రాష్ట్రానికి చంద్రబాబు రాజద్రోహం చేశారు

అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్‌

అభివృద్ధి అనేది రాష్ట్ర నలుమూలలా విస్తరింపజేయాలి

విశాఖను సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

అసెంబ్లీ: అమరావతి పేరుతో చంద్రబాబు దేశంలోని అతిపెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు. మూడు పంటలు పండే భూమిని రాజధాని పేరు చెప్పి రైతుల నుంచి లాక్కున్నారు. చంద్రబాబు తాబేదారులు అయితే రైతులను బెదిరించి తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టుకొని భూమిని కాజేశారు. ఐదేళ్లు అయ్యింది.. సుందరమైన రాజధాని నిర్మాస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పాకిస్తాన్‌కు దేశద్రోహం చేసిన ముషారఫ్‌కి మరణశిక్ష విధించారు. ఆంధ్రరాష్ట్రానికి రాజద్రోహం చేసిన చంద్రబాబును ఏం చేయాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అసెంబ్లీలో గుడివాడ అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..

‘2014లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి, మనోభావాలకు వ్యతిరేకంగా జరిగిన విభజన ప్రక్రియ ఇబ్బందులను ఏరకంగా గురిచేసింది. రాష్ట్ర మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో.. ప్రజలు ఏరకంగా పోరాటాలు చేశారో చూశాం. కేంద్ర నిర్ణయానికి కొన్ని రాజకీయ పార్టీలు సహకరించడం. రాష్ట్ర విభజన ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయాం. కేవలం పది సంవత్సరాలకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ప్రవేశపెట్టడం, హైదరాబాద్‌ లాంటి నగరం పోయిన తరువాత ఆంధ్రరాష్ట్రం ఏరకంగా అభివృద్ధి చెందుతుంది.. ముందుకెళ్లగలుతుందనే ఆలోచన చేస్తుండగానే 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనలు, వచ్చిన ఫలితాలు వచ్చిన తరువాత ఐదు సంవత్సరాలు పాలించారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను విభజన చట్టంలో పెట్టిన తరువాత 2014 నుంచి 24 వరకు ఉమ్మడి రాజధాని అని చట్టం చెప్పిన తరువాత విభజన జరిగిన సంవత్సరకాలంలోనే హైదరాబాద్‌ లాంటి నగరాన్ని విడిచి విజయవాడ రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వ్యక్తిగత కారణాలతో ఉమ్మడి రాజధానిని వదిలివచ్చి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసినట్లుగా బస్సులో పడుకున్నాను. చెట్టుకింద ఉన్నాను. పుట్టకింద ఉన్నాను అని ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం చెప్పిన మాట దేశంలోనే పెద్ద స్కామ్‌ అని తెలియజేస్తున్నాను. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ (పీఓటీ) కేబినెట్‌ సమావేశాల్లో దాన్ని రద్దు చేశారు. అసైన్డ్‌ భూములకు సంబంధించిన యజమానుల నుంచి వారికి కావాల్సిన మనుషులకు తెల్లకాగితాల మీద రాయించుకున్నారు.

33 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్, మరో 20 వేల ఎకరాలు. కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో దాదాపు 52 వేల ఎకరాలు తీసుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో వారు తీసుకుంది 8603 చదరపు కిలోమీటర్లు.. అంటే దాదాపు 20 లక్షల ఎకరాలు సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చి ఇందులో హెరిటేజ్‌కు 14 ఎకరాలు, వారికి  కావాల్సిన తాబేదారులకు వేలాది ఎకరాలు, దాదాపు కేవలం ఎక్వైర్‌ చేసి 5 వేల ఎకరాలను అభివృద్ధి చేసుకోవడానికి చేసిన పెద్ద స్కామ్‌గా రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోరంబోకు భూమిలో నిర్మాణం చేశారు. రాజధాని నిర్మాణం పేరిట చెప్పిన పాలసీల్లో ఒకటి 9 ఇన్‌ 1 అని చెప్పారు. వీరంతా ఆల్‌ ఇన్‌ వన్‌ అయిపోయి మొత్తం వారికి వారు అభివృద్ధి చెందారు కానీ.. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందలేదు. గత ఐదేళ్లకాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక ప్రాంతాలు తిరిగారు. సింగపూర్, మలేషియా, బీజింగ్, దావోస్, అమెరికా, రష్యా అన్నారు. ఒక పత్రికా సమావేశం పెట్టి సింగపూర్, జపాన్‌ తరహాలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఒక పేదవాడికి మంచి చేయాలన్నా.. సంక్షేమ కార్యక్రమం అందించాలన్నా.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాడానికి కావాల్సింది మంచి రాజధాని కాదు.. ఒక మంచి మనస్సు.. ఆ మనస్సు సీఎం వైయస్‌ జగన్‌కు ఉంది.

మన ఇంజినీర్లకు ప్లాన్‌ అప్పగిస్తే మురికివాడలు కడతారని చంద్రబాబు మాట్లాడారు. కేవలం కన్సల్టెంట్‌ ఫీజు కోసం దాదాపు రూ.85 కోట్లపైచిలుకు ఖర్చు చేశారు. దాంట్లో రూ.400 కోట్లు బిల్డింగ్‌ చేస్తే.. మిగిలిన బ్యాలెన్స్‌ మనపై పడే పరిస్థితి వచ్చింది. మన దేశం, రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది మేధావులను వదిలేసి విదేశాలు తిరిగి విదేశీయులను పొగిడారు. చంద్రబాబుకు విదేశాల మీద ఉన్న ప్రేమ.. మన దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఇంజినీర్లను పైకితీసుకురావాలనే ఆలోచనే లేదు. రాజధాని నిర్మాణానికి దేశంలోని అన్ని నదుల నుంచి నీరు, మట్టి తీసుకురావాలని మార్కెటింగ్‌ చేశారు. హెలికాప్టర్‌ ప్రయాణం చేస్తూ చెంబులోని నీరును చిమ్మారు. ఎలాగూ రాజధాని నిర్మాణం జరగలేదు. కనీసం మూడు పంటలు పండే పంటలు కూడా చంద్రబాబు నీరు చల్లిన తరువాత పంటలు కూడా పండడం లేదు. చంద్రబాబు నీరు పోశాడో.. యాసిడ్‌ పోశాడో అర్థం కాలేదు.

తిరుపతి వెళ్తే హుండీలు చూశాను. సెక్రటేరియట్‌లో హుండీలు ఎప్పుడూ చూడలేదు. అనుకూల మీడియాతో డొనేషన్స్‌ ఆహ్వానిస్తూ ప్రచారం చేసుకోవడం. ఇవన్నీ ఎంబీఏలో మార్కెటింగ్‌ స్కిల్స్‌లో ఉంటాయి. మాకీ అసోసియేట్స్‌ రాసిన లేఖ గతంలో చూశాం. ఏపీలో చెత్త పాలన.. ఏపీ కంటే బిహార్‌ బెటర్‌ అనే మాటలు జపాన్‌కు చెందిన మాకీ సంస్థ మాట్లాడింది.

ఒలంపిక్స్‌ అమరావతిలో నిర్వహిస్తామని చెప్పాడు. కనీసం మండల స్థాయి పోటీలు నిర్వహించుకోవడానికి అవకాశం లేదు కానీ, వచ్చే ఒలంపిక్స్‌ అమరావతిలో చేపడతామని చెప్పాడు. చిన్నప్పుడు పెద్దలు చెప్పినట్లుగా విఠలాచార్య సెట్టింగులు చంద్రబాబు పాలనలో చూశాం. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మాణాలు ఏమైనా బాగున్నాయా అంటే.. అసెంబ్లీకి వచ్చేటప్పుడు మా ఆవిడ రోజు నా బ్యాగులో రెయిన్‌కోట్‌ పెడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో.. వర్షం వస్తే ఎప్పుడు అసెంబ్లీ బిల్డింగ్‌ కారిపోతుందో.. మీరు ఎక్కడ తడిచిపోతారో అని రెయిన్‌కోట్‌ పెడుతున్నారు.

రాజధాని నిర్మాణానికి రాజమౌళిని, చంద్రయాన్‌ ఎగిరేయాలంటే చంద్రమౌళిని కాదు తీసుకురావాల్సింది. సరైన వ్యవస్థను, మంచి సలహాదారులను, ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తులను పక్కనబెట్టుకోవాలి. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి.. అనేక రాజధానులు కలిగిన దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు సౌత్‌ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. ఒక లెజిస్లేటివ్‌ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, ఒక జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఉంది. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు రాయలసీమలో నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు సంవత్సరానికి కేంద్రం నుంచి వచ్చే రూ.350 కోట్లను కూడా చంద్రబాబు దారిమళ్లించారు.

52 వేల ఎకరాలు.. ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేసింది. దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కానీ ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ. 5 వేల కోట్లు మాత్రమే. దానికి ఇప్పుడు సంవత్సరానికి పడే వడ్డీ రూ.600 కోట్లు. రూ.లక్ష కోట్లు పెట్టి అక్కడ నిర్మాణాలు చేస్తే.. రాయలసీమకు నీరు అందించడం కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్న ప్రాజెక్టులకు రూ.60 వేల కోట్లు దానికి ఖర్చు పెట్టాలా..? లేకపోతే ఉత్తరాంధ్రకు నీరు అందించడం కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతికి రూ. 16 వేల కోట్లు ఖర్చు పెట్టాలా..?

హైదరాబాద్‌తో పోటీగా విశాఖను అభివృద్ధి చేయాలని దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అనేక రకాల ప్రాజెక్టులు తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌తో పోటీపడే ఏకైక నగరం విశాఖపట్నం, రెండు పోర్టులు, రైల్వే కనెక్టివిటీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రీ, ల్యాండ్‌ అన్ని ఉన్నాయి. విశాఖపట్నం లాంటి నగరాన్ని రాజధాని చేస్తే అనిపించినప్పటికీ.. రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తారని అనుకుంటే ఆశలపై చంద్రబాబు నీరు చల్లారు. విశాఖపట్నాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం.

పాకిస్తాన్‌కు దేశద్రోహం చేసిన ముషారఫ్‌కి మరణశిక్ష విధించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి భవిష్యత్తును ఆయన చేతుల్లో పెడితే.. ఆంధ్రరాష్ట్రానికి రాజద్రోహం చేసిన చంద్రబాబును ఏం చేయాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు.

 

తాజా వీడియోలు

Back to Top