పోలీసుకు వీక్లీ ఆఫ్ - .ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ నేడు యువ ముఖ్య‌మంత్రికి త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటోంది. శెల‌వ‌లు అనేవి లేకుండా ప‌ని చేస్తున్న శాఖ‌ల్లో పోలీస్ శాఖ గురించే ముందు చెప్పుకోవాలి. బందోబ‌స్తుల నుంచి మొద‌లు నేరాల‌ను అరిక‌ట్ట‌డం వ‌ర‌కూ అన్ని విధుల్లోనూ పోలీసులు 365 రోజులూ విశ్రాంతి లేకుండా ప‌ని చేస్తున్నారు. వారానికి ఒక రోజు శెల‌వు ఇవ్వ‌డం ద్వారా మ‌రింత మెరుగ్గా చ‌లాకీగా విధి నిర్వ‌హ‌ణ చేసే అవ‌కాశం పోలీసు వారికి ఇచ్చిన‌ట్టు అయ్యింది. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వ‌ర‌కూ ఈ నిర్ణ‌యం వ‌ర్తిస్తుంది. ముఖ్య‌మంత్రి తీసుకున్న ఈ నిర్ణ‌యంపై పోలీసులు, వారి కుటుంబాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. 

70,000 మందికి ప్ర‌యోజ‌నం

తాజా నిర్ణ‌యం ద్వారా పోలీసు శాఖ‌లో 70,000 మందికి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. మంగ‌ళ‌వారం పోలీస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ర‌విశంక‌ర్ అయ్య‌న్నార్ ఛైర్మ‌న్ గా 21 మందితో ఏర్పాటు చేసిన క‌మిటీ స‌మావేశంలో డీజీపీ డి.గౌత‌మ్ స‌వాంగ్ సైతం పాల్గొన్నారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని విశాఖ, కడప, ‘ప్రకాశం’ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలు చేసారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి మొత్తం 70 వేల మంది పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం 19 ఆప్షన్స్‌ (మోడల్స్‌)ని ఎంపిక చేసారు. ప్రతీ యూనిట్‌ ఆఫీసర్‌ వాటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసుకోవ‌చ్చు. ప్రతి యూనిట్‌ నుండి రెండు నెలలకోసారి సమాచారం తీసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేయ‌నున్నారు.

ఒత్తిడి త‌గ్గించేలా

ప‌ని ఒత్తిడి పెరిగిపోవ‌డంతో పోలీసుల్లో గుండె, కిడ్నీ, డ‌యాబెటిస్, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు ఎక్కువౌతున్నాయి. ఇది వారి విధి నిర్వ‌హ‌ణ‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. పోలీసుల‌ ఆరోగ్య భద్ర‌త‌కు, సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లను కూడా ముఖ్య‌మంత్రికి నివేదిక స‌మ‌ర్పించారు పోలీసు ఉన్న‌తాధికారు. వీటిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ప్ప‌క నెర‌వేరుస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. 

పోలీస్ శాఖ‌లో భ‌ర్తీలు వేగ‌వంతం 

పోలీసు శాఖలో ఉన్న 20 శాతం ఖాళీలను భర్తీచేసేలా ప్రభుత్వానికి నివేదిక అందించారు రవిశంకర్‌ అయ్యన్నార్‌. మొత్తం 12,300 ఖాళీలున్నాయని కమిటీ రిపోర్టులో పేర్కొంది. వీఐపీ, యాంటీ నక్సల్స్‌ విధులకు ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వం ఖాళీలు భర్తీచేసేలా చర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు. 

పాల‌న‌లో త‌న‌దైన మార్క్

ఇచ్చిన హామీలు వేగంగా నెర‌వేర్చ‌డమే కాదు సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు పాల‌న‌లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉండగా కొంద‌రు పోలీసు అధికారుల తీరు, ప్ర‌భుత్వ అనుకూల వైఖ‌రిని ఖండించారు వైఎస్ జ‌గ‌న్. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అప్ప‌టి విష‌యాల‌నేవీ మ‌న‌స‌లో పెట్టుకోకుండా పోలీసుల సంక్షేమానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

వీక్లీఆఫ్‌ అమలుకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లకు ఏపీ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్న ముఖ్య‌మంత్రిని పోలీసు ఉన్న‌తాధికారులంద‌రూ అభినందిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top