బడ్జెట్‌...సబ్‌కా సాథ్‌ కాదు సబ్‌కా హాత్‌

కేంద్ర బడ్జెట్‌ను దుయ్యబట్టిన  ఎంపీ విజయసాయి రెడ్డి
 

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్భాటం తప్ప విషయం లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌...కానీ పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ బడ్జెట్‌ అవుతుందేమోనని ఊహించాం. కానీ బడ్జెట్‌ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి చెందని బడ్జెట్‌ అని తేలిపోయిందన్నారు. ఈ బడ్జెట్‌ సబ్‌కా సాథ్‌ కాదు సబ్‌కా హాత్‌ అన్నట్లుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాలకు ఆత్మనిర్భరత ఎక్కడ?
 విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి మాట్లాడుతోంది. మరి రాష్ట్రాల ఆత్మనిర్భరత ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం తన హస్తలాఘవం ప్రయోగించి దారుణంగా తగ్గించిందని దుయ్యబట్టారు. బడ్జెట్‌ అంకెల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూల పన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్‌చార్జీలను పెంచుకుంటూ పోయిందని అన్నారు. సెస్సులు, సర్‌ చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనందునే కేంద్రం దొడ్డిదారిలో ఈ పని చేస్తున్నదని అన్నారు. కేంద్రానికి వచ్చే స్థూల పన్నుల ఆదాయంలో డివిజబుల్‌ పూల్‌ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే సెస్సులు, సర్‌చార్జీల పేరిట కేంద్రం వసూలు చేసే పన్నులు డివిజబుల్‌ పూల్‌ కిందకు రావు. ఫలితంగా డివిజబుల్‌ పూల్‌లో జమయ్యే స్థూల పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గింది. దీని పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతానికి బదులు 29 శాతానికి పడిపోయిందని శ్రీ విజయసాయి రెడ్డి వివరించారు.

పెట్రోల్‌, డీజిల్‌ సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత?
పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 లక్షల 35 వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఆర్జించింది. ఈ మొత్తం ఆదాయంలో అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది కేవలం 5.8 శాతం...అంటే 19,475 కోట్ల రూపాయలు మాత్రమేనని శ్రీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఇది కాకుండా పెట్రోల్‌, డీజిల్‌పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరో 2 లక్షల 87 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఎక్సైజ్‌ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్‌పై 40 శాతం, డీజిల్‌పై 59 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై 85 శాతంపైనే ఎక్సైజ్‌ డ్యూటీని సెస్‌ రూపంలో వసూలు చేస్తోంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా దక్కదని అన్నారు. లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయలు ఉంటే అందులో స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద 11 రూపాయలు, రోడ్లు, మౌలికవసతుల సెస్‌ కింద 18 రూపాయలు, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన సెస్‌ కింద 2 రూపాయల 50 పైసలు మొత్తంగా 31.5 శాతం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికే లభిస్తోంది. బేసిక్‌ ఎక్స్‌జై డ్యూటీ కింద వసూలు చేసే 1 రూపాయి 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అవుతోందని శ్రీ వి.విజయసాయి రెడ్డి గణాంకాలతో సహా వివరించారు.

డివిజబుల్‌ పూల్‌లో తగ్గిపోతున్న ఏపీ వాటా
కేంద్ర ప్రభుత్వం డివిజబుల్‌ పూల్‌ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్‌ వాటా నానాటికీ తగ్గిపోతున్నదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. 13వ ఆర్థిక సంఘం (2010-15) సిఫార్సుల ప్రకారం డివిజబుల్‌ పూల్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాటాను 6.9 శాతంగా నిర్ధారించగా, 14వ ఆర్థిక సంఘం (2015-20) దానిని 4.3 శాతానికి తగ్గించింది. అంటే  2.6 శాతం తగ్గింది. 15వ ఆర్థిక సంఘం (2021-2026) సిఫార్సుల ప్రకారం డివిజబుల్‌ పూల్‌లో ఏపీ వాటా 4.1 శాతానికి పడిపోయిందని ఆయన వివరించారు.

డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాల వాటాను సిఫార్సు చేయడానికి ఆర్థిక సంఘం పాటించే ప్రామాణికాలలో రాష్ట్ర జనాభా ఒకటి. దాని ప్రకారం అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు డివిజబుల్‌ పూల్‌లో అధిక వాటాను పొందుతుంటే జనాభా నియంత్రణ కోసం పని చేసే రాష్ట్రాలకు తక్కువ వాటా ఇచ్చి వాటిని  శిక్షిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక వైపు సెస్సులు, సర్‌ చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వసూలు చేసే పన్నులతో డివిజబుల్‌ పూల్‌లో జమ అయ్యే స్థూల ఆదాయం మొత్తం క్షీణిస్తుంటే మరోవైపు ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా డివిజబుల్‌ పూల్‌ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం క్రమేపీ తగ్గిపోతూ వస్తోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఏపీ, కేంద్ర బడ్జెట్ మధ్య తేడా చూడండి
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు జరపడాన్ని శ్రీ విజయసాయి రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులకు కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అరాచకానికి పాల్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదర్శనీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022-23 బడ్జెట్‌లో కేంద్రం 3.8 శాతం కేటాయించింది. విద్యా రంగానికి ఏపీ 11.8 శాతం నిధులను కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో అది కేవలం 2.6 శాతం మాత్రమే ఉంది. ఆరోగ్య రంగానికి ఏపీ బడ్జెట్‌లో 6.0 శాతం కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో 2.2 శాతం, గ్రామీణాభివృద్ధికి ఏపీ 7.1 శాతం నిధులు ఇస్తే కేంద్రం 5.2 శాతం, సామాజిక సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.1 శాతం నిధుల కేటాయింపు జరగ్గా కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అది కేవలం 1.3 శాతం మాత్రమే ఉందని వివరించారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ పట్ల అనుసరిస్తున్న సవతి తల్లి వైఖరి ఒకవైపు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉన్నప్పటికీ వ్యవసాయం, విద్యా, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం...ఇలా కీలకమైన అన్ని రంగాలలోను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంటే మిన్నగా నిధులను ఖర్చు చేస్తోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

మధ్యతరగతికి ఊరట లేని బడ్జెట్‌
కేంద్ర పన్నుల ఆదాయంలో 10 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. ఒకవైపు ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా పెరిగినప్పటికీ ఆదాయ పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు చేయనందున మధ్య తరగతి ప్రజల మిగులు ఆదాయం తగ్గిపోయిందని అన్నారు. ఆదాయపన్నులో 2.5 లక్షల మినహాయింపు అనేది 2014 నుంచి 2022 వరకు కొనసాగుతూనే ఉంది. ద్రవ్యోల్బణం మాత్రం 48 శాతం పెరిగిందని అన్నారు. 2014 నాటి ధరలకు ఇప్పటి ధరలకు ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ టాక్స్‌ శ్లాబ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడం తగదని చెప్పారు. మధ్య తరగతి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని టాక్స్‌ రేట్‌ శ్లాబ్స్‌ను హేతుబద్ధీకరణ చేయాలి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఐటీ డిడక్షన్లు, మినహాయింపులు చేయాలని ఆయన ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ను సులభతరం చేయాలి
ప్రస్తుతం ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలంటే పన్ను చెల్లించేవారు ముందుగా అయిదు రకాల డాక్యుమెంట్లను సమకూర్చుకోవాలి. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఉద్యోగి తన సంస్థ నుంచి ఫార్మ్‌ 16 సేకరించాలి. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల నుంచి ఫార్మ్‌ 16ఏ, ఇతరత్రా ఆదాయం ఉంటే దానికి సంబంధించిన టీడీఎస్‌ సర్టిఫికెట్లు, ఫార్మ్‌ 26ఏఎస్‌, టాక్స్‌ సేవింగ్‌ ఇన్వెస్టిమెట్లను ధృవపరచే సాక్ష్యాలను సమర్పించాలి. వీటన్నింటినీ సమగ్రెగా ఒకే ఐటీ ఫార్మ్‌ ద్వారా ఫైల్‌ చేసే వెసులుబాటు పన్ను చెల్లింపుదారుడికి కల్పించాలని ఆయన ప్రభుత్వానికి  సూచించారు.

ఐటీ పోర్టల్‌లో లోపాలు సరిదిద్దాలి
రిటర్న్‌లు ఫైల్‌ చేయాడానికి నిర్దేశించిన ఇన్‌కం టాక్స్‌ పోర్టల్‌లో లోపాలు, అవాంతరాలు ఎదురవుతున్నట్లు లక్షలాది మంది పన్ను చెల్లింపుదార్లు అనేక నెలలుగా ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం రిటర్న్స్‌ దాఖలు చేసే గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ పోతోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

సబ్సిడీలకు అడ్డగోలు కోతలు
ఒకవైపు ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అన్ని ప్రధానమైన సబ్సిడీలపై గణనీయంగా కోతలు పెట్టింది. కరోనా మహమ్మారి కాలంలో ఎవరినీ పస్తులు ఉండనీయబోమని చెప్పే ప్రభుత్వం బడ్జెట్‌లో ఆహార సబ్సిడీని 28 శాతానికి తగ్గించిందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే ఎరువుల ధరలు పెరిగి రైతులు అల్లాడిపోతుంటే మరోవైపు కేంద్రం ఎరువుల సబ్సిడీని 25 శాతానికి తగ్గించింది. లక్షలాది కుటుంబాలు వినియోగించే ఎల్పీజీ సిలండర్లపై సబ్సిడీని 11 శాతానికి పరిమితం చేసిందని ఆయన విమర్శించారు.

నెరవేరని కేంద్ర ప్రభుత్వ హామీలు
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం కింద ఇచ్చిన ప్రధాన హామీలైన వైజాగ్‌ రైల్వే జోన్‌, వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏడేళ్ళు పూర్తయినా కార్యరూపం దాల్చకుండా ఇంకా హామీలుగానే మిగిలిపోయాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

 విభజన చట్టంలో పొందుపరచిన జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ-వైజాగ్‌, ఐఐఎం-వైజాగ్‌, ఐఐటీ-తిరుపతి, సెంట్రల్‌ యూనివర్శిటీ, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఇప్పటికీ చాలీచాలని వసతి, సౌకర్యాలతో తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు గుప్పించే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల మాత్రం నోరు ఎందుకు విప్పదని ఆయన ప్రశ్నించారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, ఔర్‌ సబ్‌కా ప్రయాస్‌ అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం చివరకు ఈ బడ్జెట్‌ ద్వారా సబ్‌కా హాథ్‌ అని నిరూపించుకుందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. 

అనంతపురం సెంట్రల్‌ వర్సిటీకి 31 కోట్లు
 అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌కు 31.24 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో బుధవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సెంట్రల్‌ యూనివర్శిటీ క్యాంపస్‌ నిర్మాణంపై సమర్పించిన డీపీఆర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ యూనివర్శిటీ గెస్ట్‌, విజిటింగ్‌ ఫ్యాకల్టీ ద్వారా నాలుగు అండర్‌ గ్రాడ్యుయేట్‌, ఏడు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

జూన్‌కల్లా ఆనందపురం-అనకాపల్లి హైవే రెడీ
 ఈ ఏడాది జూన్‌ నాటికి ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి మధ్య నిర్మిస్తున్న 6 లేన్ల జాతీయ రహదారి పూర్తవుతుందని జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2527 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 50 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ఆరు వరసల జాతీయ రహదారి 2019 ఏప్రిల్‌లో ప్రారంభమైనట్లు చెప్పారు. వాస్తవానికి ఈ రహదారి నిర్మాణం 2021 జూలై నాటికి పూర్తి కావలసి ఉన్నప్పటికీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని అయితే దీని వలన ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశం లేదని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top