తాడేపల్లి: రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ఈ నిరసన కార్యక్రమంలో రైతులు వేలాదిగా పాల్గొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత పోరును అడ్డుకునేందుకు హౌస్ అరెస్టులు, ముందస్తు నోటీసులతో విఫలయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు త్వరలోనే రానున్నాయని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పంటలకు గిట్టుబాటు ధర, యూరియా కొరత, ఉచిత పంటల బీమా అమలు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్నదాత పోరు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 74 చోట్ల ఆర్డీఓ కార్యాలయాలతోపాటు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఈ ప్రభుత్వం ఉలిక్కిపడింది. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు నిరసన కార్యక్రమంలో పాల్గొనకూడదని నోటీసులిచ్చి కేసులు పెడతామని బెదిరించారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అయినా అవన్నీ లెక్క చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదంతొక్కారు. శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు నిరసన ర్యాలీల్లో పాల్గొనకుండా హౌస్ అరెస్టులతో పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మేము అడ్డుకోవడం లేదని డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే దీన్ని ఏమనుకోవాలి? ఈరోజు ఉదయం రైతులంతా వేలాదిగా రోడ్లపైకొచ్చి ధర్నాలు చేయడం చూసి అడ్డుకోవడం మంచిది కాదని గ్రహించి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తారా? ఎలాగైనా అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అడుగడుగునా నిర్బంధాలు విధించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి బెదిరింపులకు, ఆంక్షలకు వైయస్ఆర్‌సీపీ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. నష్టపోయిన రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మెడలు వంచైనా రైతుల డిమాండ్లు సాధించుకుంటాం. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేదు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే తన సిద్ధాంతానికే కట్టుబడి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. కాబట్టే రైతులు వ్యవసాయంలో నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 15 నెలల కాలంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర దొరికింది లేదు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో కనిపించడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా రైతులు పంపిణీ కేంద్రాల వద్ద రోజంతా క్యూలైన్లలో నిలబడుతున్నా కనీసం బస్తా కూడా ఇవ్వడం లేదు. రైతులు ధర్నాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు వారికి పార్టీల ముద్ర వేసి బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లో సైతం యూరియా కొరత మీద రోజూ ఏకరువు పెడుతున్నారు. వ్యవసాయాన్ని కూడా రాజకీయం చేయడం దుర్మార్గం. రైతుల సంక్షేమాన్ని పణంగ పెట్టి మరీ వ్యవసాయరంగానికి పంపిణీ చేయాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కి తరలించి జేబులు నింపుకుంటున్నారు. భోజనాల కోసం నిలబడినప్పుడు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడలేరా అని మంత్రి అచ్చెన్నాయుడు రైతులను హేళనగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం. ఒకపక్క యూరియా కొరత లేదంటూనే, రాష్ట్రానికి యూరియా తెప్పించడానికి కేంద్రంతో మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు ఎలా చెబుతున్నారు? భూమిని నమ్ముకుని మనందరికీ పట్టెడన్నం పెడుతున్న రైతును కన్నీరు పెట్టిస్తున్నారు. అడుగడుగునా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం వారి ఉసురు తగిలి కొట్టుకుపోవడం తథ్యం. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన రైతులే ఈ పాలన చూసి విసిగిపోయారు. అసమర్థ పాలనతో రైతులకు అవస్థలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినప్పుడల్లా సమీక్షల పేరుతో కాలయాపన చేయడం, కేంద్రానికి లేఖలు రాసేసి చేతులు దులిపేసుకోవడం తప్పించి రైతుల సమస్యలను పరిష్కారించాలని చిత్తశుద్ధితో ఏనాడూ ఆలోచించలేదు. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం 60 శాతానికి పడిపోయింది. అవసరాలు సగానికి తగ్గినా యూరియాను పంపిణీ చేయలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైందో అర్థమైపోతుంది. పేపర్ల మీద మాత్రం యూరియా సమృద్ధిగా ఉందని చూపిస్తున్నారు. కానీ రైతులు ఎమ్మార్పీ ధర కన్నా రూ.200 అధికంగా చెల్లించినా బస్తా యూరియా దొరకని పరిస్థితి. టీడీపీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూస్తున్నారు. 2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా నిలవడం జరిగింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టి నడిపించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. కానీ నేడు చంద్రబాబు నేతృత్వంలో వ్యవసాయాన్ని దెబ్బతీయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు.