నెల్లూరు: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో అక్రమంగా బనయించిన కేసులో భాగంగా విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయానికి వైయస్ఆర్‌సీపీ నేత, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. తన న్యాయవాదులతో విచారణకు హాజరైన ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసులు పలు ప్రశ్నలు సంధించగా వాటికి సమాధానం ఇచ్చారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు ఆయన తరఫు న్యాయవాదులు ష్యూరిటీ ప్రొడ్యూస్ చేశారు. కాగా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వారి ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో ఈ నెల 7వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీడీపీ మూకలు మారణాయుధాలతో సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేస్తామని బెదిరించి ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఇంటి గోడలు మినహా ప్రతి గదిలోని వస్తువులు, ఫర్నీచర్‌తో సహా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అదే రోజు అర్ధరాత్రి ప్రసన్న అనుమానితుల పేర్లను ఊటంకిస్తూ వేమిరెడ్డి దంపతులు తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని నగర డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే దర్గామిట్ట పోలీసులు జీడీ ఎంట్రీతో సరి పెట్టారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు ప్రసన్నపై పోలీసులు విచారణ మొదలుపెట్టడం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడినట్లు 60 మందిని గుర్తించినా, ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసుల తీరుపై వైయస్ఆర్‌సీఈప శ్రేణులు మండిపడుతున్నారు.