విజయవాడ: పవన్ కల్యాణ్ పర్యాటన సినిమా ప్రమోషన్‌లా ఉందని, ప్యాకేజీకి అమ్ముడుపోయే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే వకీల్‌సాబ్.. బయట పకీర్‌సాబ్ అని ప్రజలందరికీ తెలుసన్నారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పేమెంట్ తీసుకొని నటిస్తున్నాడని విమర్శించారు. పవన్‌కు రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే పనికొచ్చే సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై పనికిమాలిన డైలాగులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. డైలాగులు సినిమాల వరకే పనికివస్తాయని, రోడ్డు మీద మాట్లాడితే ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
అసెంబ్లీ ముట్టడిస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న పవన్ కల్యాణ్‌కు అసెంబ్లీ ఎక్కడుందో తెలుసా..? అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. నువ్వు రాజకీయాలకు పనికిరావని గాజువాక, భీమవరం ప్రజలు రెండు చోట్ల ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? అని నిలదీశారు. ఏ ఒక్క రైతు అయినా ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారా..? ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. రోడ్డు షో కోసం కార్యకర్తలు, ఫ్యాన్స్‌ను వేసుకొని కేరింతలు కొడుతూ తిరుగుతున్నాడని, సినిమా యాక్టింగ్‌లు, డ్రామాలు ఇప్పటికైనా ఆపేయాలన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఫాంహౌస్‌లో నిద్రపో అని పవన్‌కు సూచించారు.