విశాఖ: అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు సరికాదన్నారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించలేదన్నారు. గురువారం బొత్స సత్యనారాయణ అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ.1 కోటి చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. సెజ్ ప్రమాద బాధితులకు కూడా రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేపు బాధితులను వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని చెప్పారు.