న్యూఢిల్లీ: బొగ్గు కొరత కారణంగా దేశంలో 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో 111 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా మైనింగ్ లోపాల వల్ల విద్యుదుత్పత్తి సంక్షోభంలో పడింది. 175 థర్మల్ ప్లాంట్లలో 105 కేంద్రాలు బొగ్గు కొరతతో ఎప్పుడైనా నిలిచిపోవచ్చు. 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రీశ్రీ యువతకు ఎప్పటికీ ప్రేరణ, ఆదర్శం అభ్యుదయ సాహిత్య రథ సారథి, అక్షరాలతో అగ్గిరవ్వలు రాజేసిన విప్లవ కవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నా నివాళులు. ఉత్తేజపూరితమైన కవితలతో శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆవిష్కరించి తన జీవితాంతం పీడిత పక్షాల తరఫున కలంతో పోరాటం సాగించిన శ్రీశ్రీ యువతకు ఎప్పటికీ ప్రేరణ, ఆదర్శం అంటూ విజయసాయిరెడ్డి అంతకుముందు మరో ట్వీట్ చేశారు.