శ్రీకాకుళం: 4 ఏళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 40 ఏళ్ల అభివృద్ధిని తీసుకుని వచ్చామని, సీఎం వైయస్ జగన్ అనేక పాలన సంబంధ సంస్కరణలను అమలు చేశారని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న విలీన పంచాయతీ సీపన్నాయుడు పేటలో గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు ఉన్నారు. ఆయనేం చేశారో చెప్పాలి ? ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలోనే అనేక పాలన సంస్కరణల అమలుతో యావత్ భారతావని దృష్టిని ఆకర్షిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతోంది. కానీ ఇప్పటిదాకా బ్రిటిషర్ల నాటి సర్వే రికార్డులనే పట్టుకుని తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చేక సమగ్ర భూ సర్వేకు ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక సాంకేతికతతో, శిక్షణ పొందిన సిబ్బందితో గ్రామాలలో మరో తగాదాకు తావు లేకుండా ఉండేందుకు పనిచేస్తోంది. సమగ్ర భూ సర్వేను ఎప్పుడో స్వాతంత్ర్యం పూర్వం నిర్వహించారు. వందేళ్ల తరువాత సమగ్ర భూ సర్వే నిర్వహిస్తూ, నిష్పాక్షిక ధోరణిలో పనిచేస్తున్నాం. ఒకనాడు గ్రామాలలో తగాదాలు అన్నీ భూ తగాదాలే. తద్వారా అశాంతి నెలకొనేది. కానీ ఇప్పుడు అటువంటి తగాదాలు అన్నవి లేవు. శత శాతం నిజాయితీతో, నిబద్ధతతో ఈ సర్వే చేపడుతున్నాం అని చెప్పేందుకు సంతోషిస్తూ ఉన్నాను. ఎక్కడ ఎక్కువ భూమి వినియోగంలో ఉంటుందో అక్కడ జీడీపీ గ్రోత్ రేట్ బాగుంటుంది అని గతంలో వెల్లడయిన వాస్తవం. అందుకే ఎక్కువ భూమిని వినియోగంలోకి తీసుకుని వచ్చి ఎక్కువ వర్గాలను ప్రభావితం చేసే విధంగా, తద్వారా ఆర్థిక లబ్ధి అందుకునే విధంగా,వారంతా పలు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెండు వేల గ్రామాలలో సమగ్ర భూ సర్వే పూర్తి చేశాం. ఇకపై మీ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం. డబుల్ రిజిస్ట్రేషన్లకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. రికార్డు అంతా స్పష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మీ చెంతకే పాలన తీసుకుని వచ్చాం. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పాలనలో మంచి సంస్కరణలు తెచ్చాం. వాటి ఫలాలు మీరంతా అందుకున్నారు. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది చూశారు. పాలన సంస్కరణలను చూశాక విపక్షాలు తట్టుకోలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. విజ్ఞత ఉన్న పౌరులంతా వీటిని తిప్పికొట్టాలి. మేలు చేసే ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలి. ఇవాళ దేశంలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విధి విధానాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్య వ్యవస్థ లో అనేక మార్పులు తీసుకు వచ్చాం. మన రిమ్స్ ఆస్పత్రిలో అనేక సదుపాయాలు అందుబాటులో తీసుకు వచ్చాం. ఈ రోజు ఒక్క పైసా లంచం తీసుకునే వారు ఎవ్వరూ లేరు. అంటే క్షేత్ర స్థాయిలో అవినీతిని అరికట్టగలిగాం. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా పనిచేసిన దాఖలాలు లేవు. నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేసి అందిస్తున్నాం. విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా ఉంటూ,శ్రీకాకుళం పట్టణానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నా..? పట్టణ మార్కెట్ ను గత ప్రభుత్వంలోనే మంత్రులు అచ్చెన్నాయుడు,నారాయణ ఎంపీ రామ్మోహన్ నాయుడు అనేక సార్లు సందర్శించారు. సందర్శించిన ప్రతిసారి మేదర వీధిలో ఉన్న బుట్టలను తన్నారే తప్ప మార్కెట్ ను ఏం అభివృద్ధి చేశారు..? కానీ మా ప్రభుత్వం మార్కెట్ ను ముందన్నెడు లేని విధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ప్రధాన రోడ్లు వేయించింది. ఇంకా అనేక పనులు చేపట్టింది. మరి ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండగా ఇవన్నీ చేయగలిగారా ? ఇవన్నీ ఆలోచించండి. ఎవరు మేలు చేశారు ? ఎవరు ప్రజల క్షేమం కోరి ఉన్నారు అన్నది మీరు బేరీజు వేసుకోండి. ఇవాళ కేవలం ఓట్లు కోసం చేపట్టిన కార్యక్రమం అయితే ఇది కాదు. నాలుగేళ్ల పాలనపై మీ అభిప్రాయం తెలుసుకునేందుకే వచ్చాను. అలానే నా దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాను. మీరంతా మరోసారి పాలనలో వచ్చిన మార్పులను గమనించండి. అలానే విపక్ష శ్రేణులు చెప్పే మాటలను నమ్మకండి అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, డాక్టర్ దానేటి శ్రీధర్, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు సాదు వైకుంఠ రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా అలివేలు మంగ, సీపాన రామారావు, పైడి రాజారావు, పొన్నాడ రిషి, వనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు