టీడీపీ నేతలతో ప్రాణహాని..భద్రత కల్పించండి

పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
 

అమరావతి : టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని   మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఎమ్మెల్యే తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘నాని చౌదరి, లోకేష్‌ టీమ్‌ పేరుతో  సోషల్‌ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు. చెన్నై టీడీపీ ఫోరమ్‌ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశారు. మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని ఫిర్యాదులో పొందుపరిచాను’అన్నారు.

బాబు నివాసంలోకి వెళ్లలేదు..
తన నియోజకవర్గంలో భాగం అయినందునే కరకట్ట ముంపు ప్రాంతాల్లో పర్యటించానని ఆర్కే చెప్పారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారని, తాను బాబు నివాసంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా కూడా టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఇల్లు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ప్రజాతీర్పు చూసి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ సోషల్‌ మీడియా ద్వారా తెరచాటు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
 
 

Back to Top