గొల్లప్రోలు: కుల, మత, ప్రాంత, వర్గ, చివరకు పార్టీలు కూడా చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పిఠాపురం నియోజకవర్గ వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసేందుకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్‌కు కాకినాడ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలులో వైయస్‌ఆర్ కాపునేస్తం పథకం అమలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెండెం దొరబాబు మాట్లాడారు. ‘పిఠాపురం నియోజకవర్గానికి సీఎం వైయస్ జగన్ రూ.422 కోట్లతో హార్బర్ ఇచ్చారు. సాగరమాల రోడ్డును ఉప్పాడ తీర ప్రాంతంలో ఇచ్చారు. వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. ఏలేరు ఆధునీకరణ ఆరోజున దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–1 60 శాతం పూర్తయింది.. మిగతా పనులు పూర్తిచేసి.. ఫేజ్–2 కోసం రూ.200 కోట్లు ఇచ్చి పూర్తిచేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ కొత్తగా ఏర్పడిన సందర్భంగా సపరేట్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని, నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎంను కోరారు.