద రూ.6,439 కోట్లు పొదుపు సంఘాల అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లో జమ చేస్తున్నాం

నేటి నుంచి ఈనెల 18 వరకు ‘వైయస్‌ఆర్‌ ఆసరా’ ఉత్సవాలు

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 6 నుంచి ప్రారంభం

ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మొత్తం రూ.12,759 కోట్లు జమ చేశాం

నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందిస్తాం

చంద్రబాబును నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారు 

బాబు హయాంలో రద్దయిన ‘సున్నావడ్డీ’ పథకాన్ని పునఃప్రారంభించాం

అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం

21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలి

ప్రకాశం: ‘‘అమ్మవారిని కొలిచే నవరాత్రులు ప్రారంభమవుతున్న రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైయస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా’’. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూసి ఒక మాటిచ్చాను. ఆ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నాను. పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా ‘వైయస్‌ఆర్‌ ఆసరా’ పథకానికి మీ అందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నందుకు మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా ఉంది. 

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో ఏడాది ప్రారంభోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ప్రసంగించారు.  

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
వైయస్‌ఆర్‌ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై.. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుంది. మండలం ఒక యూనిట్‌గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. 13, 15 తేదీల్లో పండగ సందర్భంగా రెండు రోజులు అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ మిగిలిన రోజుల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 18 తేదీన  ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి.. జిల్లా వ్యాప్తంగా కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలో నవంబర్‌ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్నాం. 

రాష్ట్రంలో 7.97 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్‌ వరకు వారు బాకీపడిన మొత్తం రూ.25,512 కోట్లు నాలుగు విడతల్లో వారి చేతికే అందిస్తామనన మాటకు కట్టుబడి వరుసగా రెండో సంవత్సరం రూ.6,440 కోట్లు ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు పొదుపు సంఘాలకు జమ చేయనున్నాం. ఇంత భారీ మొత్తాన్ని అక్కచెల్లెమ్మలకు అందించే కార్యక్రమం దేవుడి దయతో ఒక్క మన ప్రభుత్వం తప్ప దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదని సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా తెలియజేస్తున్నాను. 

స్వయం సహాయక సంఘాల రుణామాఫీ చేస్తామని రుణాలు కట్టొద్దు అని 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మాటను నమ్మి ఓటు వేసి టీడీపీని గద్దెనెక్కిస్తే ఆ అక్కచెల్లెమ్మలను చంద్రబాబు దగా చేసిన పరిస్థితులు కళ్లారా చూశాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు చంద్రబాబు మాట నమ్మి రుణాలు కట్టని కారణంగా అసలు, వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు అన్నీ తడిసిమోపెడై 2019 ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ తుది నివేదికల ప్రకారం అక్షరాల 2014లో రూ.14,204 కోట్లుగా ఉన్న పొదుపు సంఘాల రుణాలు అసలు, వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు కలిపి తడిచిమోపెడై అక్షరాల రూ.25,517 కోట్లకు చేరాయి. 

అక్కచెల్లెమ్మలు రుణాలు చెల్లించలేక రోడ్డునపడే పరిస్థితి. ఫలితంగా అక్షరాల పొదుపు సంఘాల్లో 18.36 శాతం పొదుపు సంఘాలు బకాయిలు చెల్లించలేక మూతపడ్డాయి. మిగిలిన సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా ఏగ్రేడ్‌ స్థాయిలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. గత ముఖ్యమంత్రి చేసిన వంచన వల్ల రుణమాఫీ కథ దేవుడెరుగు.. అప్పటి వరకు ఉన్న సున్నా వడ్డీ పథకం కూడా 2016 అక్టోబర్‌ నుంచి పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు సుమారు రూ.3,036 కోట్లు బ్యాంకులకు అపరాధ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి అక్కచెల్లెమ్మలకు ఏర్పడింది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడింది. సాయం అందించలేకపోతే గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయే పరిస్థితుల మధ్య ఆసరా అనే కార్యక్రమానికి బీజం పడింది. 

చంద్రబాబు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు నష్టపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్య నా పాదయాత్ర కొనసాగుతుండగా, మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తుండగా నేను ఏం చెప్పానో ఆ మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాను. 2019 ఏప్రిల్‌ 11 నాటికి స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ తుది నివేదిక ప్రకారం ఉన్న 7.97లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ ఖాతాల్లోకి రూ.25,517 కోట్ల నగదు నాలుగు విడతల్లో వారికే ఇచ్చి వారిని మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునేలా, అప్పుల ఊబిలోంచి బయటపడేలా చేసే లక్ష్యంతో వైయస్‌ఆర్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడత గత సంవత్సరం రూ.6,318 కోట్లు అక్కచెల్లెమ్మల చేతికే అందించడం జరిగింది. రెండో విడతలో మరో రూ.6,439 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతికే అందిస్తున్నాం. రెండు విడతల్లో మొత్తంగా రూ. 12,759 కోట్లు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మ చేతుల్లో పెట్టాం. 

అంతేకాకుండా 2016 అక్టోబర్‌లో రద్దయిన సున్నా వడ్డీని మళ్లీ పునరుద్ధరించి.. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం పేరుతో సకాలంలో రుణాలు చెల్లించిన 9.41 లక్షల స్వయం సహాయక సంఘాలకు 98 లక్షల అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి సున్నావడ్డీ పథకం కింద రూ.2362 కోట్లు కూడా జమ చేశాం. ప్రతి ఏటా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వమే నేరుగా సున్నావడ్డీ పథకం అమలు చేస్తున్నందున ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి అక్కకు చేయూతనిస్తున్నాం. చేయూత కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను చెయ్యి పట్టి నడిపిస్తున్నాం. 

పొదుపు సంఘాల్లో నిరర్ధక ఆస్తులు కేవలం 0.73 శాతం మాత్రమే. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడుతుందని సంకేతం. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో సీ, డీ గ్రేడ్‌లకు దిగజారిపోయిన సంఘాలన్నీ మన ప్రభుత్వ సహకారంతో తిరిగి ఏ గ్రేడ్‌లోకి చేరాయి. బ్యాంకులకు అక్కచెల్లెమ్మలు కడుతున్న రికవరీ రేటు 99.05 శాతంగా నమోదవుతుంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చరిత్రను తిరగరాయిస్తే.. అక్కచెల్లెమ్మలు మన రాష్ట్ర చరిత్రను తిరగరాస్తున్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి నిండు మనసుతో దీవెనలు ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏది చూసినా నా మీద, మన ప్రభుత్వం మీద చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయతలకు ఎన్నికల ఫలితాలే అద్దం పడతాయి. మీ ప్రేమానురాగాలకు మీకు ఎంత చేసినా తక్కువేనని అక్కచెల్లెమ్మలకు మరోసారి తెలియజేస్తున్నాను. అక్కచెల్లెమ్మల కుటుంబాలు సుస్థిరమైన ఆదాయం కల్పించి.. వారి జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకువేసింది. అందులో భాగంగానే వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తీసుకువచ్చాం. 

వరుసగా అక్కచెల్లెమ్మలకు చేయూతనందిస్తూ.. ఆసక్తి కనబర్చిన అక్కచెల్లెమ్మలకు సహాయమే కాకుండా.. సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్, శిక్షణ  ఇటువంటి అన్ని సహకారాలు ఇస్తూ.. జీవనోపాధి మార్గాలు సైతం చూపిస్తూ ఎటువంటి రిస్క్‌ కూడా లేకుండా అక్కచెల్లెమ్మలు ఎక్కడ నష్టపోకూడదనే తపన, తాపత్రయంతో ఇప్పటికే ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్థాన్‌ లివర్, అమూల్, అలాన గ్రూపు, మహేంద్రగ్రూపు, కేపీ గ్రూప్‌ వంటి వ్యాపార దిగ్గజాలు, బహుళజాతి సంస్థలు వీరితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని ప్రతి అక్కచెల్లెమ్మను వ్యాపారవేత్తగా రాణించేందుకు ప్రభుత్వం తోడుగా ఉండి నడిపించాం. 

కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకులతో అనుసంధానం చేసి మన ప్రభుత్వం అందించిన సహాయంతో ఇప్పటి వరకు 3,05,754మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు, ఆవులు, గేదెలు, గొ్రరెలు, మేకలు వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ మహిళల చరిత్రను వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రను కూడా మారుస్తూ మనం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని, వాటి వల్ల కలుగుతున్న మంచిని సవినయంగా మీ ముందుంచుతున్నాను. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలని నిండు మనసుతో చిత్తశుద్ధితో మన ప్రభుత్వం అడుగులు వేస్తున్నాం. 

జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతి ఏటా రూ.6500 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.13023 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు అందజేయడం జరిగింది. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 44 అని చెప్పి.. కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చే పరిస్థితి. ఈ రోజు 61 లక్షల మందికి రూ.2250 ఇస్తున్నాం. గతంలో పెన్షన్‌ కోసం ప్రభుత్వానికి రూ.450 కోట్లు అయితే.. మన ప్రభుత్వం పెన్షన్‌ల కోసం రూ.1450 కోట్లు ఖర్చు చేస్తుంది. 61 లక్షల్లో అక్షరాల 36.70 లక్షల మంది అవ్వలు, మహిళా వికలాంగులు, వితంతువులకు ఇచ్చిన మొత్తం రూ.20,894 కోట్లు అని గర్వంగా తెలియజేస్తున్నాను. 

వైయస్‌ఆర్‌ ఆసరా, ఈ పథకం ద్వారా ఇప్పటికే 7.97 లక్షల డ్వాక్రా సంఘాలకు 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రెండు విడతల్లో నేరుగా అందించిన లబ్ధి రూ.12,758 కోట్లు అవుతుంది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మంది 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రెండు విడతల్లో అందించిన లబ్ధి అక్షరాల రూ.8,944 కోట్లు. 

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇంటి స్థలం విలువల చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా 31 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ధి.. దాదాపుగా 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా.. ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఒక్కోఇంటి విలువ కనీసం అంటే ప్రతి అక్క చేతిలోనూ 5 నుంచి 10 లక్షల నేరుగా అందించినట్టు అవుతుంది. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో 2 నుంచి 3 లక్షల కోట్ల సంపద వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. 

జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. ఏ ఒక్క అక్కచెల్లెమ్మ తన పిల్లలను చదివించడానికి అప్పులపాలు అయ్యే దుస్థితి రాకూడదని జగనన్న విద్యా దీవెన ద్వారా 18.81 లక్షల మంది తల్లులకు ఇప్పటికే రూ.5,573 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా 15.58 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2,270 కోట్లు అందించడం జరిగింది. 

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తూ దాదాపుగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు నేరుగా వారి చేతికే అందించడం జరిగింది. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండాలని గర్భిణీల నుంచి బాలింతల వరకు పౌష్టికాహారం అందిస్తున్నాం. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, 6 ఏళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వైయస్‌ఆర్‌ ప్రీప్రైమరీ స్కూల్స్, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తూ అడుగులేశాం. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు చేస్తూ ఇందుకోసం రూ.2881 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశాం. 

అలాగే వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 3.28 లక్షల అక్కచెల్లెమ్మలకు అక్షరాల రూ.982 కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా చట్టం చేశాం. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా ఏకంగా చట్టం చేశాం. ఆంధ్రరాష్ట్ర కేబినెట్‌లో హోంమంత్రిగా ఒక మహిళకు స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రి ఎస్టీ మహిళకు స్థానం దక్కింది. 

ఎమ్మెల్సీలుగా ఇద్దరు మైనార్టీ మహిళలు, ఒక బీసీ మహిళకు స్థానం కల్పించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కూడా చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళను నియమించాం. 28నెలల కాలంలో ఇవన్నీ జరిగాయి. కార్పొరేషన్‌ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 52 శాతం పదవులు కేటాయించాం. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్లు, మేయర్లు వీటన్నింటిలో సగభాగంపైగా మన అక్కచెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్లుగా,  మేయర్లుగా అక్కచెల్లెమ్మలకు ఏకంగా 60.47 శాతం పదవులు ఇచ్చాం. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవం కనిపిస్తుంది. 13జెడ్పీ చైర్మన్లలో 7 మంది మహిళలే కనిపిస్తారు. ప్రకాశం జిల్లా చైర్మన్‌ కూడా మహిళే. 26 జెడ్పీ వైస్‌ చైర్మన్లలో 15 మంది మహిళలే ఉన్నారు. ఇవి చాలదా మహిళల పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రేమాభిమానాలు, ఆప్యాయతలకు నిదర్శనాలు సరిపోవా..

అంతేకాకుండా మద్యాన్ని నియంత్రించగలిగాం. దిశ యాక్ట్‌ను చట్టసభలో పాస్‌ చేసి కేంద్రానికి పంపించాం. దిశ యాప్‌ తీసుకువచ్చాం. అక్షరాల 75 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ ఉంది. అక్కచెల్లెమ్మలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఫోన్‌ షేక్‌ చేస్తే చాలా వెంటనే పోలీసులు వస్తారు. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ కనిపిస్తుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చిట్టితల్లుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. 7 నుంచి 12 వ తరగతి చదువుతున్న చిట్టితల్లుల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇలా అడుగడుగునా మహిళ పక్షపాతం చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటున్నా’  అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

Back to Top