తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్ సంస్కృతి కొనసాగుతోందని మాజీమంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 9వ తేదీ (బుధవారం) పుంగనూరు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడి కార్యక్రమాలు చేపట్టిందని విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటనతో పాటు, ఆ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని సైతం అరెస్ట్ చేసిందన్నారు. సోమవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానివేసి ఇచ్చిన హామీలు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. కాగా, పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. అదే సమయంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.