నామినేషన్లు వేయనివ్వరా? అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు?

పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

పోలీసుల తీరుపై ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి ఆగ్రహం

పులివెందులలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్‌, 
టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ వైయ‌స్‌ 
అవినాష్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టి, అక్కడే మీడియాతో మాట్లాడారు.

పులివెందులలో నామినేషన్ల అడ్డగింత.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై పోలీసుల దౌర్జన్యం!

మధ్యాహ్నం నామినేషన్లు వేయిస్తామని చెప్పి మాట తప్పిన పోలీసులు

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. తుపాకులతో బెదిరింపులు

మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులకు అవకాశం.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై ఏకే-47 గురిపెట్టిన డీఎస్పీ

ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థుల నామినేషన్‌ హక్కును కాపాడాలి

ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి విజ్ఞ‌ప్తి

పులివెందుల‌: మున్సిపల్‌ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని క‌డ‌ప‌ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే లాఠీ దెబ్బలు, రాళ్ల దాడులు ఎదుర్కోవాలా? ఎన్నికల సంఘం అసలు ఉన్నట్టా, లేనట్టా? అంటూ నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నిస్తూ, ఎన్నికల సంఘం తక్షణమే మేల్కొని అభ్యర్థుల నామినేషన్‌ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పులివెందులలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌డంతో పోలీసుల తీరుకు నిరసనగా కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టి, అక్కడే మీడియాతో మాట్లాడారు.
మీడియాతో వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

- పోలీసుల హామీని నమ్మి వస్తే నామినేషన్లకు అడ్డంకులా?

“డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలను సంప్రదిస్తే మధ్యాహ్నం 1.30 గంటలకు రండి.. మీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయిస్తాం, ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటను నమ్మి మా అభ్యర్థులతో వస్తే, ఈరోజు వద్దు.. రేపు రండి అంటున్నారు. ఈరోజు మాకు నామినేషన్లు వేసే హక్కు ఎందుకు లేదు? పోలీసులే హామీ ఇచ్చి, మళ్లీ మాట తప్పడం ఏమిటి? మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నా వారిని అడ్డుకోరు. మేము 100 మీటర్ల దూరంలో ఉంటే మా కార్యకర్తలపై లాఠీచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తారు. ఇదెక్కడి న్యాయం? అభ్యర్థులకు నామినేషన్లు వేసే హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారు?.

- వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై తుపాకులు గురిపెట్టడం ఏమిటి?

 మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ఉంటే పోలీసులు వారి జోలికి వెళ్లరు. మేము 100 మీటర్ల దూరంలో ఉంటే మాత్రం డీఎస్పీ ఏకే-47 తుపాకీ గురిపెట్టి మా మీదకు వస్తారు. టీడీపీ శ్రేణుల వద్ద వేటకొడవళ్లు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నామినేషన్లు వేయడానికి వచ్చిన మా అభ్యర్థుల పత్రాలను లాక్కొని చించేస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన తర్వాత కూడా పత్రాలను తీసుకుంటున్నారు. మరి అధికారులు, పోలీసులు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారా? లేక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా?.

- ఎన్నికల సంఘం మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే లాఠీ దెబ్బలు తినాలా? టియర్‌ గ్యాస్‌ ప్రయోగాన్ని ఎదుర్కోవాలా? రాళ్ల దాడులకు గురికావాలా? ఎన్నికల సంఘం అసలు ఉన్నట్టా, లేనట్టా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఒక్క మున్సిపాలిటీలోనైనా, ఒక్క కౌన్సిలర్‌ స్థానంలోనైనా గెలుస్తామనే నమ్మకం కూటమి ప్రభుత్వానికి లేదనే విధంగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలను ఆపాలి. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే ప్రతి అభ్యర్థికి రక్షణ కల్పించాలి. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఓటర్లు ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అభ్యర్థుల నామినేషన్‌ హక్కులను పరిరక్షించి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top