జూపాడుబంగ్లా: నిన్న కర్నూలులో చంద్రబాబుకు కోపం వచ్చిందట! చంద్రబాబును గో బ్యాక్ అన్నందుకు కోపం వచ్చిందట అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. ఒక మనిషికి, అది కూడా అన్యాయం చేసిన మనిషికి ఇంత కోపం రావటం కరెక్టు అయితే... చంద్రబాబు వల్ల అన్యాయానికి గురైన ప్రాంతానికి, అన్యాయానికి గురి అవుతున్న ప్రాంతానికి... ఆ ప్రాంత ప్రజలకు ఇంకెంత కోపం రావాలని ఆయన నిలదీశారు. శనివారం బేడ బుడగజంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్థర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన పార్టీ పేరు తిట్లు, దుషణలు, పచ్చి బూతుల పార్టీగా మార్చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడినది ఆవేశంతో కాదు... అక్కసుతో మాట్లాడారని తప్పుపట్టారు. కర్నూలు సభలో పోలీసుల్ని బెదిరించాడు. అధికారుల్ని బెదిరించాడు. చివరికి ప్రజల్ని కూడా బెదిరించాడని తెలిపారు. తనతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారని వైయస్సార్‌గారిని కూడా ఆయన మరణానికి ముందు రోజు... సెప్టెంబర్ 1, 2009న బాబు బెదిరించాడని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిడతాడు... పట్టాభి నుంచి పవన్ కల్యాణ్ వరకు అందరికీ ఏం తిట్టాలో చెపుతాడన్నారు. నిరాశ, చేతగాని తనం నుంచి ఇవన్నీ వస్తున్నాయని ప్రజలు గమనిస్తుంటే అక్కసు, అసూయ పెరిగిపోతోందన్నారు. లేని ధైర్యాన్ని చూపాలని, సాహసవంతుడినని చెప్పాలని మేకపోతు గాంభీర్యంతో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తరిమి తరిమి కొడతా... బట్టలిప్పి కొట్టిస్తా... చిత్తు చిత్తు అవుతారు... రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని అని చంద్రబాబు బెదిరింపు మాటలు ప్రజలందరూ గమనించారన్నారు. ప్రాంతాలకు న్యాయం జరగకుండా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఎవరూ అంగీకరించరు. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తిని తీసుకుని, రాయలసీమకు న్యాయం చేయండి... వైయస్సార్‌గారి మాదిరిగానే, వైయస్సార్‌గారి తనయుడు న్యాయం చేస్తుంటే... మరో రెండు అడుగులు ముందుకు వేస్తుంటే అడ్డు పడకండి అని మాత్రమే రాయలసీమ ప్రజలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకూ ఇలాంటి ఆకాంక్షలే ఉన్నాయి. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రాంతాల మధ్య అసమానతల్ని, ప్రత్యేకించి రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కరువు, నీటి వనరులు లేకపోవటం, వలసలు, ఆర్థిక వెనకబాటు వంటి అనేక అంశాలను ప్రస్తావించిందన్నారు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఇవి మన రాష్ట్రంగా మనమంతా ఆలోచించాల్సిన అంశాలే అన్నారు. మూడు రాజధానుల ద్వారా న్యాయం జరుగుతుందని సీఎం వైయస్ జగన్ భావించారు. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని స్పష్టం చేశారు. ఇందులో అమరావతికి అన్యాయం చేసే ఉద్దేశంగానీ, కోరికగానీ లేవు అన్నారు. అమరావతి ప్రాంతంలోగానీ, గుంటూరు, కృష్ణాల్లో గెలిచిందిగానీ... అవి ఏ ఎన్నికలు అయినా... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఈ ప్రాంతం చంద్రబాబు జాగీరు కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే గడ్డ, ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే గడ్డ అన్నారు. ఈ ప్రాంతం మీద మమకారంగానీ, ప్రేమగానీ లేకపోబట్టే చంద్రబాబు... రాజధాని ప్రకటనలో అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో, తన బినామీలతో భూములు కొనిపించి... తాను కట్టని, ఎవరూ కట్టలేని రాజధాని గురించి, గ్రాఫిక్స్ రాజధాని గురించి ఉత్తుత్తి పోరాటం, కెమెరాల ఉద్యమం చేయిస్తున్నాడని ఆరోపించారు. ఈ డ్రామాలతో ప్రాంతీయ ఆకాంక్షలకు సమాధానం ఇవ్వలేమన్నారు. మూడు ప్రాంతాలకూ న్యాయం చేయాలన్న కోరిక చంద్రబాబుకు లేక పోవటం దుర్మార్గం అవుతుందన్నారు. న్యాయ రాజధాని అంటే హై కోర్టుతో పాటు, జ్యుడీషియల్ అధికారాలున్న ఇతర సంస్థలు కూడా ఇందులో ఉంటాయి... తొలి రాజధాని అయిన కర్నూలుకు, రాయల సీమకు వస్తాయి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ గతంలోనే వివరించారు. ఇది న్యాయబద్ధమైన విభజన. న్యాయం చేసే విభజన. ఒక మనిషికి ఆశలు, ఆకాంక్షలు, ఆత్మ గౌరవం ఉన్నట్టే ప్రాంతాలకు కూడా ఇవన్నీ ఉంటాయని గుర్తించబట్టే మూడు రాజధానుల ద్వారా న్యాయం జరుగుతుందని; ఎప్పటికీ మన రాష్ట్రం మరోసారి ప్రాంతీయ ఉద్యమాలకు వేదిక కాకుండా ఉండాలంటే... ఇంటింటికీ, భిన్న సామాజిక వర్గాలకు న్యాయం చేయటంతోపాటు, ప్రాంతీయ న్యాయం కూడా అవసరం అని వైయస్ జగన్ ఒక విస్తృతమైన ఆలోచనతో, ముందు చూపుతో, ప్రతి నియోజకవర్గంలోనూ నేలమీద నడిచిన మనిషిగా... ప్రజల మనిషిగా ఒక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే... అందుకు ఒకే ఒక్క కారణం... తాను కొన్న, కొనిపించిన భూముల రేట్లు పెరగాలి. తాను పెంచిన, తనను పెంచుతున్న వారు మాత్రమే అభివృద్ధి కావాలి. దోచుకో–పంచుకో–తినుకో అనే డీటీపీ స్కీమ్ మాత్రమే అమలు కావాలి. డీబీటీ అనే వైయస్ జగన్ స్కీమ్ ద్వారా, ఇంగ్లీష్ మీడియం ద్వారా, ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల అభివృద్ధి ద్వారా ఇక అణగారిన సామాజిక వర్గాలన్నీ అభివృద్ధి అయితే. తమ పెత్తందారీ వర్గం ఏమైపోవాలి? తమకు సేవలు చేయటానికి ఎవరు ఉంటారన్న భావజాలం ఉన్న బాబు, ఆయన బృందం ప్రాంతాలమీద, సామాజిక వర్గాలమీద ప్రేమతో ఏ నిర్ణయమూ తీసుకోదు. కాబట్టే రౌడీల మాదిరిగా తొడ కొడతాం... అంతు చూస్తాం అని సవాళ్ళు చేస్తారు, బూతులు తిట్టటాన్ని తమ సంస్కృతి, సంప్రదాయంగా భావిస్తారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసినా మరోసారి వారికి వివరించాలి. చంద్రబాబు తాను ఆల్రెడీ రాయలసీమను రతనాల సీమ చేసేశానని నిన్న చెప్పాడు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 14 ఏళ్ళు సీఎంగా పూర్తి చేయలేని వ్యక్తి... ఇలాంటి భారీ డైలాగులు చెపుతుంటే ఇంతకు మించిన కామెడీ ఏం ఉందని ప్రజలంతా నవ్వుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా... లేకపోతే చివరి ఎన్నికలు అని చెప్పిన చంద్రబాబుకు ఆల్రెడీ 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు. 175కు 175 గెలిచేది... ఇంటింటికీ మనిషి మనిషికీ మంచి చేసిన వైయస్ జగన్ , ఆయన పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే ఆర్థర్ దీమా వ్యక్తం చేశారు.