రాయచోటి : వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్‌పై బుధవారం రాత్రి హత్యాప్రయత్నం జరిగింది. బాధితుడి భార్య విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం దాదాపు 10 మంది వ్యక్తులు ఇంటికి వచ్చి గేటు తీయాలని అడిగారు. గేటు తీసిన భాస్కర్‌పై ఇనుప రాడ్లు, కట్టెలు, ట్యూబ్ లైట్లతో విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు. కాళ్లు పట్టుకున్నా వదలలేదు. తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తరువాత దుండగులు వీడియో, ఫొటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానికుల సహకారంతో గాయపడిన భాస్కర్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి అనుచరుల పనే..! మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆగ్రహించిన మంత్రి అనుచరులే తనపై దాడి చేసి ఉంటారని విజయభాస్కర్ పేర్కొన్నారు. తనకు రాయచోటిలో వేరే శత్రువులు ఎవరూ లేరని తెలియజేశారు. హేయమైన చర్య: వైయస్ఆర్‌సీపీ విజయభాస్కర్‌పై దాడిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాపక్షాన మాట్లాడేవారిని గొంతునొక్కాలన్న అరాచక ధోరణి ఇటీవల రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. గతంలో బీసీ నాయకులైన మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డెయ్య ఇంటిపై దాడి, మల్లూరు రెడ్డి వరప్రసాద్‌పై దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భాస్కర్‌పై దాడిచేసిన నిందితులను గుర్తించి 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుకు ఒక మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కాగా భాస్కర్‌పై దాడి దారుణమని పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి ఒక ప్రకటనలో ఖండించారు.