శ్రీకాకుళం: అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను `తొక్క తీస్తాం.. తోలు తీస్తాం..` అంటూ కించపరిచిన చంద్రబాబును గంగపుత్రులు ఎన్నడూ మర్చిపోరు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓ మత్స్యకారుడే కుప్పంలో ఓడిస్తారు అని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని, అందువల్లే ఆ పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని చెప్పారు. సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ నెల 22న వైయస్సార్ చేయూత సొమ్ము జమ కానుందని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. నువ్వలరేవు జెట్టీ పనులు, రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయన్నారు.