సామాన్యుడి కొడుకు ఆంగ్లమాధ్యమం చదవకూడదా?

భూమన కరుణాకరరెడ్డి

మందగమనంతో నడిచే విద్యా వ్యవస్థను చైతన్యవంతం చేసిన వైతాళికుడు సీఎం వైయస్ జగన్. మన విద్యా వ్యవస్థకు అవసరమైన శస్త్రచికిత్స చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. బడుగులకు, దళితవర్గాలకు, దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న పిల్లలకు ఆంగ్ల బోధన యొక్క అవసరాన్ని గుర్తించి, ఆధిపత్య భావజాలంతో నడిచేవాళ్లకు మాత్రమే ఆంగ్లబోధన కాదని, కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కూలిపని చేసేవాడి కొడుకు కూలిపనికే పరిమితం కాకూడదని, బస్సు,ఆటో నడిపే డ్రైవర్ కొడుకు అందుకే పరిమితం కాకూడదనే సత్సంకల్పంతో ఉన్నతమైన ఆలోచనచేసి సమాజ గతిని మార్చడానికి ప్రాధమిక స్థాయిలోనే ఆంగ్లమాధ్యమాన్ని తేవాలనే సంకల్పాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క తెలుగు హృదయం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. భాషపట్ల ప్రేమ ఉన్నవాళ్లు కూడా మనుగడ కోసమని ఆంగ్లమాధ్యమం యొక్క అవసరాన్ని గుర్తించవలిసి వచ్చే పరిస్థితిని తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. 

దుష్టబుద్ధితో కొందరు రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రికి తెలుగు పట్ల, మాతృభాషపట్ల గౌరవం లేదన్నట్టు విమర్శలు చేస్తున్నది పద్ధతి కాదు. తెలుగుభాష పట్ల నాలుగేళ్లు ఉత్సవాలు నిర్వహించిన వాడిగా చెబుతున్నా స్పార్టకస్, రూట్స్ లాంటి పుస్తకాలను ఆంగ్లం రాని కారణంగా నేను చదవలేకపోయాను. వాటిని ఇన్నేళ్లకు ఇప్పుడు తెలుగులోకి అనువదించాక చదువుకున్నా. ఇక్కడున్న 175 శాసన సభ్యుల్లో మనమందరం తాతలై మనవలు, మనవరాళ్లూ ఉన్నవాళ్లు ఉన్నారు. వీరిలో ఒక్కరి పిల్లలైనా, మనవలైనా తెలుగు మాధ్యమం పాఠశాలల్లో చదువుతున్నారా? శాసన సభ్యులమైన మనకు, ఆధిపత్య భావజాలం ఉన్నవారికీ మాత్రమే ఆంగ్లమాధ్యమమా? పేదవాడికీ, చదువుకోవాలనే తపన ఉన్నవాడికి, ఇతరులతో సమానంగా ఆర్థికంగా బాగుపడి సామాజికంగా మెరుగ్గా జీవించాలనుకునేవాళ్లకు ఆంగ్లమాధ్యమంలో చదువుకునే అవకాశం లేదా? ప్రభుత్వ పాఠశాల్లో చదివేవాళ్లు బలహీనవర్గాల వారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల పిల్లలు. వారు అక్కడే నిలిచిపోవాలా? భవిష్యత్తులో వారికి మంచి జరగద్దా? అలాంటిపిల్లల్లో కూడా సామాజిక చైతన్యం తీసుకు రావాలని మొట్టమొదటిసారి ఆలోచన చేసింది సీఎం వైయస్ జగన్. సామాన్యుడి పిల్లలకు కూడా ఉన్నత చదువు చదివి, సాంకేతిక విద్యకు దగ్గర కావాలనే అద్భుతమైన ఆలోచనను చట్టంగా మార్చిన వైయస్ జగన్ దార్శనికతను ప్రపంచమంతా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. 

అక్షరాస్యత లేకపోయినా భాష మనుగడ సాగిస్తుంది. బోధన ద్వారానో, భాషా మాధ్యమం ద్వారానో భాష వికసించదు. స్వయంగా భాషమీద ప్రేమ, దానివల్ల సాహిత్య సృజన జరగడం వల్ల భాష విరాజిల్లుతుంది.  తెలుగు సాహిత్యంలో అజరామరమైన సంగీత రచనలు చేసిన డా.సి.నా.రె తన ప్రాధమిక విద్య ఉర్దూలో చేసారు. మహాకవి దాశరధిరంగాచార్య గారు కూడా ఉర్దూ మాధ్యమంలో చదివినవారే. తెనాలికి వలస వచ్చిన తమిళుడు నటరాజన్ శారద అనే కలం పేరుతో తెలుగులో అద్భుతమైన రచనలు చేసాడు. తెలుగు భాషకు అత్యంత సేవ చేసిన వాళ్లంతా తెలుగు మాధ్యమంలో మాత్రమే చదివిన వాళ్లు కాదు. 

ఆంగ్లమాధ్యమం వద్దని, తెలుగులో చదివితేనే తెలుగుబతుకుతుందని కబుర్లు చెప్పే భాషా ప్రేమికులు చాలామంది తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదవిస్తున్నారు. 

Read Also: నేను ఇంగ్లిష్‌ను వ్య‌తిరేకించిన‌ట్టు బాబు నిరూపించ‌గ‌ల‌రా

 

తాజా ఫోటోలు

Back to Top