చంద్రబాబులో అప్పుడే ఓటమి భయం

అందుకే ‘వైకుంఠపాళి’ ఆడొద్దంటూ ప్రజలతో మొర

ఏడాదిన్నరలోనే కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి

ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎక్కడికక్కడ దోపిడీ రాజ్యం

అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడొద్దు

డబ్బు సంపాదన కోసం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ చేయాలి

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం

గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు పూర్తి చేయండి

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

పామిడిలో ‘కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం’

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌ ఆధ్వర్యంలో ‘రచ్చబండ’ 

పామిడి:‘సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉంది. కానీ అప్పుడే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంటోంది. అందుకే ఏ సమావేశం నిర్వహించినా వైకుంఠపాళి ఆడొద్దంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఏడాదిన్నరలోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది’’ అని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రజల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తోందని, వైయ‌స్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబుకు గుబులు పట్టుకుంటోందన్నారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పామిడిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా కళ్యాణకట్టలో రచ్చబండ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు నరేష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ.. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేశామని, ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చామన్నారు. పేద పిల్లల చదువులకు అండగా ఉండడం కోసం ‘అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేశామన్నారు. రెండేళ్లు కోవిడ్‌ వెంటాడినా ఎక్కడా సంక్షేమ పథకాలు నిలిచిపోలేదని తెలిపారు. కరోనా సమయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా మూసేసిన పరిస్థితులు ఉండేవని, అలాంటి తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్య విద్య చేరువచేయడం కోసం రూ.8 వేల కోట్లతో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. 2023–2024 నాటికే ఐదు మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. అసలు కళాశాలలే నిర్మించలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశారని, కానీ ఇటీవల ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) ఈ కళాశాలల్లో పీజీ సీట్లు మంజూరు చేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ హయాంలోనే పాడేరు, పులివెందుల కళాశాలలను కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 10 మెడికల్‌ కళాళాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తుండడం దారుణమన్నారు. చంద్రబాబు డబ్బు సంపాదన కోసమే కళాశాలలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని విమర్శించారు.  

టీడీపీ మద్దతుదారుల్లోనూ వ్యతిరేకత
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లోనూ వ్యతిరేకత ఉందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూటమికి మద్దతు తెలిపిన వాళ్లు ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వైయ‌స్‌ఆర్‌సీపీ శ్రేణులు కోటి సంతకాల సేకరణను ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించాలన్నారు. నవంబర్‌ 20వ తేదీలోగా సంతకాల సేకరణ పూర్తి చేయాలని తెలిపారు. ప్రజాభిప్రాయం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని, ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు తన నిర్ణయం మార్చుకునే వరకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ర్యాలీలను విజయవంత చేయాలన్నారు.  

గ్రామ స్థాయి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతం
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నట్లు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీలు నియమిస్తున్నట్లు చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీలోని కార్యకర్తలంతా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండడం వైయ‌స్ఆర్‌సీపీకి కొత్తకాదని, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ బాగుంటేనే అంతా బాగుంటామన్న విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వ్యక్తులు కాదు.. పార్టీ శాశ్వతమని, ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కమిటీల ఏర్పాటు తర్వాత జనవరిలో అందరికీ గుర్తింపు కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. 

ఎమ్మెల్యేల కనుసన్నల్లో దోపిడీ రాజ్యం
జిల్లాలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల కనుసన్నల్లో దోపిడీ రాజ్యం కొనసాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, అనుచరవర్గం డబ్బే పరమావధిగా వెళ్తున్నారని, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని, కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అనుకూల మీడియాల్లోనూ కథనాలు వస్తున్నాయని, కానీ కూటమి నేతలు వైయ‌స్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకుముందుకు కోటి సంతకాల సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పార్లమెంట్‌ పరిశీలకులు నరేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి దిశానిర్దేశం చేశారు.

Back to Top