విశాఖపట్నంలో మెడ్‌ టెక్‌ జోన్‌ ఏర్పాటుకు 25 కోట్ల సాయం

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి స‌దానంద‌గౌడు స‌మాధానం

న్యూఢిల్లీ: బల్క్‌ ఇండస్ట్రీకి కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేసే పథకం కింద విశాఖపట్నంలో మెడ్‌ టెక్‌ జోన్‌ ఏర్పాటుకు 25 కోట్ల సాయం అందించే అంశానికి కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో 30 శాతం నిధులను ఏఎంటీజెడ్‌కు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి స‌దానంద‌గౌడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ (ఏఎంటీజెడ్‌)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 25 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటి వరకు 7.49 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

ఫసల్‌ బీమా యోజన పథకం అమలుపై..

నాలుగేళ్ళుగా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుపై రైతులు ఇతర భాగస్వామ్య పక్షాలతో జరిపిన చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అందులో భాగంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా 2020 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. పంటల బీమాపై దీర్ఘకాలికంగా రైతులు చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో చేరాలా, వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను రైతులకే విడిచిపెట్టినట్లు మంత్రి తెలిపారు. 2020 ఖరీప్‌ సీజన్‌లో పంటల బీమాకు సంబంధించి అందిన వివరాల ప్రకారం పంటలు బీమా చేసుకునే రైతుల సంఖ్య గత ఖరీప్‌ సీజన్‌ మాదిరిగానే ఉందని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top