కలలో కూడా ఊహించని సువర్ణ అవకాశమిచ్చారు

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు

రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

అమరావతి: భారత పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవ్వడం సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన సువర్ణ అవకాశమని రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. పార్లమెంట్‌లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదని, ఇటువంటి సువర్ణ అవకాశం ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌ ఆవరణలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురువులు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన స్వర్గీయ రాయవరం మునసబు, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి జన్మజన్మలకి రుణపడి ఉంటానన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ఆర్థికంగా రాష్ట్రం  క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. కోవిడ్‌ వల్ల అనుకోని ఇబ్బందుల్లో పడ్డామని, ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి ప్రత్యేక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమం రెండు సమాంతరంగా అమలు చేస్తున్నామన్నారు. విభజన చట్టంలో చెప్పిన విధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇతర అంశాలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. 
 

Back to Top