తిరుపతి: పరకామణి కేసులో తనపై అవాకులు, చెవాకులతో టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీఅధికార ప్రతినిధి, టీటిడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో.. విచారణ పేరుతో వేధింపులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... గతంలో టిటీడీ బోర్డులో సభ్యులుగా పనిచేసిన వాళ్లే కొంతమంది ప్రస్తుతం సభ్యులగా కొనసాగుతుండగా.. వారిని ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి దోషి అనడానికి మా దగ్గర ఆధారాలున్నాయంటున్న టీడీపీ నేతలను.. సీఐడి ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. విచారణ పేరుతో సాగిస్తున్న వేధింపుల కారణంగానే నిజాయితీ పరుడైన సతీష్ కుమార్ బలయ్యాడని స్పష్టం చేశారు. పరకామణి కేసులో తాను తప్పుచేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేనిపక్షంలో టీడీపీ నేతలు అందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ● నా ప్రమేయంపై ఆధారాలున్నాయన్న వాళ్లనూ విచారించాలి... పరకామణి కేసులో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు రాజకీయ నాయకులంతా... కరుణారెడ్డే సూత్రధారి అని, అందుకు మా దగ్గర ఆధారులన్నాయని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భక్తిజన ఛానెల్ అధ్యక్షుడు, తుచ్చ మ్లేచ్ఛ గుణసుభాషితుడైన బీ ఆర్ నాయడు, కుతంత్ర తంత్ర సిద్ధుడైన పట్టాభి, పేరులో సూర్యుడిని, శూర్యుడు రెండింటిని ఇమిడించుకున్నాననుకున్న శూన్యుడైన కాకాసురుడు, బాకాసురుడు, కేకాసురుడు.. పరకామణి దొంగతనాన్ని బయటపెట్టినందుకు నాకు ప్రాణాప్రాయం ఉందని నంగి ఏడుపులు ఏడ్చి.. టూ ప్లస్ టూ గన్ మెన్ లను సంపాదించుకున్న లాభపరుడు, తిరుపతిలో ఉన్న ఓ వి రమణ ఇంకా వర్ల రామయ్యతో సహా నా మీద సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాటిని చంద్రబాబును మోసే భజన ఛానెళ్లు విపరీతంగా ప్రసారం చేశారు. ఇన్ని ఆధారాలున్న వీళ్లను ఎందుకు సీఐడీ అధికారులు పిలవలేదు? పిలవాల్సిన బాధ్యత ఉందా? లేదా ? అని గౌరవ న్యాయాధికారులకు వినమ్రంగా చేతులు జోడించి అర్థిస్తున్నాను. టీటీడీ బోర్డులో నేను ప్రత్యేక ఆహ్వానితుడిని మాత్రమే. నన్ను విచారణకు పిలిచినప్పుడు, నన్ను మాత్రమే పిలిచారా? మిగిలిన బోర్డు సభ్యులను పిలవలేదా? అని నేను సంబంధిత విచారణాధికారిని అడిగితే అందరినీ పిలుస్తామని చెప్పారు. నేను, వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు... టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవాళ్లు... ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలోనూ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. వారిని ఎందుకు విచారణకు పిలవలేదు?. అదే విధంగా ఆ రోజు బోర్డు సభ్యులందరికీ ఎందుకు విచారణ చేయలేదు? కారణం ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికే నన్ను విచారణకు పిలిచారు. చంద్రబాబు పత్రికలు కరుణాకరెడ్డే దోషి అని రాశారు కాబట్టి నన్నే విచారణకు పిలిచారు. వాళ్లను ఎప్పుడైతే విచారణకు పిలవలేదో అప్పుడో విచారణ వక్ర మార్గం పట్టిందని అర్ధం అయింది. సీఐడీ అధికారులు... ప్రభుత్వ పెద్దల ఒత్తిడి చేసి ఎవరిని పిలవాలని చెబుతున్నారో వారిని మాత్రమే విచారణకు పిలుస్తున్నారు. మిగిలిన వాళ్లను పిలవడం లేదు. అంటే చంద్రబాబు ప్రభుత్వానికి తలొగ్గిన సీఐడీ, ఏసీబీ అధికారులు న్యాయస్ధానికే మస్కా కొట్టారు. న్యాయస్ధానికే టోకరా వేసారు. న్యాయస్ధానం ఆదేశాలను ముసుగుగా వేసుకుని.. గత మూడు నెలలుగా నిరంతరం చంద్రబాబు అనుకూల పత్రికలు, ప్రసారమాధ్యమాలు మమ్మల్ని దోషులుగా, నిందితులుగా, దొంగలుగా తిట్టించడానికే ఈ విచారణను సాగించారు. విచారణ సాగినన్ని రోజులు విచారణాధికారులు ఎవరిని, ఏం విచారించామన్న విషయం చెప్పరు. కానీ చంద్రబాబు అనుకూల పత్రికల్లో విచారణ ముగిసిన మరుసటి రోజు ఎవరెవరిని, ఏయే ప్రశ్నలు అడిగారో, చాలా స్పష్టంగా రాస్తారు. నాతో సహా అధికారులు ఎవరిని విచారించారో వారి విచారణను వీడియో రికార్డు చేసి, దానికి సంబంధించి మా దగ్గర సంతకాలే తీసుకోలేదు. తీసుకోవాల్సిన అవసరం విచారణాధికారులకు ఉన్నదా? లేదా? ● న్యాయస్థానాల తీర్పుకూ వక్రభాష్యం... న్యాయస్ధానం పట్ల ఏ మాత్రం గౌరవం లేని చంద్రబాబు రాజకీయం ఇక్కడ కొనసాగుతుంది కనుక, న్యాయస్ధానాలు ఇచ్చిన ఆదేశాలను వారికనుగుణంగా మల్చుకుని నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల దగ్గర సాక్ష్యాలున్నాయి అన్నప్పుడు సీఐడీ అధికారులు వారిని ఎందుకు విచారణకు పిలవలేదు? చివరికి హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చాలా మంది ప్రబుద్ధులు ఇది ఎంత తప్పో గొప్పగా మాట్లాడారు. వాళ్లను సీఐడీ అధికారులు పిలవాల్సిన అవసరం లేదా? మా మీద బండ వేసి, మేం దొంగలమని చిత్రీకరిస్తే సరిపోతుందా? కేవలం ఈ మూడు నెలల పాటు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ తో సహా మా మీద దారుణమైన నిందలు మోపడానికే ఈ విచారణ జరిగిందన్నది చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇంత కంటే రుజువులు కావాలా? బోర్డులో ఉన్నవారినందరినీ విచారణకు పిలవలేదంటేనే విషయం అర్ధం అవుతుంది. దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. విచారణ ఏకపక్షంగా జరిగిందనడానికి ఇదే ఉదాహరణ. ● నా తప్పు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం... ఆనాటి పాలకమండలి ఏమాత్రం తప్పుచేయలేదు. రవికుమార్ అనే వ్యక్తి తన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి టీటీడీ ఈవోకి ఆ పత్రాలను సమర్పించాడు. ఎవరైనా తన ఆస్తులను రాసిస్తే... తీసుకోవడమే టీటీడీ పని. అది దొంగైనా, దొరైనా ఆస్తులు రాసిస్తే తీసుకోవడమే టీటీడీ పని. రవికుమార్ భార్య, కూతుళ్లతో కలిసి ఆస్తులు రాసిచ్చాడు. భగవంతుడి మీద భక్తితో గిఫ్ట్ డీడ్ కింద రాశానని ఆయనే చెప్పాడు. నన్ను దోషి అన్నవాళ్లందరికీ నా ఛాలెంజ్ ఒక్కటే? నేను రవికుమార్ ఆస్తులను ఒక్క సెంటు భూమి రాయించుకున్నా, ఒక్క రూపాయి అతని దగ్గర నుంచి తీసుకున్నా, అతని దగ్గర టీ తాగినట్టు ఆ నివేదికలో ఉన్నా రాజకీయంగా అస్త్ర సన్యాసం చేస్తాను. కానీ నా మీద ఆరోపణలు చేసేవాల్లు.. వాళ్ల ఆరోపణలకు భిన్నంగా సీఐడీ అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారా? నా సవాల్ స్వీకరించడానికి సిద్ధమా? హంతకుల కంటే దారుణంగా మమ్నల్ని రాచి, రంపాన పెట్టడమే మీ ఉద్దేశం. మీరు మోసే పత్రికలు, ఛానెళ్లు ఉన్నాయని మా మీద నిందారోపణలు చేస్తే మేము రోజూ కడుక్కోవాలా? మీరు ఆరోపణలు చేస్తే భయపడి పారిపోయేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. ● నిజాయిపరులైన అధికారులే లక్ష్యం... మీరు ఎన్ని విచారణలు చేసుకున్నా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ విచారణాధికారులు విచారించిన తీరు వలన, ఒక అబద్ధాన్ని చెప్పించడానికి ప్రయత్నం చేయడం వలన ఒక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి బలయ్యాడు. విచారణ ఎదుర్కొన్న అధికారులందరినీవిపరీతంగా మానసికంగా ఒత్తిడికి గురిచేయడం, విపరీతంగా ప్రలోభపెట్టి, భయపెట్టినా... వారందరూ అబద్దపు వాంగ్మూలాలకు సిద్ధంగా లేకపోవడంతో వారిపై వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలన్న దురాలోచనతో ఉన్నారు. పోలీసు అధికారుల చేతనే కిందస్ధాయి పోలీసధికారుల కన్నులు పొడిచే కార్యక్రమం పరకారమణి కేసులో జరుగుతుంది. ఇది చాలా దారుణం. జ్యుడీషియల్ ఆర్డర్ ని ప్రశ్నించే అధికారం టీటీడికి ఏముంటుంది. మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేదానిపై ప్రశ్నించే అధికారం ఉన్నత న్యాయస్దానానికి మాత్రమే ఉంటుంది. రవికుమార్ తన ఆస్తులను టీటీడీకి రాసిస్తే.. టీటీడీ వాటిని తీసుకొంది. ఆస్తులు తీసుకోవడం నేరమని మాట్లాడున్న మీరు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. రవికుమార్ ఆస్తులను ఎందుకు వాపస్ ఇవ్వలేదు? అవి అవినీతి ఆస్తులైనప్పుడు మీరు వచ్చిన ఏడాదిన్నరకావస్తున్నా ఎందుకు ఆ పని చేయడం లేదు? మా మీద దాడి చేస్తున్నారు. టీటీడీలో దాతలకు సంబంధించిన పూర్వాపరాలు విచారణ చేసే పద్ధతి లేదు. ఎవరు డొనేట్ చేసినా వాటిని స్వీకరించడం ఆనవాయితీ. పరకామణి కేసులో మేం ఏ తప్పూ చేయలేదు, మేం తప్పుచేశామనడానికి ఆధారాలు దొరకకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం ఏసీబీ అధికారులను .. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కిందస్ధాయి అధికారుల మీద దాడికి పురిగొల్పుతున్నారు. బలవంతంగా వాళ్ల చేత వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ● చంద్రబాబూ ప్రాయశ్చిత్తం చేసుకో... మద్యం స్కామ్, సైబర్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్డు స్కామ్ వంటి దాదాపు 7 కేసులు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మీద నమోదైతే వాటిని ఒక్కొక్కటిగా విత్ డ్రా చేసుకుంటున్నాడు. తప్పు చేసి, తన మీద కేసులను కొట్టేసికుంటున్న చంద్రబాబు కూడా ప్రాయశ్చిత్తంగా ... రవికుమార్ చేసినట్టేతమ ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలని కోరుకుంటున్నాను. పరకారమణి కేసు విచారణ ఓ అబద్దం. కేవలం కిందస్ధాయి పోలీసు అధికారులను బెదిరించడానికే ఈ విచారణ చేశారు. నిజాయితీపరుడైన సతీష్ కుమార్ బలైపోవడానికి ఈ విచారణే కారణం అయింది. ఇంకా నిజాయితీపరులైన అధికారుల మీద భయంకరమైన ఒత్తిడి పెంచడానికి, మమ్నల్ని దోషులు, దొంగలుగా చిత్రీకరించడానికే ఈ విచారణ ఉపయోగపడిందే తప్ప.. మరొక్కటి కాదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవాలను వెలికితీయడానికి పూర్తి భిన్నంగా విచారణ సాగిందని ఆయన స్పష్టీకరించారు.