అమరావతి: ప‌్రైవేటీకరణ ఉద్యమ సారధి చంద్రబాబు అని వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరించాలన్న కేంద్ర యోచనపై రాష్ట్రం ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చేసిన ఆరోపణలను నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్‌ఐఎన్‌ఎల్) ఆధీనంలో పని చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకున్నా, ప్రధాన ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతోందని తప్పుపట్టారు. ఎక్కడ ఏం జరిగినా నేరుగా సీఎం వైయస్ జగన్‌ను టార్గెట్ చేసి టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి మహోద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. ధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు అందుకు విరుద్ధమైన మాటగా చంద్రబాబు గతితప్పిన రాజకీయంలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా బాబు మహోద్యమం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, అందుకోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెబుతున్న టీడీపీ పెద్దలు, నాడు తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల విషయంలో ఏ విధంగా వ్యవహరించారన్నది చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ అయిదేళ్ల కాలంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, బాబు అధికారంలో ఉన్న 1999 నుంచి 2004 మార్చి వరకు మొత్తం 54 సంస్థలనూ, కంపెనీలనూ మూసివేయడం, ప్రైవేటీకరించడం, పెట్టుబడులు ఉపసంహరించడం లేదా పునర్‌వ్యవస్థీకరణ పేరుతో అస్తవ్యస్తం చేయడం జరిగింది. మొత్తం 87 సంస్థలను టార్గెట్‌గా పెట్టుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం విజయవంతంగా 54 ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేసింది. బాబు హయాంలో సంస్థల మూసివేత కార్యక్రమం.. చంద్రబాబు హయాంలో మూసివేసిన సంస్థలు 22. పునర్‌వ్యవస్థీకరణ పేరుతో అస్తవ్యస్తం చేసినవి 12. ప్రైవేటు పరం చేసిన సంస్థలు 11, పెట్టుబడులు ఉపసంహరించినవి 9. ఇలా చంద్రబాబు దుంపనాశనం చేసిన కంపెనీల సంఖ్య 54. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కేవలం 84 సంస్థలు మాత్రమే సంస్కర ణలకు లోను కాగా, ఒక్క ఏపీలోనే ఆ సంఖ్య 54 సంస్థలను ప్రైవేటీకరించారు., ఏ స్థాయిలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ఎంత దారుణంగా ప్రైవేటీకరణ కొనసాగించారన్నది స్పష్టమవుతుంది. 1999 నుంచి 2002 వరకు తొలిదశ, ఆ తరువాత రెండో దశలో 2002 నుంచి 2006 వరకు నాలుగేళ్లలో ఈ ప్రైవేటీకరణ కొనసాగించాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తొలిదశలో 19 సంస్థలను లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 18 సంస్థలను ప్రైవేటుపరం చేసింది. మలిదశలో 68 సంస్థలను టార్గెట్ పెట్టుకోగా, వాటిలో 2004, మార్చి (ఎన్నికలు వచ్చే నాటికి)30 సంస్థలను ప్రైవేటు పరం చేసింది. బాబు సర్కారు ప్రైవేటుపరం చేసిన సంస్థలు.. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ప్రైవేటు పరం చేసిన సంస్థల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. శ్రీహనుమాన్ కో ఆపరేటివ్ షుగర్ మిల్, ఆదిలాబాద్ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, రాజమండ్రి కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, నిజాం షుగర్స్‌కు చెందిన పలు యూనిట్లు, నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్, నాగార్జున కో ఆపరేటివ్ షుగర్ మిల్, పశ్చిమగోదావరి సహకార షుగర్ మిల్, వోల్టాస్ లిమిటెడ్, గోదావరి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, వజీర్ సుల్తాన్ టుబాక్ ( వీఎస్‌టీ), టాటా మోటార్స్ (పూర్వ టెల్కో), సిర్పూర్ పేపర్ మిల్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ వంటి 30 కంపెనీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేశారు. చంద్రబాబు మూసివేసిన సంస్థలు.. ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ జౌలిఅభివృద్ధి సంస్థ, ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చీరాల కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఏపీ ఫిషరీస్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ ఎలక్ట్రానిక్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ స్పిన్‌ఫెడ్, కరీంనగర్ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, చిత్తూరు జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం, గ్రామీణ విద్యుత్ సరఫరా సంస్థ రాయచోటి వంటి 24 సంస్థలను చంద్రబాబు మూసివేయించారు. నాడు చంద్రబాబు ఏం చెప్పారంటే.. ‘ప్రైవేటు పరం చేసిన సంస్థలు, యూనిట్లు చాలా బాగా పని చేస్తున్నాయి. వాటిపై ఆధారపడిన రైతులు, కార్మికులు, స్థానికులు, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నాయి. మూతపడే దశలో ఉన్న సంస్థలు ప్రైవేటీకరణ వల్ల కొత్త జీవం పోసుకున్నాయి. ఆ యూనిట్లన్నీ లాభాల బాటలో నడిచి, పన్నులు కూడా చెల్లిస్తున్నాయి. ఆయా సంస్థల యాజమాన్యాలు మారడం వల్ల వాటిలో పెట్టుబడులు పెరిగి, ఉత్పత్తి కూగా గణనీయంగా పెరుగుతోంది’ అని చెప్పుకున్నారు. ఇదీ చంద్రబాబు నైజం.. ఆ విధంగా నాడు ప్రైవేటీకరణను అంత యథేచ్ఛగా యజ్ఞంగా కొనసాగించి,దాన్ని గట్టిగా సమర్థించుకున్న చంద్రబాబు, ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తన హయాంలో ప్రైవేటీకరణ హద్దులు చెరిపేసి60కిపైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయించి ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. విశాఖ ఉక్కుఫ్యాక్టరీపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ని పల్లెత్తు మాట అనడానికి సాహసించలేకపోతున్నారు. అదే సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ యధాతథంగా మనుగడ సాగించడానికి అవసరమైన అన్ని ప్రతిపాదనలను కేంద్రానికి పంపిన సీఎం వైయస్ జగన్‌పై బురద జల్లడానికి, అసలు సమస్యను పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ శోకాలు పెడుతున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి చంద్రబాబు తీరును తూర్పారబట్టారు.