సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

  ‘క్లాప్‌’లో అందరూ భాగస్వామ్యం కావాలి

 అక్రమ కట్టడాలపై ఉపేక్షించొద్దు

 రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలి

 ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సూచన

 రుద్రంపేటలో సచివాలయాల ఆకస్మిక తనిఖీ

అనంతపురం  :  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సూచించారు. సోమవారం రుద్రంపేట పంచాయతీలోని సచివాలయం–2, సచివాలయం–1లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా సచివాలయం–2కు వెళ్లి రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ‘స్పందన’ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయం పరిధిలో వివిధ పథకాలకు సంబంధించి అర్హుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 606 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు సిబ్బంది తెలుపగా.. ఎవరైనా అనర్హులు తేలారా? అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. 12 మంది అనర్హులు తేలినట్లు తెలుపగా.. అందులో అర్హులుంటే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇంటి పట్టాలు, రేషన్‌ కార్డుల మంజూరు గురించి తెలుసుకున్నారు. క్లాప్‌–క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్లాప్‌ను విజయవంతం చేయాలన్నారు. ఎక్కడా డ్రెయినేజీ సమస్య లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే నివేదిక తయారు చేయాలన్నారు. వీధి లైట్ల సమస్య లేకుండా నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సూచించారు. సచివాలయం పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులపై ఆరా తీసి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్లపై ఎక్కడా ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలని, ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సేవకుల్లా పని చేయాలన్నారు. సచివాలయాలు ఏర్పాటు కాకముందు పథకాలు అందాలంటే ప్రజలు ఇబ్బందులు పడేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాగా ఎమ్మెల్యే సచివాలయం వద్దకు వచ్చారని తెలిసి కొందరు స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా వారి వివరాలను నమోదు చేసుకున్నారు. 

రిజిస్టర్ల నిర్వహణ ఇంత అధ్వానమా?
రుద్రంపేట సచివాలయం–1లో రిజిస్టర్ల నిర్వహణపై ఎమ్మెల్యే అనంత అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లు కూడా సరిగా పెట్టుకోవడం చేతకాదా? అని సిబ్బందిపై మండిపడ్డారు. ఆ తర్వాత సచివాలయం పరిధిలో రోడ్లు పరిస్థితి, ఎక్కడైనా మరమ్మతులు అవసరం ఉందా? పింఛన్లు, రేషన్‌కార్డులపై ఆరా తీశారు. నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. ఎవరూ కూడా తాము అధికారులమే భావనలో ఉండొద్దని, ప్రజలకు మంచి చేసే విషయంలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రజలు తమకు తెలియని విషయాలు అడిగితే ఓపిగ్గా చెప్పాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లే వారధులన్న విషయాన్ని మరచిపోకూడదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top