న్యూఢిల్లీ: రాజమహేంద్రవరంలో దళిత యువకుడు పులి సాగర్‌పై పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన ఘటనలో బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువకుడితో కలిసి వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం, ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్ విజయభారతి సాయానీని కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్‌తో కలిసి, పోలీసు బాధిత యువకుడు పులి సాగర్ తనపై జరిగిన దౌర్జన్యాన్ని జాతీయ ఎస్సీ కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వివరించారు. నగరంలోని ఒక కాలనీలోని స్థానిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, ప్రకాశ్‌నగర్ పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి, అర్ధనగ్నంగా సెల్‌లో నిలబెట్టారని, పైగా అక్కడ మహిళా కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టారని పులి సాగర్ తెలిపారు. తన విద్యార్హతలు, కులంతో పాటు ఇతర వివరాలతో స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత, సీఐ ఎస్‌కె బాజీ తీవ్ర దుర్భాషలాడారని, కులం పేరుతో దూషించారని.. చివరకు హతమారుస్తామని కూడా బెదిరించారని చెప్పారు. పార్టీ ఓటమితో సైకోగా మారి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటూ, పోలీసులు ఒక కాగితంపై రాసి, తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని పులి సాగర్ వెల్లడించారు. కాగా, ఫిర్యాదుల అనంతరం ఎంపీలు గొల్ల బాబూరావు, గురుమూర్తి, మాజీ ఎంపి మార్గాని భరత్ మాట్లాడుతూ, విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ పట్ల రాజమహేంద్రవరం, ప్రకాశ్‌నగర్ స్టేషన్ పోలీసులు దారుణంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజా సమస్యపై ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణించారని, కేసు నమోదు సందర్భంలో చట్ట పరంగా అనుసరించాల్సిన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని వారు తెలిపారు. ముందుకు 41–ఏ కింద నోటీస్ ఇవ్వకుండానే, స్టేషన్‌కు పిలిపించి, అర్ధనగ్నంగా సెల్‌లో వేసి వేధించారని, దారుణమైన పదజాలంతో దళిత యువకుడిని దుర్భాషలాడుతూ, చివరికి చంపి పారేస్తే నీకు దిక్కులేదు అంటూ బెదిరించారని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, భావ ప్రకటన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని వైయస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. నాగరిక సమాజంలో ఇటువంటి సంఘటనలు సిగ్గుచేటన్న వారు, తక్షణం దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించి, విచారణ జరిపి, అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, దళిత యువకుడికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.