చంద్రబాబూ నువ్వు మనిషివేనా..? అబద్దాలాడేందుకు సిగ్గులేదా..? 

తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే సంతబొమ్మాళి ఘటన

ఈ ఘటనలో ఎల్లోమీడియా విలేఖరి సైతం దొరికారు

చంద్రబాబు చేసే విగ్రహ రాజకీయాల్లో ఆంతర్యమేంటీ..?

నందీశ్వరుడి విగ్రహ ఘటనపై చంద్రబాబు, పవన్‌ ఎందుకు మాట్లాడరు..?

సినిమాలు, పబ్జీలపై లోకేష్‌ ట్వీట్లు పెట్టుకుంటే మంచిది

లోకేష్‌ ఎప్పటికీ బాలుడిగానే మిగిలిపోతాడు

పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నందీశ్వరుడి విగ్రహం ఘటన టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందని, దీనికి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే సంతబొమ్మాళి ఘటన జరిగిందన్నారు. నందీశ్వరుడి విగ్రహం ఘటనలో అచ్చెన్నాయుడు మనుషులతో పాటు ఎల్లో మీడియాకు చెందిన విలేకరి కూడా ఉన్నాడని ధ్వజమెత్తారు. సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వకపోయి ఉంటే ఆ నింద ప్రభుత్వంపైనే వేసేవారని, ఈ విగ్రహ రాజకీయాల్లో ఉన్న ఆంతర్యమేంటని చంద్రబాబును మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్ర రాజకీయాలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. బాబు మాటలు, విమర్శలు వింటుంటే.. సామెత గుర్తుకువస్తుందని,  ఒంటినిండా రంధ్రాలుండే జల్లెడ వెళ్లి సూదిని వెక్కిరించినట్లుగా చంద్రబాబు మాట తీరు ఉందన్నారు. 

ఎల్లో గ్యాంగ్, ఎల్లో ఛానల్స్‌ అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయండి అని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుందని మంత్రి అప్పలరాజు అన్నారు. అచ్చెన్నాయుడు సొంత మండలంలో అతని మనుషులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందీశ్వరుడి విగ్రహాన్ని అపహరించి నడిరోడ్డు మీద దిమ్మపై పెట్టారన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి, విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తుందన్నారు. 

రేపు సీఎం వైయస్‌ జగన్‌ రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభిస్తున్నందున చంద్రబాబు అండ్‌ గ్యాండ్‌ మరో కుట్ర చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు  చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నాడని అర్థం అవుతుందన్నారు. సంతబొమ్మాళి ఘటనకు చంద్రబాబు సమాధానం చెబుతాడా.. లోకేష్, అచ్చెన్నాయుడు చెబుతారా..? అని ప్రశ్నించారు. రామతీర్థం అని హడావిడి చేసిన చంద్రబాబు.. ఈ రోజు సంతబొమ్మాళికి ఎందుకు రావడం లేదు. బాబు పాట్నర్‌ పవన్‌ ఎక్కడా ఎందుకు మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. సాక్షాలు లేని సందర్భాలపై ముఠాలు తయారై ప్రభుత్వంపై నింద వేయడానికి మాత్రమే వస్తారా..? అని ప్రశ్నించారు. 

తిరుపతిలో జూమ్‌ మీటింగ్‌ పెట్టి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ నువ్వు మనిషివేనా..? అబద్ధాలు ఆడేందుకు సిగ్గుగా అనిపించడం లేదా..? అని నిలదీశారు. గతంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలకు కేసులు నమోదయ్యాయని, అనవసరంగా మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 153ఏ సెక్షన్, 499, 500 సెక్షన్‌ కింద బాబుపై కేసు నమోదు చేశారన్నారు. ఈ సారి కూడా ఇలాంటి సెక్షన్‌లు పెట్టాలన్నారు. 

సీఎం ఢిల్లీ పర్యటన గురించి లోకేష్‌కు అర్థం కాదు కాబట్టి.. సినిమాలు, పబ్జి గేమ్‌లపై ట్వీట్లు పెట్టుకుంటే లోకేష్‌కు మంచిదన్నారు. శిశుపాలుడి వధ అని చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడని, శిశుపాలుడు ఎప్పుడో చనిపోయాడని, ఇప్పుడున్నది శిశుబాలుడు లోకేష్‌.. ఆయనకు ఏపీ అమూల్‌ పాలు పట్టిస్తే.. కొంచెం తెలివైనా వస్తుందేమో.. అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ ఎప్పటికీ బాలుడిగానే మిగిలిపోతాడు.. సంతబొమ్మాళి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
 

Back to Top