తెలంగాణ నీటిని తోడేస్తుంటే.. చంద్రబాబు, మైసూరా ఎక్కడ ఉన్నారు..?

ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి 

  జీవితాంతం క్షమాపణలు చెప్పినా.. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన పాపం పోదు

 మైసూరారెడ్డి వేరే అజెండాతో మాట్లాడి ఉండవచ్చు

 కేసిఆర్ తో భోజనం చేసినప్పుడు ఏం స్టాండ్ తో ఉన్నారో... నేటికీ జగన్ గారిది అదే స్టాండ్..

 గ్రేటర్ రాయలసీమ, వెలిగొండ ప్రాజెక్టులను గెజిట్ లో చేర్చాల్సి ఉంది

 గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై వైయస్ కుటుంబానికి మాత్రమే చిత్తశుద్ధి ఉంది.

 రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబు ఈరోజు వరకు తన స్టాండ్ చెప్పలేదు, ఎందుకు..?

 బాబు వల్లే సీమకు అన్యాయం

వైయ‌స్ఆర్ జిల్లా:  శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 796 అడుగుల మట్టం నుంచే తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గానీ, మైసూరారెడ్డిగానీ అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు అని  ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి  ప్రశ్నించారు.  బుధ‌వారం వైయస్ఆర్ జిల్లా కడప న‌గ‌రంలోని  ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడారు.

రాయలసీమ ప్రాజెక్టులపై ఆనాడు ముఖ్యమంత్రిగా వై‍యస్‌​ రాజశేఖర్‌రెడ్డిగారికి, నేడు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్‌లకు ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, రాయలసీమ లిఫ్ట్ పై తన వైఖరి చెప్పకుండా తెలంగాణకు వంతపాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఎగువ రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తన హయాంలో చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని, ఇది చంద్రబాబు చేసిన పాపమేనని అన్నారు.

 "వ్యవసాయం దండగ- ప్రాజెక్టులు నిర్మించడం శ్రేయస్సుకరం కాదు" అని  చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారన్నారు. చంద్రబాబు విధానాల వల్ల రాయలసీమ రైతుల గుండెకోతకు కారణం అయ్యారని ధ్వజమెత్తారు.  బాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, ఇప్పుడు రాయలసీమ నీటి కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటు అని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. 

1994-2004 వరకూ టీడీప ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి అంశాలను సరిచేసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్‌ అవకాశాన్ని ఇచ్చింది. అయితే చంద్రబాబు తన పదేళ్ల కాలంలో ఏ చిన్న ప్రాజెక్ట్‌ కూడా చేపట్టకపోవడం వల్ల తెలుగు రాష్ట ప్రజలకు ఎంతో అన్యాయం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెలుగు ప్రజలకు జీవితాంతం క్షమాపణలు చెప్పినా సరిపోదు. అప్పటి టీడీపీ సర్కార్‌ తప్పిదాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఆ పదేళ్లలో గాలేరు-నగరిపై నిర్మించిన గండికోటగానీ, హంద్రీ-నీవా గానీ, వెలిగొండ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ఉంటే బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌లో మనకు కేటాయింపులు జరిగేవి. ఈ పాపం ఎవరిదీ.. అంటే చిన్న పిల్లాడిని అడిగినా చంద్రబాబు నాయుడిదే అని ఘంటాపథంగా చెబుతారు. 

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు వృథాగా పోతున్న వరద నీటిని ఒడిసిపట్టుకునేందుకు  ట్రిబ్యునల్‌లో కేటాయింపులు లేకపోయినా జలయజ్ఞం పేరుతో ఏకధాటిగా ప్రాజెక్టులను ప్రారంభించడం వల్లే ఇవాళ అవన్నీ ఓ రూపుకు వచ్చాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినా.. అణువంత పని చేసినా ఇవాళ కనీసం నీటి కేటాయింపులు అన్నా జరిగేవి. సొంత జిల్లా అయిన చిత్తూరులో వాటర్ స్టోరీజీల నిర్మాణాలు చేపడుతుంటే తన మనుషులతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌లు వేయించి స్టేలు తీసుకువస్తాడు. చంద్రబాబు నాయుడు చేయరు.. చేసేవారిని చేయనీయరు. ఆయన బాధేంటో అర్థం కావడం లేదు. ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పాలింది చంద్రబాబు నాయుడే.

 శ్రీశైలం రిజర్వాయర్‌లో 796 అడుగులు దాటకుండానే తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే.. చంద్రబాబు నాయుడు, మైసూరారెడ్డి ఏం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు కాబట్టి భయపడ్డారా?. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నీటిని తరలించి రాయలసీమను ఎందుకు ఎండగడుతున్నారు? రాయలసీమ హక్కులను కాపాడేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే వరకు పోరాటం చేస్తాం. శ్రీశైలంలో నీటి కేటాయింపులు జరిగినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని తోడేస్తుంది. ఇది న్యాయమా..? నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఏ వైఖరితో ఉందో.. చంద్రబాబు కూడా అదే ధోరణిలో వంత పాడటం ఆశ్చర్యంగా ఉంది.

 ప్రజలకు, రైతాంగానికి మేలు చేయాలనే తలంపుతో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు తన అయిదేళ్ల కాలంలో అనేక ప్రాజెక్ట్‌లను ఒక రూపుకు తీసుకువస్తే.. విభజన తర్వాత కర్మకొద్దీ ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌లను మళ్లీ నిర్లక్ష్యం చేశారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు. గండికోట ప్రాజెక్టే అవసరం లేదు, దానిని మూడు టీఎంసీలు చేస్తే ఇస్తే చాలు అని చెప్పిన వ్యక్తి. ఆ మాటలు విన్నప్పుడు చంద్రబాబు తన మాటలు, చేతల ద్వారా మేనిప్లేట్‌ చేయగలరనేది అర్థం అవుతుంది. దీన్ని బట్టే ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ పైనా, కృష్ణా రివర్ మేనేజ్ మెంటు బోర్డు పైనా చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గెజిట్‌ ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు కూడా అదే స్టాండ్‌తో మాట్లాడుతున్నారు. ఇది అర్థం కాని పరిస్థితి.  

 సీమ ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ప్రారంభించిన కార్యక్రమాలను ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు దాన్ని అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటే దానిపై చంద్రబాబు తన స్టాండ్‌ చెప్పకుండా ఎన్నికల్లో తనకు సీమ ప్రాంత ప్రజలు ఓటు వేయాలదనే ద్వేషంతో, కక్షతో ఉన్నారు.  సీమలో పుట్టిన వ్యక్తిగా ఏమాత్రం కనికరం, ఇంగితజ్ఞానం లేకుండా కుళ్లు, కుతంత్రాలతో తన స్టాండ్‌ చెప్పకుండా అన్ని అంశాల్లోనూ చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. 
- పవన్‌ కల్యాణ్‌ లా అలా వచ్చి, ఇలా కనపడకుండా వెళతారో.. అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన కొత్తవ్యక్తి...  కూడా నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ కనిపించరు. "ఈ గెజిట్‌ సరిగా లేదని, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని" విమర్శలు చేస్తున్నారు. జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటూనే.. శాంతియుతంగా, సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు. అది కుదరని పక్షంలో కోర్టులకు, కేంద్రం దృష్టికి సమస్యను తీసుకువెళ్ళారు. 

 విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో  తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం నుంచి 796 అడుగులు మించకుండా నీటిని తోడేస్తే మా పరిస్థితి ఏంటి? అని ప్రధానమంత్రి మోదీగారితో పాటు కేసీఆర్‌గారిని జగన్ గారు ప్రశ్నిస్తున్నప్పుడు చంద్రబాబు, మైసూరారెడ్డి ఏం చేస్తున్నారు...? రాయలసీమ ప్రజల గొంతు కోస్తుంటే మీరంతా ఎక్కడకు పోయారు? ఎందుకు ఆరోజు మీ నోళ్లు లేవలేదు. మీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని భయపడ్డారా? లేక తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయారా? ఆరోజు ఎందకు మాట్లాడలేకపోయారు. 
- రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వల్ల మా ప్రాంత ప్రజలు రెండు పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని, మాకు కేటాయించిన నీటినే మేము వాడుకుంటామని పదే పదే చెప్పినా.. తెలంగాణ రాష్ట్రం నీటిని తోడేయడం ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. పదే పదే మా విన్నపాన్ని తిరస్కరించడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు లేఖలు రాస్తున్నా స్పందన లేకపోవడంతో సీమ ప్రజల మనోభావాలు కాపాడేందుకు ఎవరో ఒకరిని ఆశ్రయించాలి కదా. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. 

 గెజిట్‌ వచ్చినా, మరోకటి వచ్చినా గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు సంబంధించిన ఎవరితో అయినా పోరాడతాం. ఎంతవరకైనా వెళతాం. పూర్తిస్థాయిలో ప్రాజెక్టులను గెజిట్‌లో పొందుపరిచిన తర్వాతే మేము ఒప్పుకుంటాం. న్యాయబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాతే మేము గెజిట్‌ను స్వాగతిస్తాం అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణవాదాన్ని సమర్థిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పవర్‌ జనరేషన్‌ కోసం నిర్మించిందని మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రాజెక్ట్‌ నిర్మించేంది సాగు, తాగునీటి అవసరాల కోసమే.  గ్రేటర్‌ రాయలసీమ ప్రజలకు శ్రీశైలం రిజర్వాయర్‌ గుండె లాంటిది. చంద్రబాబు గతంలో  గాలేరు నగరి, హంద్రీ-నీవాను తగ్గించాలని ప్రయత్నం చేశారు. తన హయాంలో పదేళ్లలో వాటిని నిర్వీర్యం చేశారు. తర్వాత అయిదేళ్లలో ఆ ప్రాజెక్ట్‌లను లేకుండా చేయాలని నిధులు కేటాయించలేదు. చంద్రబాబును ఏరకంగా నమ్మాలి. ఆయనది  విచిత్ర, వితండ వాదన. 

మైసూరారెడ్డి వేరే అజెండాను మనసులో పెట్టుకుని మాట్లాడి ఉండవచ్చు. మా అజెండా మాకు ఉంటుంది. సీమ ప్రాంత ప్రయోజనాల కోసం ఎంతవరకైనా ముందుకు వెళతాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ యుధ్ద ప్రాతిపాదికన ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీనిపై మీరు ఏరోజు అయినా సూచనలు, సలహాలు ఇచ్చారా? ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు. మాది వందకు వందశాతం రైతు ప్రభుత్వం. ప్రాజెక్ట్‌లు అనేవి ప్రజలకు జీవనాడి అంటూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు సంకల్పించిన అన్ని ప్రాజెక్టులను జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పూర్తి చేస్తున్నారు.

వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి మంచిపేరు వస్తుందనే దుర్భద్ధితోనే చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు. గెజిట్‌పై సీమ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాజెక్ట్‌లకు సంబంధించి నీటి కేటాయింపులకు పూర్తిస్థాయిలో పోరాటం చేస్తాం.  ముఖ్యమంత్రి జగన్ గారు, తెలంగాణ నీళ్లను వాడుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పారు. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు అటువైపు నుంచి సహకారం రాకపోవడం దురదృష్టకరం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. తెలుగు ప్రజలు అందరూ బాగుండాలనే భావనతో మ్యుమంత్రి వైఎస్‌ జగన్‌ గారు పని చేస్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. కేసిఆర్ తో భోజనం చేసినప్పుడు ఏం స్టాండ్ తో ఉన్నారో... నేటికీ సీఎం వైయ‌స్ జగన్ గారిది అదే స్టాండ్.. మేం వేరే రాష్ట్రాల నీళ్ళు దోచుకోవాలనుకోవడం లేద‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

Back to Top