విశాఖ: రాష్ట్రంలో మద్యం తక్కువగా తాగుతున్నందుకు మీకు చాలా బాధగా ఉన్నట్టుందని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బహిరంగ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. – రాష్ట్రంలో మద్యం అమ్మకాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో మీరు చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ తరఫున చేసినవా? బాబు జనతా పార్టీ తరఫున చేసినవా అన్నది ప్రజలకు బాగా అర్థమవుతోంది! – రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలు, అమ్మకాలు తదితర అంశాల మీద మీరు గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణల్ని బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగా భావించాలి! బహుశా మీ మరిది చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో 53 రోజులు రిమాండ్‌లో ఉంచటం అన్నది మీరు ఏమాత్రం జీర్ణించుకోలేని అంశంగా మారినట్టు కనిపిస్తోంది! –43,000 బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలో వీధివీధిలో మద్యం దుకాణాల్ని పాడుకున్న వారు దుకాణాలతోపాటు నడిపిన పర్మిట్ రూమ్‌లు, ఆ పైన బెల్ట్ షాపులు... ఇలా మహిళలు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితే లేకుండా, గుడీ–బడీ తేడా లేకుండా అన్ని చోట్లా మద్యం ఏరులై పారినది మీ మరిదిగారి అయిదేళ్ళ పాలనలోనే! –ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేటుకు దుకాణాల్లో, బెల్ట్ షాపుల్లో అమ్మిన ఆ సమయంలో... కేవలం 7 డిస్టిలరీలు 80 శాతం ఉత్పత్తి చేసిన ఆ కాలాంలో... మీ గొంతు ఎందుకు మూగపోయిందో... ఇప్పుడు, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్ముతున్న పరిస్థితిలో, మద్యం దుకాణాల్ని తగ్గించి, మద్యం సేల్స్ తగ్గించి, రేట్లు పెంచి, బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మూలించిన జగన్‌గారి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు విమర్శిస్తున్నారో... మీకే బాగా తెలుసు! – దీని అర్థం మీరు– మీ మరిదికి మద్దతు ఇవ్వటంతో పాటు; మద్యం బెల్ట్ షాపులకు, మద్యం భారీ అమ్మకాలకు, మద్యం లాబీలకు అనుకూలం అని భావించాల్సి వస్తోంది! – మీ తండ్రి పెట్టిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన మీ మరిదికి మద్దతు ఇచ్చి అప్పట్లో మీ తండ్రి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీరు... ఇప్పటికీ చంద్రబాబు మద్యం విధానమే బాగుందని చెపుతున్నారంటే, ఇంతకంటే రాజకీయ పతనం ఉంటుందా? – పురందేశ్వరిగారూ ఒక్క విషయం చెప్పండి... మద్యం అమ్మకాలు పెంచితే మద్యం ఉత్పత్తి–అమ్మకపు సంస్థలు ముడుపులు చెల్లిస్తాయా? లేక లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్ముతూ, మద్యం ఉత్పత్తి–అమ్మకాలను తగ్గిస్తే ఎవరికైనా ముడుపులు వస్తాయా? మద్యం ఏ సమయంలో అయినా అమ్ముకోవచ్చు అంటే ముడుపులు వస్తాయా? మద్యం దుకాణాలు ఈ టైంలో మాత్రమే అమ్మకాలు సాగిస్తాయని కచ్చితంగా ఆ సమయాన్ని పాటిస్తే ముడుపులు వస్తాయా? – మద్యం అమ్మకాల్ని పెంచిన కాలంలో మనుషుల ఆరోగ్యాలు పాడవుతాయా? లేక మద్యం అమ్మకాల్ని తగ్గించి, నియంత్రించిన పాలనలో ఆరోగ్యాలు పాడవుతాయా? రాష్ట్రంలో లివర్ సంబంధిత వ్యాధులు పెరిగాయన్న మీ వాదన అసత్యం! ఏ వ్యాధికి అయినా మందు ఉందేమోగానీ, చంద్రబాబుకు అధికారం ఉంటే పాపాలు చేసినా పుణ్యాల ఖాతాలో పడతాయని... అదే జగన్‌గారి పాలనలో ప్రజలకు మంచి చేసే అనేక పథకాల ద్వారా ఇప్పటికే రూ. 2.4 లక్షల కోట్లు డీబీటీగా... ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా అందినా ఇవన్నీ పాపాలేనని భావించే కడుపు మంట, కళ్ల మంటలకు మాత్రం ఎలాంటి మందులూ లేవు! –మరో విషయం కూడా... రాష్ట్రంలో మద్యం తక్కువగా తాగుతున్నందుకు మీకు చాలా బాధగా ఉన్నట్టుంది! – మీ మరిదిగారిది మద్యం ఉత్పత్తిని ఏటేటా పెంచుకుంటూ... మద్యం అమ్మకాల టార్గెట్లు మరింతగా నిర్ణయించుకుంటూ నడిచిన పాలన! ఆ పాలనలోనే కొత్తగా మద్యం ఉత్పత్తికి కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారు! రాష్ట్రంలో ఉన్న 20 మద్యం ఉత్పత్తి కంపెనీల్లో 14 మీ మరిదిగారి ప్రభుత్వం అనుమతులు ఇస్తే వచ్చినవే! అవి కూడా మీ తెలుగుదేశం వారివే! యనమల నుంచి అయ్యన్న పాత్రుడి వరకు; ఆదికేశవులునాయుడు నుంచి ఎస్పీవై రెడ్డి వరకు అంతా మీ బాబు పార్టీ వారే! జగన్‌గారి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గానీ అనుమతి ఇవ్వలేదు! – జగన్‌గారి ప్రభుత్వం 18 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే... మీ మరిది తన పాలనలో 14 మద్యం ఉత్పత్తి సంస్థలకు అనుమతి ఇచ్చాడు! ఇదీ ఆయన విజన్! – అంతే కాకుండా, కొత్త కొత్త బ్రాండ్లు కూడా మీ మరిదిగారి పాలనలోనే, వారి పర్మిట్లతోనే మార్కెట్‌లోకి వచ్చాయి! ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ మొదలు... బూం బూం బీర్ కూడా మీ మరిదిగారి హయాంలోనే మార్కెట్‌లోకి ఎలా వదిలారన్నది సీఎం జగన్‌గారు శాసన సభలో వివరించారు! – ఇవన్నీ చంద్రబాబు బ్రాండ్లు అయితే... జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ జగనన్న ఇళ్ళ పట్టాలు... ఇవన్నీ మా ప్రభుత్వం బ్రాండ్లు! – మద్యం డిస్టిలరీలు అప్పుడైనా–ఇప్పుడైనా టీడీపీ వారివే! బ్రాండ్లూ అవే బ్రాండ్లు! తయారీ విధానం కూడా అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! తేడా ఏమిటంటే అప్పట్లో చంద్రబాబు సీఎం... ఇప్పుడు జగన్‌గారు సీఎం! నచ్చిన వ్యక్తి సీఎంగా ఉంటే బెల్టుషాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మినా పెగలని నోరు... నచ్చని వ్యక్తి సీఎం అయితే ఎలా మాట్లాడుతుందో పురందేశ్వరి గారూ... మిమ్మల్ని చూస్తే బాగా తెలుస్తుంది! – ఇక మద్యం తాగేవారి సంఖ్య నుంచి, మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్‌గా పేదల సంక్షేమానికి మళ్ళించటం గురించి కనీస అవగాహన లేకపోయినా బురద చల్లాలన్న ఆలోచనతో అసత్యాలు మాట్లాడారు! కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబ ఆరోగ్య సర్వేలో ఏం చెపుతున్నారన్నది కూడా పరిగణనలోకి తీసుకోనంతగా మీలో బాబు జనతా పార్టీ పట్ల భక్తి పెరిగిందని భావించాలి! నిజాలేమిటన్నది ప్రభుత్వం వివరిస్తున్నా వినిపించుకునే ఉద్దేశం మీకు కనిపించటం లేదు! – ఇవన్నీ తెలుసుకుని మాట్లాడే తీరిక మీకు ఉన్నట్టు లేదు! బురద పూయటమే మీ వంతు అన్నట్టు 70కి దగ్గరపడుతున్న మీరు ఈ వయసులో కూడా ఇలాంటి రాజకీయాలు నడపటం ఎవరికి అవసరమో, ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి! ఈ రాష్ట్రంలో ఉన్న కోటిన్నర కుటుంబాలకు మంచి చేస్తున్న ప్రభుత్వం మీద... ఈ రాష్ట్రంలో లేని– ఎన్టీఆర్ వెన్నుపోటు కుటుంబ సభ్యులు ఇప్పటికీ అదే ధోరణితో కుతంత్రాలు, వెన్నుపోట్లు, అబద్ధాలను రాజకీయ విధానంగా మార్చుకోవటం ఎంతవరకు సబబో ఆలోచన చేయండి!