మనది ఇండస్ట్రీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం

రామ్‌కో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

కొలిమిగుండ్లలో రామ్‌కో ఫ్యాక్టరీని ప్రారంభించడం సంతోషంగా ఉంది

30 నెలల్లోనే సిమెంట్‌ ఉత్పత్తికి ఫ్యాక్టరీ రెడీ అవ్వడం గొప్ప మార్పునకు చిహ్నం

వరుసగా మూడో ఏడాది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమస్థానంలో నిలిచాం

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది

ఈవోడీబీలో ఏపీ నంబర్‌.1 స్థానానికి రామ్‌కో ఫ్యాక్టరీ స్థాపనే ఉదాహరణ

కొలిమిగుండ్లలో రామ్‌కో పరిశ్రమ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు

మంచి పరిశ్రమ నెలకొల్పిన రామ్‌కో యాజమాన్యానికి అభినందనలు

నంద్యాల: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని సగర్వంగా చెప్పేందుకు రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ స్థాపనే ఒక ఉదాహరణ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రామ్‌కో ప్రాజెక్టు 2019లో మన ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల కాలంలో స్టార్ట్‌ అవ్వడం, 30 నెలల్లోనే సిమెంట్‌ ఉత్పత్తికి రెడీ అవ్వడం గొప్ప మార్పునకు చిహ్నమని సీఎం అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో నెలకొల్పిన రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..

ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ ఒక పరిశ్రమ రావడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో అందరికీ తెలుసు. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా, ఇక్కడే దొరికితే ఎంత మంచి జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక్కడ విస్తారంగా సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ గతంలో ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ దాదాపు 2 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ కెపాసిటీతో పాటు, 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ కెపాసిటీతో ప్లాంట్‌ ఏర్పాటైంది. ఈ 2 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ కెపాసిటీ మొత్తంగా 3 మిలియన్‌ టన్నుల సిమెంగ్‌ ఉత్పత్తి చేస్తుంది.

స్థానికులకు ఉద్యోగావకాశాలు:
ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్‌ తొలి దశ మాత్రమే. ఇది ఇంకా విస్తరిస్తూ పోతుంది. దాని వల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా మంచి జరుగుతుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఎలాగూ చట్టం చేశాం కాబట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి.

కేవలం 30 నెలల్లోనే..:
రామ్‌కో సిమెంట్స్‌ కంపెనీ యాజమాన్యం.. వెంకట్‌రమణరాజు అన్నకు ఇక్కడ మన ప్రాంతంలో మంచి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాౖటైన తొలి దశ ప్లాంట్‌లో దాదాపు 1000 మందికి ఉద్యోగవకాశాలు కూడా వచ్చే ఒక మంచి పని ఇక్కడ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కూడా కేవలం 30 నెలల్లోనే, అంటే 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ప్రాజెక్టు మొదలైంది. పనులు కూడా చాలా వేగంగా పూర్తి చేసింది. సులభతర వాణిజ్యానికి (ఈఓడీబీ) ఒక మంచి ఉదాహరణ ఏదైనా ఉందంటే, ఇంతకు మించి లేదు. ఇక్కడ ప్రభుత్వం అందించిన పూర్తి సహాయ, çసహకారాలు.. ఎమ్మెల్యే మొదలు, కలెక్టర్, అధికారులు, సాక్షాత్తూ సీఎం వరకు ప్రతి అడుగులో ఎలాంటి జాప్యం లేకుండా చూశారు. అలా సహాయ సహకారాలు అందిస్తేనే ఏ కంపెనీ అయినా వేగంగా నిర్మాణం అవుతుంది. 1961లో రోజుకు 200 టన్నుల కెపాసిటీ.. అంటే ఏటా 0.4 మిలియన్‌ టన్నులతో మొదలు పెట్టిన ప్లాంట్‌ ఇవాళ 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రతి చోటా కూడా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు ఉంటే, 11 చోట్ల గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రతి ఉత్పత్తి కేంద్రం వద్ద కెపాసిటీ పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. మీకు ఇక్కడ ప్లాంట్‌ నిర్మాణంలో ఎలాంటి సహాయ, సహకారాలు అందించామో.. ఆ ప్లాంట్‌ నడిపే సమయంలో ఇస్తాము. ఎందుకంటే అది ప్లాంట్‌ విస్తరణలో ఎంతో దోహదం చేస్తుంది. 

కర్నూలుకు మేలు:
ఇక్కడ ఇటీవలే గ్రీన్‌కో ప్రాజెక్టు తలపెట్టిన 5400 మెగావాట్ల కెపాసిటీతో సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి.. పంప్‌ స్టోరేజీతో రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కొద్ది నెలల క్రితమే నేను పునాదిరాయి వేశాను. అక్కడ దాదాపు 2600 ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆ విధంగా కర్నూలు జిల్లాకు మేలు జరుగుతుంది.

భారీగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు:
ఇక్కడ రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు రావాలంటే.. అది గ్రీన్‌ ఎనర్జీ ద్వారా సాధ్యం అని నమ్ముతున్నాం. అదే విధంగా వాటి ద్వారానే రైతులకు కూడా మేలు జరుగుతుంది. అందుకే గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే గ్రీన్‌కో, ఇండోసాల్, ఆర్సిలర్‌ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు ఈ మధ్య కాలంలోనే రూ.72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. మరో మూడు, నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి. దాని వల్ల ఈ ప్రాంతంలోనే అక్షరాలా 20 వేల ఉద్యోగాలు వస్తాయి.

ప్రభుత్వం–గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు:
ఈ గ్రీన్‌ ఎనర్జీ వల్ల జరిగే మరో మంచి ఏమిటంటే.. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారికి, అలాగే రైతులకు కూడా చెబుతున్నాను. ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి. ఎక్కడైనా రైతులు భూములు లీజ్‌కు ఇవ్వడానికి ముందుకు వస్తే ఎకరాకు రూ.30 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ మేరకు లీజ్‌ ఒప్పందం చేసుకుంటుంది. అది 30 ఏళ్లు కావొచ్చు. లేదా 50 ఏళ్లకు కావొచ్చు. ఎకరాకు రూ.30 వేలు ఇస్తుంది. ప్రతి మూడేళ్లకు 5 శాతం పెంచుతాం. ఆ విధంగా ప్రభుత్వం భూములు లీజ్‌కు తీసుకుని, సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల ఉత్పత్తి చేసే విధంగా ప్రాజెక్టులు రావాలి. అంటే కనీసం 1500 నుంచి 2 వేల ఎకరాల వరకు భూమి కావాలి. ఆ మేరకు రైతులు క్లస్టర్‌గా ముందుకు ఏర్పడాల్సి ఉంది. ఆ మేరకు గ్రామాలు, రైతులు ముందుకు రావాలి. అలా వస్తే ప్రభుత్వమే ఎకరాకు రూ.30 వేలు ఇస్తూ, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. దీన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను.

ఈఓడీబీలో టాప్‌:
ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంది. ఆ దిశలోనే అడుగులు కూడా వేస్తోంది. ఈ మధ్య కాలంలో మీరంతా గమనించే ఉంటారు. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో వరసగా మూడో ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నెంబర్‌ వన్‌గా నిల్చింది. దానికి కారణం ఏమిటంటే.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టిన వారి అభిప్రాయం కూడా తెలుసుకుని, మార్కులు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న సహకారం, చేయి పట్టుకుని నడిపిస్తున్న విధానాలు వివరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి చేస్తున్న సహాయం, ఇస్తున్న ప్రోత్సాహం.. ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని సులభతర వాణిజ్యంలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిల్పింది. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన విషయం అని తెలియజేస్తున్నాను.

గ్రోత్‌రేట్‌లోనూ అగ్రస్థానం:
సులభతర వాణిజ్యంలో మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా నిలవడం ఒక అంశం అయితే, మరోవైపు 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్‌ రేట్‌ 11.43 శాతంలో ఉండడం.. దేశంలోనే అత్యధికంగా నెంబర్‌ వన్‌గా నిల్చాం. ఇది కూడా గొప్ప మార్పు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం.. మరోవైపు ప్రభుత్వ పూర్తి సహాయ, సహకారాలు. వీటన్నింటి వల్లనే ఇవి సాధ్యమవుతున్నాయని అందరూ గుర్తించాలి.

ఇటీవలే పలు కంపెనీలు:
దేవుడి దయతో ఈ మధ్య కాలంలోనే దాదాపు 1000 కోట్లతో ఏర్పాటైన గ్రాసిమ్‌ ఇండస్ట్రీని ప్రారంభించాం. అక్కడ 1150 ఉద్యోగావకాశాలు వచ్చాయి. కుమార మంగళం బిర్లా ఆ కంపెనీ ఏర్పాటు చేశారు. అలాగే రూ.700 కోట్ల పెట్టుబడితో, దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అపాచీ షూ కంపెనీని చిత్తూరు, పులివెందులలో కూడా ప్రారంభించాం. టీసీఎల్‌ ప్యానెల్‌ ఉత్పత్తి. దాదాపు రూ.1700 కోట్ల పెట్టుబడి. డాదాపు 3100 మందికి ఉద్యోగావకాశాలు. విశాఖలో ఏటీసీ టైర్స్‌. దాదాపు రూ.2200 కోట్ల పెట్టుబడి. దాదాపు 2 వేల మందికి ఉపాధి. దాన్ని కూడా ప్రారంభించాం. 

పోర్టులు–ఫిషింగ్‌ హార్బర్లు:
ఇంకా రామయపట్నం పోర్టుకు పునాదిరాయి వేశాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉంటే, ఈ మూడేళ్లలో మరో నాలుగు పోర్టులు.. రామయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడులో ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్‌ హార్బర్‌ లేదా పోర్టు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. వీటన్నింటి వల్ల రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు జరిగితే, మరో 5 ఏళ్లలో ఆ సామర్థ్యం రెట్టింపు.. అంటే రూ.3.40 లక్షల కోట్ల ఎగుమతులు జరిగేలా అడుగులు పడుతున్నాయి.

పారిశ్రామిక కారిడార్లు:
ఇంకా దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. అవన్నీ పూరై్తతే చాలా మార్పులు వస్తాయి.

ఉజ్వల భవిష్యత్తు:
వైయస్సార్‌ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్, అదే జిల్లాలో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ), తిరుపతి చేరువలో మరో ఈఎంసీ. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఊపందుకుంటే.. చదువుకుంటున్న మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే దొరికే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రం వైపు చూస్తాయి.

చివరగా..
ఈ పరిశ్రమకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరి మద్దతు కూడా ఈ ప్రాజెక్టుకు ఉండాలని ఆశిస్తున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

తాజా వీడియోలు

Back to Top