ఏయూలో వైయ‌స్ఆర్ సీపీ మెగా జాబ్‌మేళా ప్రారంభం

మ‌హానేత వైయ‌స్ఆర్‌కు నివాళుల‌ర్పించిన ప్రారంభించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

సామాజిక బాధ్యతతో జాబ్ మేళాలు

దేశంలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించే ఏకైన పార్టీ వైయ‌స్ఆర్ సీపీ

యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

విశాఖపట్నం: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీ ప్రాంగణంలో దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంత‌రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్‌మేళాను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ పనిచేస్తున్నారని, చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం అందాల‌నేది సీఎం లక్ష్యమ‌న్నారు. ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నార‌న్నారు. వైయ‌స్ఆర్ సీపీ జాబ్ మేళా నిరంతర ప్రక్రియగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. 

నిరుద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఏం మాట్లాడారంటే..

రాష్ట్రంలో నిరుద్యోగం పూర్తిగా నిర్మూలించి యువతకు బంగారు భవిష్యత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆశయం మేరకు వైయ‌స్ఆర్ సీపీ పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహిస్తోందన్నారు. అటు ప్రభుత్వపరంగా ఇటు ప్రైవేటుపరంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు చూడాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మొదటి జాబ్ లో వివిధ ప్రైవేటు కంపెనీలలో 7500పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. శని, ఆదివారాల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న జాబ్ మేళాలో 208 కంపెనీలు పాల్గొంటున్నాయని,  24వేల వరకు ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అన్నారు. రిజిస్టర్ చేసుకున్న యువత వారి వారి అర్హతలను బట్టి ఇష్టపడ్డ రంగంలో కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. యువత జ్యోతి వంటిదని, అది దేశానికి వెలుగునిస్తుందని, యువత అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

208 కంపెనీలు యూనివర్సిటీలోని వివిధ బ్లాకులలోని 208  భవనాలలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయని, ఆయా కంపెనీలకు సంబందించిన  మొత్తం వివరాలు, ఆయా భవనాల ముందు డిస్ప్లే బోర్డులు పెట్టడం జరిగిందని అన్నారు. అభ్యర్దులు సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. మొత్తం 9 బ్లాకులలో నిర్వహిస్తున్న మేళాలో ఉద్యోగుల ఎంపికకు సంబంధించి ఆయా బ్లాకుల వద్ద హెల్ప్ డెస్క్ లు, కియోస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటితో పాటు 850 మంది వలంటీలర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఎంపిక కాబడ్డ అభ్యర్దులకు అదే రోజు సాయంత్రం స్నాతకోత్సవ మందిరంలో నియామక పత్రాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం జాబ్ మేళాకు మొత్తం 77వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని, అవసరమైతే జాబ్ మేళాను సోమవారం వరకు పొడిగిస్తామని, నిరుద్యోగులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.

నైతిక విలువులు పరిరక్షించాల్సిన బాధ్యత యువతదే
నానాటికీ పతనమైపోతున్న నైతిక విలువులు పరిరక్షించే బాధ్యత నేటి యువతరం పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. వారసత్వ సంపదగా తరువాత తరాల వారికి అందించాల్సిన బాధ్యత కూడా యువతపై ఉందన్నారు. యువత ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, కృషి, పట్టుదల, నిజాయితీ, అత్మవిశ్వాసం, నిబద్దత ప్రతి రంగంలోనూ విజయం సాధించేందుకు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ మాజీ అధ్యక్షుడు విన్ స్టన్ చర్చిల్ విజయాన్ని ఉద్దేశించి చెప్పిన మాటలను గుర్తుచేశారు. విజయం అంతిమం కాదని, పరాజయం ప్రాణాంతకం కాదని, నిరంతరం సాధనతో విజయం సొంతమని అన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు, ఐదు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని, ఉద్యోగాలకు ఎంపిక కాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, జాబ్ మేళాలు నిరతంరంగా నిర్వహించబడుతూనే ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన ఏయూ విసి ప్రసాద్, రెడ్డి, మిలీనియం శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ, జివిఎంసి, ఇతర ప్రభుత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు జాబ్ మేళా ఒక వారం వాయిదా
ఏప్రిల్ 30, మే1 లలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఒక వారం పాటు వాయిదా పడినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీ పర్యటన కారణంగా జాబ్ మేళా ఒక వారం పాటు వాయిదా వేసినట్లు వెల్లడించారు.  

ముఖ్యమంత్రి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు: మంత్రి అమర్నాథ్
పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేస్తున్నారని, యువతకు ఉద్యోగాల కల్పించాలనే లక్ష్యంతో సచివాలయం, వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసారని, ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు కల్పించాలని వైయ‌స్ఆర్ సీపీ  ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాల్ని యువత వినియోగించుకోవాలని కోరారు. 

కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎంఎల్ఏలు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, ఎంఎల్సీలు వంశీ, వరుదు కళ్యాణి, జివిఎంసి మేయర్ గొలగాని వెంకట హరికుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్  సుబద్ర, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, మిలీనియం శ్రీధర్ రెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్ కేకేరాజు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top