నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం

రేప‌ల్లెలో అత్యాచార ఘ‌ట‌న‌ బాధితురాలిని ప‌రామ‌ర్శించిన మంత్రులు తానేటి వ‌నిత‌, ఆదిమూల‌పు సురేష్‌

బాధితురాలికి ఆర్థిక సాయం అంద‌జేత‌

మెరుగైన వైద్యం అందించాల‌ని  ఒంగోలు రిమ్స్ వైద్యుల‌కు ఆదేశం

పోలీసులు వేగంగా స్పందించి 6గంట‌ల్లోనే నిందితుల‌ను ప‌ట్టుకున్నారు

ఒంగోలు: రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచార యత్నానికి గురై, ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వ‌నిత‌, మున్సిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకొని..మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి తానేటి వ‌నిత మీడియాకు వివ‌రించారు. 

బాధితురాలు, ఆమె భర్త అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు ఎలాంటి సౌక‌ర్యం లేకపోవడంతో నిన్న అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్‌లో పడుకున్నారని, మద్యం సేవించిన ముగ్గురు దుండ‌గ‌లు, ఆ మహిళపై కన్నేసి, అక్కడికి వచ్చి బాధితురాలి భర్తను టైమ్ ఎంతా అని అడిగి, ఆయన మీద దాడి చేసి వారి దగ్గర ఉన్న డబ్బు దోచుకున్నారని తెలిపారు. తన భర్తపై దాడిని ఆపాలని బాధితురాలు అడ్డుపడితే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లార‌ని, దీంతో భార్య‌ను కాపాడుకునేందుకు ఆమె భర్త అందరి దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. రైల్వే స్టేషన్‌లో పడుకున్న తోటి ప్రయాణికులెవ‌రూ ముందుకురాక‌పోవ‌డంతో రిక్షావాళ్ల స‌ల‌హా మేర‌కు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలి భ‌ర్త ఫిర్యాదు చేశార‌ని చెప్పారు. 

వెంటనే ఆరా..
బాధితురాలి భ‌ర్త ఫిర్యాదు అందుకున్న వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగార‌ని, రైల్వే స్టేషన్‌ సమీపంలో నేతాజా కాలనీలో నిందితుల కోసం వాక‌బు చేశార‌ని, ఉద‌యం 7 గంట‌ల్లోపే హోంమంత్రి వ‌నిత చెప్పారు. ఫిర్యాదు అందిన‌ కేవలం 6 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింద‌ని వివ‌రించారు. నిందితుల్లో ఇద్దరు ఎస్సీ, మరొకరు యాదవ కులస్తుడు అని చెప్పారు. నిందితుల‌పై 376–డి ప్రకారం గ్యాంగ్‌రేప్, బాధితురాలి భర్త దగ్గర డబ్బు దోచుకున్నారు కాబట్టి జీ–94 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేయ‌డం జ‌రిగింద‌ని, బాధితురాలి భర్తపై దాడి చేశారు కాబట్టి, సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశామ‌ని చెప్పారు. పోలీసులు చాలా వేగంగా స్పందించ‌డంతో బాధితురాలిని సకాలంలో ఆదుకోగలిగామ‌న్నారు.

బాధితురాలు 7 నెలల గర్భిణి కావడంతో అనుకోని దుర్ఘటనతో ఆమె ఇబ్బంది పడుతోందని, ఆమెకు ధైర్యం చెప్పామ‌ని, మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కూడా ఆదేశించామ‌ని మంత్రి తానేటి వ‌నిత చెప్పారు. బాధితురాలికి నిన్ననే రూ.2 లక్షల సహాయం అందించామ‌ని, అత్యాచారాల నిరోధ చట్టం ప్రకారం బాధితురాలికి రూ.8.50 లక్షల పరిహారం అందుతుంది. ఆ ప్రకారం ఇప్పుడే ఆమెకు అందులో సగం రూ.4.12 లక్షలు ఇచ్చామ‌న్నారు. అదే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా మరో రూ.50 వేలు అందిస్తామ‌న్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడే రూ.12 వేలు ఇచ్చామ‌న్నారు.  మరోవైపు జిల్లాకు చెందిన మున్సిపల్‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారని చెప్పారు.

వదిలిపెట్టబోం..
నిందితుల‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం.. కఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి తానేటి వ‌నిత అన్నారు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో జ‌రిగింది.. కాబట్టి అక్కడ భద్రత బాధ్యత రైల్వే పోలీసులదేన‌ని,  అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు చాలా వేగంగా స్పందించి బాధితురాలిని కాపాడారన్నారు. ఈ దాడులన్నీ కూడా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిపైనే జరుగుతున్నాయ‌ని,  విజయవాడలో అత్యాచారానికి గురైన బాలిక, మానసిక దివ్యాంగురాలు కాగా, ఈ మహిళ దళితురాలు.  ఇక్కడ రాత్రి ఈ ఘటనకు పాల్పడింది పాత నేరుస్తులే. అందుకే ఇక నుంచి అన్ని చోట్లా పాత నేరస్తులపై దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నామ‌ని చెప్పారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంద‌ని, కానీ పలు ఘటనల్లో ఆ పార్టీ వారే బాధ్యులుగా తేలుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని విపక్షం గుర్తించాల‌ని, అర్థం లేని విమర్శలు మానుకోవాల‌ని సూచించారు. 

Back to Top