తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో మహిళల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయని, మళ్లీ మహిళల జీవితాల్లో వెలుగులు రావాలంటే వైయస్ జగన్ గారిని సీఎంని చేసుకుంటేనే సాధ్యమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పార్టీ మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్ గారి పాలనలో మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా అండగా నిలబడ్డామని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కీలకమైన పదవులు మహిళలకు ఇచ్చి గౌరవించామని చెప్పారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల మానప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని, ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ఉన్మాదులు మద్యం మత్తులో అత్యాచారాలు చేసి చంపేస్తున్నారని మండిపడ్డారు. అయినా మంత్రులుగా ఉన్న అనిత, సవిత, సంధ్యారాణిలు ఏమాత్రం స్పందించక పోవడం రాష్ట్ర మహిళల దౌర్భాగ్యమని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి పేరును వాడుకుని, ఆ బాలిక తల్లి కన్నీళ్లతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎన్నో అబద్ధాలతో మహిళలను మోసగించాడని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ గారి నాయకత్వంలో మహిళలంతా ఒక్కటై ఉద్యమిస్తే ఈ అరాచకాలకు చరమగీతం పాడగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించడమే కాకుండా, థాయ్‌లాండ్, ఉగాండా, జపాన్, ఈజిప్ట్ వంటి దేశాల్లో అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన పడాల రూపాదేవిని ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో పారా ఒలంపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనూరాధ, నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, ఏపీఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ పుణ్యశీలతో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ● చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది - వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలంటే వైయస్ జగన్ గారికి ఎంతో గౌరవ, మర్యాదలు. మహిళల శక్తి, సామర్థ్యాల మీద ఆయనకు అపారమైన విశ్వాసం. అందుకే తాను సీఎంగా పనిచేసిన ఐదేళ్లూ మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహించారు. అధికారంలో ఉండగా వైయస్ఆర్‌సీపీలో మహిళలకు దక్కినన్ని అవకాశాలు, రాజకీయంగా ఇచ్చిన ప్రోత్సాహం దేశంలో మరే ఇతర పార్టీలోనూ ఇవ్వలేదు. అదేవిధంగా పార్టీలోనూ మహిళలకు అంతే ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం వైయస్ జగన్ గారి గొప్పతనానికి నిదర్శనం. కుటుంబాన్ని నడిపే మహిళలకు సమాజాన్ని ముందుకు నడిపించగలరన్న నమ్మకంతో వైయస్ జగన్ గారు ఉంటారు. కాబట్టే నాడు తల్లుల ఖాతాల్లో ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేయడం, అమ్మ ఒడి స్కీమ్, ఇంటి పట్టాల పంపిణీ.. ఇలా ఏ పథకం చూసినా నాడు మహిళలకే అధిక ప్రాధాన్యం లభించింది. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మహిళలను వెలుగు నుంచి చీకటిలోకి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ బాధలు అనుభవిస్తున్నది కూడా మహిళలే. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ మత్తులో మహిళలపై ఉన్మాదులు దారుణాలకు తెగబడుతున్నా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పథకాల పేరిట మహిళలను దారుణంగా వంచించిన చరిత్ర చంద్రబాబుది. 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ మహిళలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలపై ఉద్యమించాలి. ఈ రాక్షస పాలనకు మహిళలే చరమగీతం పాడినప్పుడే ప్రతి కుటుంబంలోనూ సంతోషం ఉప్పొంగుతుంది. వైయస్ఆర్‌సీపీలో పురుషులతో సమానంగా మహిళల ఎదుగుదలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. 2029లో జరగబోయే ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీలో మహిళలే కీలకపాత్ర పోషించాలి. ● జగనన్న సీఎం అయితే మహిళలకు మంచి రోజులు - మాజీ మంత్రి ఆర్కే రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజు నేను, వరుదు కళ్యాణి ఈ స్థానంలో ఉన్నామంటే అది వైయస్ జగన్ గారు ఇచ్చిన ప్రోత్సాహమే. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పురుషులతో పాటు ఎన్నో పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ప్రోత్సహించి గౌరవించిన వైయస్ జగన్ గారిని తిరిగి సీఎం చేసుకుంటేనే మళ్లీ మహిళలకు మంచి రోజులొస్తాయి. గతంలో వైయస్ గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు మనం గుర్తించడమే కాకుండా అందరికీ తెలిసేలా చెప్పాల్సిన బాధ్యత వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగానిదే. 20 నెలల చంద్రబాబు పాలన చూసి రాష్ట్రంలోని ప్రతి మహిళ విసిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మహిళా సంక్షేమ పాలన పోయి, నారాసుర పాలన వచ్చింది. చంద్రబాబు కేబినెట్‌లో అనిత, సవిత, సంధ్యలు మంత్రులు కావడం రాష్ట్ర మహిళల దురదృష్టం. హోంమంత్రిగా ఉన్న మహిళ ఆ సంగతి తప్ప అన్ని విషయాలను పట్టించుకుంటుంది. ఇంకో మహిళా మంత్రి పీఏ కారణంగా మహిళల జీవితాలు నాశనమవుతున్నాయి. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా చూసీచూడనట్టు వదిలేస్తున్న ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న అనిత, సవిత, సంధ్యారాణికి మహిళా దినోత్సవంలో పాల్గొనే అర్హతే లేదు. ఒక్క చాన్స్ ఇస్తే ఆడవారి తలరాతలు మార్చేస్తానని, సుగాలి ప్రీతి పేరు వాడుకుని, ఆమె తల్లి కన్నీళ్లను వాడుకుని గెలిచిన పవన్ కళ్యాణ్ వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. వాలంటీర్ల వేతనాలు రూ. 10 వేలు చేస్తానని చెప్పి చివరికి ఉద్యోగమే లేకుండా చేసి మోసగించాడు. తప్పిపోయిన 30 వేల మంది మహిళలను తీసుకొస్తానని చెప్పి 20 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో మహిళలందరి ధైర్యం జగనన్నే. కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ న్యాయం చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఈవీఎం వల్లే మనం ఓడిపోయామని ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. 20 నెలల్లో మహిళలను పూర్తిగా వంచించిన కూటమి నాయకులు గ్రామాల్లో తిరగడానికే భయపడిపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు మహిళలను మోసగించినా ఇందులో తప్పేముందని మాట్లాడే వారిని దేవుడే చూసుకుంటాడు. బీఆర్ నాయుడు సహా లడ్డూ గురించి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరినీ దేవదేవుడే వరుసపెట్టి శిక్షిస్తున్నాడు. ఆయన్ను రాజీనామా చేయించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని ఆర్కే రోజా అన్నారు.