అనపర్తి: అనపర్తి బహిరంగ సభలో చంద్రబాబు తీరు ఆక్షేపణీయమని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏం చెబుతుంది?. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయం చేయమంటుందా? ఉచ్ఛనీచాలు మరిచిన చంద్రబాబు పిచ్చి పట్టినట్లు మాట్లాడి సీఎంగారు, స్థానిక ఎమ్మెల్యేను తూలనాడడాన్ని పార్టీ తరఫున మేమంతా ఖండిస్తున్నామన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో, ప్రజలు తనను ఏ మాత్రం ఆదరించడం లేదన్న దుగ్ధతో చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని అంతా అనుకుంటున్నారు. సీఎంగారిని నిందించడం, చివరకు తనకు భద్రత కల్పిస్తున్న పోలీసులపైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు కనీసం మర్యాద అనేది లేకుండా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. శనివారం అనపర్తి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. బాబు ప్రచారయావ. మరోసారి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మంది మరణానికి, ఇటీవల కందుకూరు, గుంటూరులో మరో 11 మంది బలి కావడానికి చంద్రబాబు ప్రచారయావే కారణం. చట్టాల ఉల్లంఘన, ప్రజల ప్రాణాలు బలి.. రెండు అంటే చంద్రబాబుకు ఎంతో ఆనందం. అదే నిన్న అనపర్తిలో మరోసారి నిరూపించాడు. ప్రజల భద్రతపై కనీస ధ్యాస లేదు: కందుకూరు, గుంటూరు ఘటనల తర్వాత ప్రజల భద్రత కోసం ప్రభుత్వం జీఓ నెం.1 జారీ చేసింది. దాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడం విడ్డూరం. అనపర్తి కెనాల్ రహదారిలో రోడ్‌షోకు అనుమతి తీసుకున్న చంద్రబాబు, బహిరంగ సభకు సిద్ధం కావడంతో, ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యామ్నాయ చోటు చూపించారు. అయినా ఒప్పుకోకుండా పోలీసులను నిందిస్తూ, కార్యకర్తలను వారిపై ఉసి గొల్పి దాడి చేయించాడు. చట్టాన్ని ఉల్లంఘిస్తే హీరో అవుతానన్న ధోరణి తప్ప, చంద్రబాబుకు ప్రజల భద్రతపై కనీసం ధ్యాసే లేదు. రెండింటి మధ్య తేడా తెలియదా?: మరి రోడ్‌షోకు అనుమతి తీసుకుని, బహిరంగ సభకు సిద్ధమైన చంద్రబాబుకు రెండింటి మధ్య తేడా తెలియదా? తనను అనుమతి ఇచ్చి కూడా అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఎందుకు చిందులు వేశాడు?. అంత హడావిడి ఎందుకు చేశాడు?. చంద్రబాబు నువ్వు చేసిన తప్పుడు పనికి ప్రభుత్వం మీద బురద చల్లడం, దుష్ప్రచారం చేయడం సరికాదు. ఇప్పటికైనా నీ దగ్గరున్న రోడ్‌షో అనుమతి పత్రం బయట పెట్టు. రోడ్‌షోకే అనుమతి తీసుకున్నానని, బహిరంగ సభకు కాదన్న విషయాన్ని ప్రజలకు చెప్పి, చేసిన తప్పును ఒప్పుకుంటే మంచిది. పోలీసుల విధి నిర్వహణ నేరమా?: జడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు భద్రత కోసం ప్రభుత్వం తగిన జాగ్రత్తలు చేపట్టడం తప్పా? మీ భద్రత కోసం పని చేస్తున్న పోలీసులనే తిడతారా? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడడమే వారు చేసిన నేరమా? జీఓ నెం.1 అమలులో ఉన్న సమయంలో అటు ప్రజల భద్రత, ఇటు జడ్ కేటగిరీలో ఉన్న నాయకుడి రక్షణ బాధ్యతను ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. ఆ దిశలోనే బహిరంగ సభ వేదిక మార్చుకోవాలని పోలీసులు చంద్రబాబుకు పలు విధాలుగా విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన చంద్రబాబు, వారిని ఇష్టానుసారం తిట్టడం ఎంత వరకు సబబు? బాబు నీవు జాతి ఉద్యమకారుడివే: చట్టాన్ని ఉల్లంఘించడం హీరోయిజం అని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ నిజానికి అలాంటి వారు నేరస్తులు అవుతారు. జాతి పిత గాంధీతో చంద్రబాబు పోల్చుకోవడం చాలా సిగ్గుచేటు. ‘బాబూ నువ్వేమైనా జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నావా? మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్నావు! జాతీయ నాయకులతో నిన్ను నువ్వు పోల్చుకోవడాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ పోరాట ఉద్యమకారుడైతే.. నీవు కేవలం జాతి ఉద్యమకారుడివే’.. ఇది వాస్తవం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. కులాల ప్రస్తావన ఎందుకు?: సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు వెనుకబడిన వర్గాల వారు న్యాయవ్యవస్థలో జడ్జిలుగా పనికిరారని లేఖ ఇవ్వడం నిజం కాదా? అదే తీరులో తాజాగా అనపర్తిలో కూడా చంద్రబాబు కులాల ప్రస్తావన తెచ్చాడు. అనపర్తి రెడ్లకు వ్యతిరేకం కాదని ఎందుకు చెప్పుకున్నావ్?. చంద్రబాబు ఇది మంచి రాజకీయం కాదు. ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించు. ఆనపర్తి ప్రజలు దివంగత మహానేత వైయస్సార్‌కు వీరాభిమానులు. అలాంటి చోట కులం ప్రస్తావం ఏమిటి బాబూ?. బహిరంగ చర్చకు సిద్ధమా?: ఈమధ్య చంద్రబాబు ఎక్కడికెళ్లినా స్థానిక శాసనసభ్యుడ్ని కించపరచడం, వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. ఆ పద్ధతి మార్చుకుంటే ఆయన పెద్దరికం నిలబడుతుంది. చంద్రబాబు సుదీర్ఘ పాలనలో ఈ ప్రాంతానికి చేసిందేమిటి? మరి ఈ మూడున్నరేళ్లల్లో మా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఏం చేశారనే విషయంపై బహిరంగ చర్చకు వస్తావా బాబూ?. ఆ ధైర్యం నీకుందా?. ఇకనైనా వైఖరి మార్చుకో: మా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మీద నింద పడితే ఇక్కడి ప్రజలు హర్షించరు. ఇక్కడ మా పార్టీ విజయాన్ని అడ్డుకోవడం మీ తరం కాదు. నీవు మా సీఎంగారు, ఎమ్మెల్యే మీద చేసిన విమర్శలు దారుణం. మా అనపర్తి జనం తల్చుకుంటే నీవు ఒక్క అంగుళం కూడా కదల్లేవు. కానీ వదిలేశాం. ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే నీకు రాజకీయ మనుగడ ఉండదు. బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు, అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించారు. రోడ్‌షోకు అనుమతి తీసుకుని బహిరంగ సభ పెట్టారు. అదేమని అడిగిన పోలీసులపై చంద్రబాబు దౌర్జన్యం, గుండాయిజం చేశారు. ఓపెన్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేసుకుంటే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినా వినకుండా.. నడిరోడ్డుపై ఏకంగా రెండు వేల మందితో సభ పెట్టుకున్నాడు. అలా చంద్రబాబు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజలు వీళ్ల చేష్టలన్నీ చూశారు. రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే ఇక్కడ గెలవగలవా?: అవినీతి తిమింగలమైన మాజీ ఎమ్మెల్యేను పక్కన పెట్టుకుని చంద్రబాబు నోటికొచ్చినట్లు నామీద ఆరోపణలు చేశాడు. అనపర్తిలో నా ఆస్తుల మీద.. చంద్రబాబు మొత్తం ఆస్తులపై సీబీఐతో ఏకకాలంలో విచారణ చేయిద్దాం. అందుకు బాబు సిద్ధమా? అనపర్తిని మరో పులివెందుల అని చంద్రబాబు అన్నాడు. ఔను అభివృద్ధిలో అనపర్తి ముమ్మాటికీ మరో పులివెందుల అని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడ పోటీ చేసి గెలవగలవా? అని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ చేశారు.