ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టించి.. ఎమ్మార్పీ ధర కంటే బస్తాపై రూ.200 అధికంగా విక్రయిస్తూ తమను దోపిడీ చేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న టీడీపీ కూటమి సర్కార్‌పై రైతులు తిరగబడ్డారు. టమాటా, మిర్చి, పొగాకు నుంచి బత్తాయి, ఉల్లి వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి, ధీమా లేకుండా చేయడంతోపాటు వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యధావిధిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించింది. దాంతో.. పోలీసు యాక్ట్–30 అమల్లో ఉందని, నిరసన కార్యక్రమాలు చేపట్టినా.. పాల్గొన్నా కేసులు పెడతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున బారికేడ్లు పెట్టి.. రైతులు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరించారు. గృహ నిర్బంధాలను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయలేదు. పోలీసుల బెదిరింపులకు రైతులు అదరలేదు, బెదరలేదు సరికదా తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు వేలాదిగా కదలివచ్చి.. టీడీపీ కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతు ద్రోహి చంద్రబాబు..’ అంటూ నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత రాజమహేంద్రవరంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణరెడ్డి రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య నేతలు, రైతులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో కదం తొక్కుతున్న రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆంక్షలు విధించినప్పటికీ నేతలు, రైతులు లెక్క చేయలేదు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవో కార్యాలయాల సమీపంలో పోలీసులు రైతులను నిలువరించడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో విజయవంతంగా సాగింది. అనకాపల్లి జిల్లాలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విశాఖ జిల్లాలో ఉద్రిక్తత నడుమ అన్నదాత పోరు విజయవంతమైంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కు నోటీసులు ఇచ్చి, పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తలను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అన్ని చోట్లా ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోలకు వినతిపత్రం అందజేశారు. ఆంక్షలను లెక్క చేయని ‘సీమ’ రైతులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ‘అన్నదాత పోరు’ విజయవంతమైంది. పలుచోట్ల అడుగడుగునా ఆంక్షలు విధించినా కర్షకులు పట్టుదలతో కదం తొక్కారు. కర్నూలు జిల్లాలో యూరియా సంచులు, వరి, ఉల్లి పంటను చేత బట్టి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరులో మీడియాను సైతం అనుమతించ లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా ప్రశ్నించడంతో ముఖ్య నాయకులు, మీడియాను లోనికి అనుమతినిచ్చారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రైతుల భారీ బైక్ ర్యాలీ అయినప్పటికీ పలువురు నేతలు, రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. సూళ్లూరుపేటలో పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్ని చోట్లా అన్నదాత పోరు విజయవంతమైంది. తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుని ఉంటే.. ఎరువులు, విత్తనాల కోసం రైతుల వారి కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో రైతు పోరు హోరెత్తింది. రాయచోటిలో జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల నినాదాలతో హోరెత్తిన రాష్ట్రం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించలేని ప్రభుత్వం డౌన్ డౌన్.. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన కూటమి సర్కార్ డౌన్ డౌన్.. గిట్టుబాటు ధర కల్పించలేని కూటమి సర్కార్ డౌన్ డౌన్.. అంటూ రైతులు చేసిన నినాదాలతో రాష్ట్రం మారుమోగిపోయింది. రైతులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ల కార్యాలయాలకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. అవసరమైన మేరకు ఎరువులు అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, వర్షం వల్ల పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా పోలీసులు నిర్బంధించినా.. కేసుల పేరుతో బెదిరించినా రైతులు బెదరకుండా వేలాదిగా కదలివచ్చి కదంతొక్కడంతో వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 15 నెలల పాలనలో టీడీపీ కూటమి సర్కార్‌పై రైతుల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీల్లో ఎక్కడికక్కడ వేలాది మంది కర్షకులు కదం తొక్కడమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసుల ద్వారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం.. 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రైతులు సమరోత్సాహంతో రణభేరి మోగించడం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అన్నదాత పోరులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ర్యాలీగా వెళుతున్న రైతులు గతేడాది డిసెంబర్ 13న అన్నదాతల సమస్యలపై రైతు పోరు.. డిసెంబర్ 27న కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన విద్యుత్ పోరు.. మార్చి 12న యువత సమస్యలపై నిర్వహించిన యువత పోరు తరహాలోనే అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. హౌస్ అరెస్ట్‌లు.. బెదిరింపులు ⇒ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కాకూడదని సర్కారు పెద్దలు పోలీసులను ఉసిగొల్పారు. దీంతో వారు ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్భంధం చేశారు. కేసులు పెడతామంటూ మరికొందరిని బెదిరించారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లను సోమవారం రాత్రే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం రాత్రి 11 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ జిల్లాలో అన్నదాత పోరు విజయవంతమైంది. ⇒ జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై హోరెత్తించారు. ఒంగోలులో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులను పోలీసులు పలుమార్లు అడ్డుకున్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని నోటీసులు ఇచ్చినా ఎవరూ లెక్క చేయలేదు. రాజమహేంద్ర వరంలో రైతులను, వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు ⇒ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా నిర్బంధించారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కవిటిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావును అడ్డుకున్నారు. వేలాది మందిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినప్పటికీ పలువురు నాయకులు పలాస, టెక్కలి ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. గుడివాడలో ఆర్డీవో కార్యాలయం లోపలికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినాదాలు చేశారు. నందిగామలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పార్టీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మొండితోక జగన్మోహనరావు, తన్నీరు నాగేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, అవుతు శ్రీనివాసులురెడ్డిలను గాంధీ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మార్గం మధ్యలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్ద, ఇతర నేతలను తిరువూరు, జగ్గయ్యపేటలో పోలీసులు అడ్డుకున్నారు. ⇒ గుంటూరు, తెనాలి, చీరాల ఆర్‌డీవో కార్యాలయాల వద్ద భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో వంద ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. రేపల్లె, వేమూరు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల ప్రాంతాల్లోనూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ రైతులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీకి తరలి వచ్చారు. ⇒ నెల్లూరు జిల్లాలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ముఖ్య నేతలకు నోటీసులిచ్చి, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి అన్నదాతలు కదంతొక్కారు. ఆత్మకూరులో రైతుల కోసం ఏర్పాటు చేసిన షామియానాను సీఐ గంగాధర్ తొలగించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.