కొత్తపల్లి ఎంపీటీసీ హరినాథ్‌రెడ్డి పై ప‌చ్చ‌మూక‌ల దాడి 

ఆసుప‌త్రిలో హ‌రినాథ్‌రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ పరామర్శ

నంద్యాల జిల్లా : నంద్యాల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై ప‌చ్చ‌మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. గాయాలపాలైన హరినాథ్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ  నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవికిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని హరినాథ్ రెడ్డిని పరామర్శించారు. నాయకులు డాక్టర్లతో మాట్లాడి హరినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను వెంటనే అందించాలని వైద్య బృందాన్ని కోరారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తరువాత, జిల్లా పరిస్థితులపై స్పష్టమైన నివేదికను తెలుసుకోవడం కోసం కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల జిల్లా ఎస్పీని కలసి, దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు విధించాలన్నారు. ఈ దాడి రాజకీయంగా ఉద్రిక్తతను పెంచగా, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండించారు. హరినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Back to Top