ట్రంప్‌కు..చంద్ర‌బాబుకు తేడా లేదు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి

రైతుల‌కు పెట్టుబ‌డి సాయం చేయ‌డం త‌ప్పా?

చంద్ర‌బాబు ఎగ్గొట్టిన ఇన్‌ఫుట్ స‌బ్సిడీ మా ప్ర‌భుత్వం ఇచ్చింది

ఆర్‌బీకేల ద్వారా రైతుల‌కు కావాల్సినవ‌న్నీ అందిస్తున్నాం

తాడేప‌ల్లి: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు తేడా లేకుండా పోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు. ట్రంప్ మాదిరిగానే చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పేర్కొన్నారు.ప్ర‌జ‌ల విచ‌క్ష‌ణా జ్ఞానాన్ని చంద్ర‌బాబు అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌బాబు నాయుడు ఐదేళ్ల పాల‌న‌లో రైతుల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామ‌ని ఓట్లు వేయించుకొని మోసం చేశార‌ని మండిప‌డ్డారు. త‌న హ‌యాంలో రైతులు ప్ర‌కృతి వైఫ‌రిత్యాల కార‌ణంగా పంట‌లు న‌ష్ట‌పోతే ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇవ్వ‌కుండా ఎగ్గొట్టార‌ని విమ‌ర్శించారు. రైతుల నుంచి తక్కువ ధ‌ర‌కు పాలు కొనుగోలు చేసి..త‌న సొంత సంస్థ హెరిటేజ్‌లో ఎక్కువ‌కు అమ్ముకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి వ్య‌క్తి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి మాట్లాడ‌టం సిగ్గు చేటు అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌దానిక‌న్నా రైతుల‌కు ఎక్కువే చేస్తున్నార‌ని తెలిపారు. పాద‌యాత్ర‌లో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం రూ.12,500 ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, దానికంటే మ‌రో వెయ్యి అద‌నంగా అంటే రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తున్నార‌ని తెలిపారు.

చంద్ర‌బాబు ఎగ్గొట్టిన ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా వైయ‌స్ జ‌గ‌న్ చెల్లించార‌ని పేర్కొన్నారు.  రైతుకు అవ‌స‌ర‌మైన విత్తనం నుంచి పంట అమ్ముకునే వ‌ర‌కు మా ప్ర‌భుత్వం తోడుగా నిలిచింద‌న్నారు. ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌న్నారు. రంగుమారిన ధాన్యం, త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌న్నారు. రైతుల ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వం ఒక సంస్థ‌ను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు.  డిసెంబర్ వరకు జరిగిన నష్టానికి రైతులకు సంబంధించిన పంటలకు పరిహారం అందించామ‌ని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇవాళే రూ.1000 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని తెలిపారు. గ్రామాల్లో రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేసి..వారికి కావాల్సివ‌న్నీ కూడా అందిస్తుంద‌ని చెప్పారు. రైతుల‌కు అవ‌స‌ర‌మైన ఎరువులు, పురుగు మందులు ఆర్‌బీకేల ద్వారా అంద‌జేస్తున్న ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు చంద్ర‌బాబుకు లేద‌ని పార్థ‌సార‌ధి హెచ్చ‌రించారు.  

Back to Top