అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్.. రాజకీయాల్లోకి ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చారు. ప్రతి ఇంట్లో తన తండ్రి వైయస్‌ఆర్ ఫొటోతో పాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా పరిపాలన చేస్తానని చెప్పారు. ఆ దిశగానే వైయస్ జగన్ పాలన సాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా పక్షపాతిగా కేబినెట్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. అసెంబ్లీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..
‘దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని విప్లవాత్మకమైన అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లోకే రూ.15 వేలు జమ చేశారు. ఒక మేనమామగా ఎన్నో లక్షల కుటుంబాల్లో విద్యాదీపాలు వెలిగించిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. అక్షరాస్యతను పెంచడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం, డ్రాప్‌అవుట్స్ లేకుండా చేయడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చు, పేదలను ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా 42.33 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349 కోట్లు జమ చేసిన ఏకైక సీఎం వైయస్ జగన్.
వైయస్‌ఆర్ మరణ వార్త తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆ కుటుంబాలను చూసి చలించారు. బిడ్డలను చదివించలేక తమతో పాటు పనులకు తీసుకెళ్తున్న వాస్తవాలు ఆలోచింపజేశాయి. పసిపిల్లలను పనులకు తీసుకెళ్తున్న తల్లుల ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఆ ఆలోచనలోంచి అమ్మఒడి పథకం రూపొందింది.
జగనన్న విద్యాకానుక ప్రతిష్టాత్మకమైన పథకం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల్లా మంచి బ్యాగ్, బుక్స్, యూనిఫామ్ వేసుకొని మా పిల్లలు ఎప్పుడు వెళ్తారనేది తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఒక మేనమామగా తల్లిదండ్రుల తరఫున బాధ్యతను తీసుకొని యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, షూస్, సాక్స్ అన్ని ఇస్తున్నారు. యూనిఫామ్స్ కుట్టుకూలి కూడా తల్లులకు అందిస్తున్నారు. పిల్లలు సంతోషంగా ‘ఆకాశంలో చందమామ.. ఆంధ్రాలో జగన్ మామ’ అని పిల్లలంతా చెప్పడం మనం చూశాం.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా హాస్టల్‌లో చదివే విద్యార్థులకు కూడా తోడుగా నిలబడ్డారు. ఐటీఐ చదివే విద్యార్థులకు రూ. 10 వేలు, పాటిటెక్నిక్ చదివే విద్యార్థులకు రూ.15 వేలు, ఇతర కోర్సుల్లో డిగ్రీ చదివే విద్యార్థులకు రూ.20 వేలు. ఇదే కాకుండా విద్యా దీవెన పథకం కింద పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై చదివే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ సొమ్ము తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు.
వైయస్‌ఆర్ ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలవంతులను చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. గత ప్రభుత్వంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు గత పాలకుల మాటలు విని మోసపోయారు. ప్రజా సంకల్పయాత్రలో జగనన్న దగ్గరికి అక్కచెల్లెమ్మలు వచ్చి వారి బాధను చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజుకు ఎంత అప్పు ఉందో.. దాన్ని నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. కరోనా విపత్తును కూడా లెక్కచేయకుండా ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు తొలి విడత నగదు అందించారు. అదే విధంగా సున్నావడ్డీ కింద రూ.14 వందల కోట్లు ఇచ్చారు.
వైయస్‌ఆర్ చేయూత పథకం ద్వారా 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు లబ్ధిపొందారు. దాదాపు రూ. 4,312 కోట్లు ప్రభుత్వం అందించింది. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని వారి సపోర్టు తీసుకుంది. చేయూత కింద పాడిపశువులను మహిళలకు అందించి పాడిపరిశ్రమను నడిపించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
అడగకుండానే వరం ఇచ్చిన దేవుడు వైయస్ జగన్. చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల ప్రస్తుతం జరుగుతున్న దాడులను అరికట్టడం, మానమృగాలకు వెంటనే శిక్ష పడేందుకు కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. దిశ చట్టం రావడానికి కారణం మన రాష్ట్రంలో జరిగిన సంఘటన కాకపోయినా.. మన రాష్ట్రంలో ఏ మహిళ, యువతి, చిన్నారి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చట్టం తీసుకువచ్చారు. దిశ చట్టం వల్ల చాలా మంది మహిళలు, యువతులు ధైర్యంగా జీవించగలుగుతున్నారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ చట్టం గురించి తెలుసుకోవడం కోసం ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తరఫున వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశాం. బాలికలు, మహిళలు అత్యాచారానికి గురైతే.. వారిని వన్‌స్టాప్ సెంటర్‌కు తీసుకువచ్చి వారికి కావాల్సిన అన్ని విధాల సాయాలు ప్రభుత్వమే అందిస్తుంది. సైబర్ నేరాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ ద్వారా సైబర్ మిత్ర అనే యాప్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం అభయం అనే యాప్‌ను సీఎం ప్రారంభించారు.
దశలవారీగా మద్య నిషేధ పథకం వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రానికి మద్యం ఆదాయ వనరు అయినప్పటికీ.. మహిళలు సంతోషంగా ఉండాలని, మద్యం వల్ల వచ్చే ఆదాయం అవసరం లేదని సీఎం వైయస్ జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్‌షాపులు రద్దు చేశాం. మద్యం షాపులను 33 శాతం తగ్గించి ప్రభుత్వమే నడిపించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. అందులో ఎక్కువ శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయం. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనను గుమ్మం ముందుకు తెచ్చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందకు వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు అందిస్తున్నారు’ అని మంత్ర వనిత చెప్పారు.