న్యూఢిల్లీ: లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వైయస్సార్‌సీపీ విధి విధానాలకు అనుగుణంగా, పార్టీ అధ్యక్షుడి దిశా నిర్దేశం మేరకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, 120కి పైగా పార్లమెంటు సభ్యుల నుంచి సంతకాలు సేకరించాం. ముఖ్యంగా ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖ స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ సంతకాలు సేకరించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, వాటిని ఆ సంస్థ కార్మికులు, ఆ సంఘాల నేతలకు చూపుతాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగారిని కలిసి ఆ సంతకాలతో కూడిన ఒక మెమొరండం (వినతిపత్రం) సమర్పిస్తాం. రైల్వే మంత్రితో భేటీ: ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై మా పార్టీ ఎంపీలు అందరం మొత్తం 27 మంది ఇవాళ ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశాం. ఏపీలో పెండింగ్‌లో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులపై చర్చించాము. కొన్నింటిపై ఆయన వెంటనే నిర్ణయం కూడా తీసుకున్నారు. చాలా వాటిపై సానుకూలత వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిని ఏమేం కోరామంటే..: – మెట్టమొదట కడప బెంగళూరు లైన్‌ను వేగంగా పూర్తి చేయమని కోరగా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. – రెండోది కిసాన్ రైళ్లు. ఏపీలో పండే పంటల్లో 12 శాతం పండ్లు పండుతుండగా, వాటికి కిసాన్ రైల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దేశంలో 159 రూట్లలో కిసాన్ రైళ్లు నడుస్తుండగా, రాష్ట్రంలో వాటిని పెంచమన్నాం. ఇక పెద్ద లోడింగ్ స్టేషన్ విజయనగరంలో మాత్రమే ఉంది కాబట్టి, అన్ని చోట్ల కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయమని కోరాం. – అలాగే ఉద్యాన పంటల ఉత్పత్తులు చెడిపోకుండా విజయనగరం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో టెంపరేచర్ కంట్రోల్ పెరిషబుల్ కార్గో సెంటర్లు ఏర్పాటు చేయమని రైల్వే మంత్రిని కోరాం. – విశాఖ నుంచి అరకు వరకు విస్టా డోన్ కోచ్‌లు నడుస్తున్నాయి. అయితే అవి మూడు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మరో ఆరు కోచ్‌లు ఏర్పాటు చేస్తే, మొత్తం 9 బోగీలతో నడిపే వీలుంటుందని చెప్పాం. ఆ విధంగా పూర్తి స్థాయి రైలు ఏర్పాటు చేయమని కోరాం. పెండింగ్ ప్రాజెక్టులు–రాష్ట్ర వాటా: పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర వాటా ఇస్తే, త్వరితగతిగ పూర్తి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర వాటాగా రూ.4200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని, మరోవైపు ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ మొత్తాన్ని రుణంగా పరిగణించి, భవిష్యత్తులో వాయిదాల కింద కట్టే విధంగా చేయాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వైష్ణవ్, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రైల్వే జోన్–వాల్తేరు డివిజన్: ఇక సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలకు సంబంధించి అడగ్గా, విశాఖ కేంద్రంగా వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. దానిపై డీపీఆర్ కూడా వచ్చిందని ఆయన చెప్పారు. ఇకరాష్ట్రంలో గుంతకల్, విజయవాడ, వాల్తేరు డివిజన్లు ఉండగా, వాల్తేరు డివిజన్ కింద ఉన్న కొన్ని ప్రాంతాలను రాయగఢ్‌కు తరలించకుండా దాన్ని అలాగే కొనసాగించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయగా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖలో డివిజన్‌కు, జోన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, డివిజన్‌ను తొలగించొద్దని చెప్పగా, రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీ: ఏపీకి సంబంధించి ఈస్ ్టకోస్ట్ జోన్, దక్షిణ మధ్య రైల్వేలో నాన్ గజిటెడ్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు.. ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో 8,447 పోస్టులు, దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మరో 16,741 నాన్ గజిటెడ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం. దానికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. కంటైనర్‌ల ఉత్పత్తి: గుజరాత్ తర్వాత రాష్ట్రం నుంచే అత్యధికంగా 170 మిలియన్ టన్నులకు పైగా కార్గో హ్యాండ్లింగ్ జరుగుతోంది కాబట్టి, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా.. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయమని కోరాం. అలాగే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సికింద్రాబాద్‌లో మాత్రమే ఉండగా, ఏపీలో లేదు కాబట్టి, దేశంలో 22వ ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశాం. కొత్త రైళ్లు–హైస్పీడ్ ట్రెయిన్స్: రాష్ట్రంలో రెండు రూట్లు.. విశాఖ–హైదరాబాద్, విశాఖ–చెన్నై రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలని కోరాం. దానిపైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇంకా హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో నేషనల్ రైల్ ప్లాన్ (ఎన్‌ఆర్‌పీ) కింద దేశంలో ఏడు కారిడార్లకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం కాగా, వాటిలో విశాఖ–హైదరాబాద్, విశాఖ–చెన్నై రూట్లు ఖరారు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆర్వోబీ–ఆర్‌యూబీ–స్టాపేజీ: అన్ని నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12 ఆర్వోబీ, ఆర్‌యూబీలు మంజూరు చేయాలని కోరగా, రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. కొన్ని రైళ్ల స్టాపేజీల గురించి అడిగాం. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 12 ప్లేసెస్‌కు సంబంధించి స్టాపేజీ కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. సీనియర్ సిటిజన్ రాయితీని కోవిడ్ తర్వాత ఉపసంహరించగా, దాన్ని పునరుద్ధరించాలని కూడా మంత్రిని కోరాం. రైళ్ల పేర్లు మార్పు: రెండు రైళ్ల పేర్లు మార్చమని కోరాం. గుంటూరు–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను అనవేమా ఎక్స్‌ప్రెస్‌గానూ, యశ్వంత్‌పూర్–నిజాముద్దీన్ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను కనకదాస ఎక్స్‌ప్రెస్‌గా మార్చమని కోరాం. 16వ శతాబ్ధానికి చెందిన అవదూత ఆయన. కాబట్టి ఆయన పేరు పెట్టమని కోరగా, అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. మీడియా ప్రశ్నలకు జవాబునిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలమంతా కలిసి ప్రధానిగారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలని అనుకున్నాం. ఆ దిశలోనే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న పార్టీలను కూడా కలుపుకుంటూ, ఆయా పార్టీలకు చెందిన 120కి పైగా సభ్యుల నుంచి సంతకాలు సేకరించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా అన్ని కార్మిక సంఘాలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రధానికి సమర్పించే విజ్ఞాపన పత్రాన్ని చూపుతాం. ఆ తర్వాత దాన్ని ప్రధానిగారికి సమర్పిస్తాం. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ పనితీరును చూడమంటున్నాం. ఆ సంస్థ లాభాల్లో ఉంది. అదే విషయాన్ని కేంద్రానికి మరోసారి నివేదించనున్నాం. టీడీపీని కూడా అడిగాం: సంతకాలకు సంబంధించి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను అడిగితే, పార్టీ లెటర్‌హెడ్‌పై అయితే సంతకం పెట్టబోమని ఆయన చెప్పారు. అది వారి మెడకే చుట్టుకుంది: పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి టీడీపీ చేస్తున్న ఆరోపణ ఇక్కడ ప్రధాన అంశం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న వాస్తవాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలి. వారు చేసిన ఆరోపణ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. టీడీపీ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి, విపక్షనేతల ఫోన్‌లపై నిఘా పెట్టారన్నది వాస్తవం. అయిదే దాన్ని ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని ఆయన చెప్పారు. వాస్తవానికి ఆయన ఇంకా ప్రభుత్వ ఉద్యోగి. అయినా అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఇది సరి కాదు.. అని శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ పి.మిధున్‌రెడ్డి మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు.. ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతామని చెప్పారు.