విజయవాడ: తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఎమ్మెల్సీ కల్ప లతా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాచవరం ఆంజనేయస్వామి గుడిలో పరిహార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, కల్పలతారెడ్డిలు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి పేరుతో జరుగుతున్న రాజకీయాలకు పరిహారం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కల్పలతారెడ్డి మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవించడం లేదు. రాజకీయాల కోసం దేవుళ్లను అడ్డం పెట్టుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది” అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు, భక్తులపై దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన పాలకులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేదు: మల్లాది విష్ణు దేవుడంటే కూటమి నేతలకు భయం, భక్తి లేదు, ఆలయాలంటే గౌరవం లేదు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేసి హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డుపై జరిగిన విష ప్రచారం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని, దీని వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు భక్తులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.