కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిచ్చారని సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు రాజకీయాన్ని ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైందన్నారు. వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల విజయానికి కారణమన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డుల్లో గెలిపించిన ఓటర్లకు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.