అమరావతిః చర్చించాల్సిన అంశాలను పక్కదారి పట్టించి సభ్యులను రెచ్చగొట్టి టీడీపీ సానుభూతి పొందాలనుకోవడం సమంజసం కాదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.గురువారం శాసనసభా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. చట్టాలను ఎప్పుడూ అతిక్రమించనని చంద్రబాబు మాట్లాడటం అశ్చర్యంగా ఉందన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకునిపోయి...నలుగురిని మంత్రులుగా చేసిన చంద్రబాబు చట్టాలను గౌరవిస్తున్నామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. టీడీపీకి వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే అంత కడుపుమంట ఎందుకని ధ్వజమెత్తారు.విజయవాడలో ఎవరికి అడ్డంలేని చోట వైయస్‌ఆర్ విగ్రహం ఉంటే.. ఆయన వెళ్ళే దారిలో వైయస్‌ఆర్ విగ్రహం కనిపిస్తోందని చూసి ఓర్వలేక తొలగించిన పెద్దమనిషి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉన్నారనేది అందరికి తెలిసిన వాస్తవం అని అన్నారు. కంచే చేను మేసినట్లుగా చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉండటం ధర్మం కాదన్నారు.సభలో ప్రతిపక్షం ఓర్పుగా వ్యవహరించాలని..గిల్లికజ్జాలు పెట్టుకోడం పద్దతి కాదన్నారు. టీడీపీ నేతలు చట్టాలను ఉల్లంఘించడమే వృతిగా రాజకీయాలు నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత విగ్రహాలంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్ విగ్రహాలు ప్రజలే స్వచ్చందంగా పెట్టుకున్నారు.రూపాయి రూపాయి వేసుకుని వైయస్‌ఆర్ విగ్రహాలు పెట్టుకున్నారని తెలిపారు.