చదువుంటే సమాజంలో గౌరవం

  ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

అనంతపురం  : ‘‘సమాజంలో కులం వల్లో.. మతం వల్లో గౌరవం రాదు. కానీ చదువుకుంటే ఉజ్వల భవిష్యత్‌ వస్తుంది. తర్వారా మంచి గౌరవం దక్కుతుంది. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివించాల‌ని ఎమ్మెల్యే అనంత వెంక‌ట‌రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంతోని రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోంది’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు.  అనంత నగర కార్పొంటర్‌ సంఘం ఆధ్వర్యంలో కొర్రపాడు వద్ద సంఘం తరఫున 500 మంది ఇంటి స్థలాలు పొందారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న జీకేఎం ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం సభ్యులకు అందజేశారు. ముఖ్య అతిథులుగా అనంతతో పాటు మేయర్‌ మహమ్మద్‌ వసీం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ కార్పొంటర్స్‌ వడ్రంగి అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనంత మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా సంఘంగా ఏర్పడి నివేశ స్థలాలు తెచ్చుకోవడం సంతోషనీయమన్నారు. కార్మిక శక్తి అనంతమైనదని తెలిపారు. దేశ సంపద, ప్రకృతి సంపద శ్రమశక్తిపై ఆధారపడిందన్నారు. కార్పొంటర్లు శ్రమజీవులని, కష్టపడి జీవనం సాగిస్తున్నారన్నారు. చేతివృత్తులుంటే ఎక్కడైనా బతకొచ్చన్నారు. వ్యవసాయ రంగంలో పనిముట్లు కావాలంటే వడ్రంగుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యంత్రీకరణ రావడంతో చాలా మంది నగరాలకు ఉపాధి కోసం వచ్చారన్నారు. కార్పెంటర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్పొంటర్స్‌ కాలనీని మోడల్‌గా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జగనన్న తోడు పథకం కింద సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరువ్యాపారులకు ఏటా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆటోనగర్‌ తరహాలో తామంతా ఒక చోట ఉంటామంటున్నారని, తప్పకుండా నగరానికి సమీపంలో స్థలం తీసుకుంటే ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా అనంతపురం నియోజకవర్గంలో 28 వేల మందికి ఇంటి పట్టాలు అందజేశామని, నిర్మాణాలు కూడా ప్రారంభం అయినట్లు చెప్పారు. కొర్రపాడు వద్ద ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. అందరూ ఐకమత్యంతో ఉండాలని, చిన్నచిన్న మనస్పర్థలు వస్తే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. ఐకమత్యమే బలం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌ రెడ్డి, ఏపీ కార్పెంటర్స్‌ వడ్రంగి అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి నాగరాజు, అనంత కార్పెంటర్స్‌ సంఘం ఉపాధ్యక్షుడు ఖాదర్‌వలి, సెక్రటరీ శర్మాష్‌వలి, జాయింట్‌ సెక్రటరీ బ్రహ్మయ్య, కోశాధికారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top