ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘ‌న విజ‌యం సాధిద్దాం

 మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపు

ఉరవకొండ: పచ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు అభ్యర్థులు వెన్నపూస రవీంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి లను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించి ఘ‌న విజ‌యం సాధిద్దామ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయపరంపరకు ఇప్పుడే శ్రీకారం చుట్టాలని మంత్రి అన్నారు. మంగళవారం ఉరవకొండలోని దేవాంగ కల్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ రంగయ్య,ఎమ్మెల్సీ మంగమ్మ,పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఉరవకొండ పరిశీలకులు శ్రీనివాసులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా మన ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని పట్టభద్రులకు,ఉపాధ్యాయులకు వివరించి ఓటు అడగాలని సూచించారు. ఇటీవల కొన్ని దుష్టశక్తులతో కూడి ప్రతిపక్ష పార్టీలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.ఈ దుష్టచతుష్టయం యత్నాలను జగనన్న కుటుంబ సభ్యులైన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు,నేతలు తిప్పికొట్టాలని కోరారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉంటే ఏమి జరుగుతుందో లేకపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఉరవకొండ నియోజకవర్గంలో 5,300 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు లభించే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఉరవకొండ పరిశీలకులు శ్రీనివాసులు,  సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to Top