మరో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో పవన్‌కళ్యాణ్‌

వరుదు కళ్యాణి ఫైర్‌

రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు

మహిళలకు కొరడిన రక్షణ, రోజూ అత్యాచారాలు

ఇటు యథేచ్ఛగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల అరెస్ట్‌లు

అక్రమ కేసులు, వేధింపులతో వెల్లువెత్తుతున్న విమర్శలు

దీంతో రెండు అంశాలను కలిపి పవన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌

వరుదు కళ్యాణి స్పష్టీకరణ

శాంతి భద్రతలు చూస్తున్న చంద్రబాబు తప్పుకోవాలి

ఆడబిడ్డల మానప్రాణాలను రక్షించలేని ప్రభుత్వమిది 

హోం మంత్రి విఫలమయ్యారని అందరికీ తెలిసిన విషయమే

ఈ వైఫల్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ కూడా బాధ్యులే

తన పరిధిలో జరిగిన దుర్ఘటనలపై ఆయనేం చేశారో చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన వరుదు కళ్యాణి

విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌ టోటల్‌గా ఫెయిల్‌ అయిందని, శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, విధి నిర్వహణలో హోం మంత్రి ఘోరంగా విఫలమయ్యారని. మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, వారిపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌ అయ్యారు. వీటన్నింటికీ సీఎం చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.    మరోవైపు పోలీస్‌ వ్యవస్థను రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారంటూ, ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో, ప్రజల దృష్టి మళ్లించేందుకు.. ఆ అరెస్టులను, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. రెండింటినీ కలుపుతూ పవన్‌కళ్యాణ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారని ఆక్షేపించారు. ఆ దిశలోనే ఆయన, హోం మంత్రిపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు. విశాఖపట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

హోం మంత్రి సరే.. మీరు చేసిందేంటి?:
    ప్రభుత్వంలో కీలకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు, ప్రభుత్వ వైఫల్యంలో భాగస్వామ్యం లేదా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. హోం మంత్రి విఫలమయ్యారని రాష్ట్రమంతా అనుకుంటున్న నేపథ్యంలో.. మరి మహిళలకు అన్యాయం జరుగుతుంటే తానేం చేస్తున్నారని.. పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
    ‘మీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో యువతికి మత్తుమందిచ్చి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించారా?. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులు మిమ్మల్ని కలిసి న్యాయం చేయమని వేడుకుందామని అనుకుంటే, కనీసం కలిసే అవకాశం ఎందుకివ్వలేదు?. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను లైంగికంగా వేధిస్తే, ఆమె ఆత్మహత్యా యత్నం చేస్తే, మీరు కనీసం పరామర్శించారా?’ అని డిప్యూటీ సీఎంను వరుదు కళ్యాణి గట్టిగా నిలదీశారు.
    రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక, వారిలో ఎంత మందిని వెతికి తీసుకొచ్చారని.. అలాగే వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు ఏమైందని ఆమె ప్రశ్నించారు. 

పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?:
    కూటమి ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు భద్రతతో పాటు, నిద్ర కూడా కరవైందన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలీసులు, హోం మంత్రి గురక పెట్టి నిద్రపోతున్నారా? అని దుయ్యబట్టారు.
    మహిళల భద్రతంటే ఈ ప్రభుత్వానికి చులకనభావం ఉందని ఆమె తేల్చి చెప్పారు. 5 నెలల కూటమి పాలనలో సీఎం సొంత జిల్లాలో మూడు అత్యాచారాలు, నారా లోకేశ్‌ సొంత నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలో 3 అత్యాచారాలు జరగడంతో పాటు, రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతిరోజూ అఘాయిత్యాలు, మహిళలు బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని గుర్తు చేశారు.

దిశ యాప్‌ పునరుద్ధరించాలి:
    గతంలో మహిళలకు అండగా ఉన్న దిశ లాంటి వ్యవస్థ ఉండుంటే ఇలాంటి అకృత్యాలు జరిగేవి కాదన్న ఎమ్మెల్సీ, ఇప్పటికైనా దిశ యాప్‌ పునరుద్ధరించడంతో పాటు, కేంద్రం దిశ చట్టాన్ని ఆమోదించేలా చూడాలని కోరారు. తమ అధినేత  వైయస్‌ జగన్‌ పరామర్శకు వెళితే తప్ప ప్రభుత్వంలో చలనం రావడం లేదన్న ఆమె, సీఎం చంద్రబాబు బాధితులకు న్యాయం చేయకుండా నిందితుల పక్షాన నిలబడి పంచాయతీ చేస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన ఆడబిడ్డల తల్లిదండ్రులకు ప్రతిపక్ష నేత రూ.10 లక్షలు పరిహారం ఇస్తుంటే, ప్రభుత్వం కూడా అంతే పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటోందని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.

 

‘చంద్రబాబుకు ఏ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు’
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని  మాజీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలా దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నామని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘పలాసలో నడి రోడ్డుపై దాడి జరిగితే.. వారిపై ఫిర్యాదు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కూడా వారిపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ దానిపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు వచ్చాం.. ఎస్పీ కూడా ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతీ అధికారి రాబోయే రోజుల్లో తగిన పరిష్కారం ఎదుర్కొంటారు. సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారు. 

అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం ఒక్కదానిపైనైనా దృష్టి పెడుతుందా?. ఏ కార్యకర్తపై ఎప్పుడు దాడులు చేస్తారో.. ఏ  కేసులు పెడతారో తెలియటం లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలు పలాసను అభివృద్ధిలో పరుగులు పెట్టించాం. కానీ ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు ఏ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు?. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టండి.. ప్రతి ఒక్కరి కష్టాలు మన నాయకుడు  వైఎస్‌ జగన్‌ దృష్టిలో ఉన్నాయి. 

రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు ప్రజలకు మంచి జరుగుతుంది.  చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టుకు అయినా ఒక హార్బర్‌ అయినా శంకుస్థాపన చేశారా? కానీ ఇప్పుడు పోర్టులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.  అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారు.  ఇప్పుడు చంద్రబాబు పోర్టులను ప్రైవేటీకరణ చేస్తుంటే. పవన్‌ ఏం చేస్తున్నారు.  ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణపై తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ఆలోచించాలి. గిరిజన భూములపై గిరిజనులకు ఎంత హక్కు ఉందో.. సముద్రంపై తీర ప్రాంతంలోని మత్స్యకారుడికి కూడా అంతే హక్కుంది’ అని అన్నారు. 

 

 ‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’
అనంతపురం: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి  అన్నారు. రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ అమలు చేస్తానని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు.  నారా లోకేష్ హింసా రాజకీయాలు ప్రేరెపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాని అన్నారు.

‘చంద్రబాబుది.. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం’
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ కూటమికి ఓటమి తప్పదు.రుషికొండ భవనాలు.. వైఎస్ జగన్ సొంత భవనాలు కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. రుషికొండ భవనాలు టూరిజం శాఖకు చెందినవి. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక భవనాలు నాసిరకంగా ఉన్నాయి.  పార్క్ హయత్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లకు ఎంత డబ్బు చెల్లించారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు ఎన్ని వేధింపులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడవు’’అని అన్నారు.

చంద్రబాబు ఆదేశాలతో దాడులు
కర్నూలు: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ కాటరీ పల్లవి కుటుంబ సభ్యులపై మంత్రి అనుచరులు దాడి చేశారని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.  

‘‘కాటరీ పల్లవిపై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అరాచకాలు మీతిమీరినట్లు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కబ్జాలు, దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని  అన్నారు.

Back to Top