బాధ్యతను మరిచి కులానికి కొమ్ముకాస్తున్నాడు

వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై మంత్రి శ్రీరంగనాథరాజు ధ్వజం

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. తన బాధ్యతను మరిచి ఒక కులానికి కొమ్ముకాసేందుకు నిమ్మగడ్డ పనిచేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డను ప్రశ్నించారు. స్థానిక సంస్థల షెడ్యూల్‌ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. 

అమ్మఒడి, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలను ఆపాలనే దుర్బుద్ధితో చంద్రబాబు దర్శకత్వంలో రమేష్‌కుమార్‌ పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. కోర్టు సూచనలను కూడా నిమ్మగడ్డ బేఖాతరు చేస్తున్నారన్నారు. నిన్నటి రోజున ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి, హెల్త్‌ సెక్రటరీ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టం అని చెప్పినా పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం దారుణమన్నారు. కొత్తరకం వైరస్‌ వచ్చి రోజురోజుకు కేసులు పెరుగుతుంటే.. దుర్బుద్ధితో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం నిమ్మగడ్డ అహంకార వైఖరికి నిదర్శమన్నారు. దీనిపై న్యాయపర చర్యలు తీసుకొని ఇళ్ల స్థలాల పంపిణీ, అమ్మ ఒడి కార్యక్రమం కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top