హిందూ దేవుళ్లను కూడా వేధించిన ఘనత చంద్రబాబుదే

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  
 

విజయవాడ: చంద్రబాబునాయుడు ప్రజలతో పాటు హిందూ దేవుళ్లనీ వేధించారని, టీడీపీ హాయంలో హిందూ దేవుళ్లకు నిలువనీడ లేకుండా పుష్కరాలు, రహదారుల విస్తరణ పేరుతో పలు హిందూ దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయశాఖ, ఇతర అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గల శనీశ్వర ఆలయ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు.

ప్రజలు, హిందువులను, ఇతర మతస్తులను, బాధపెట్టే విధంగా వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ పాలన కొనసాగిందన్నారు. పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని, ఆ సమయంలో హిందూసేవా సంస్థలతో కలిసి ఆలయాల నిర్మాణం కోసం తాము పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కూల్చిన ఆలయాలను అదే చోట లేదా ఇతర ప్రాంతాలలో నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. హిందూ ధర్మాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. హిందూ, ఇతర మతస్తుల మనోభావాలకు అనుగుణంగా వారికి అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల పునః నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, అందులో భాగంగా శనీశ్వర ఆలయం వద్ద తొలగించిన సీతమ్మ వారి పాదాలను త్వరలో అక్కడే వాటి నిర్మాణంతోనే నగరంలోని ఆలయాల పునః నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top