ప్రభుత్వం ఏ నిర్ణయంపైనా ఎవరికీ సంజాయిషీ ఇవ్వదు

మోహన్‌బాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లాను

నాకు, మోహన్‌బాబుకి మధ్య జరిగింది క్షేమసమాచార చర్చ మాత్రమే

సినిమా ఇండస్ట్రీకి సమస్యలు సృష్టించింది చంద్రబాబే

బాబు సృష్టించిన సమస్యలను సీఎం వైయస్‌ జగన్‌ పరిష్కరించారు

14 ఏళ్లు అధికారంలో ఉండి సినీ పరిశ్రమకు చంద్రబాబు చేసిందేమైనా ఉందా..?

సినిమా ఇండస్ట్రీ కాలర్‌ ఎగిరేసుకునే పరిస్థితి తెచ్చింది వైయస్‌ జగన్‌

సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: సినీ పెద్దలు మోహన్‌బాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లానని, ఇరువురి మధ్య క్షేమసమాచార చర్చ తప్పితే మరేదీలేదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఉండదని సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరైన అనంతరం.. సుమారు 2002–03 నుంచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్న మోహన్‌బాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. వారి కాలేజీ, స్కూల్, వ్యక్తిగత అంశాలను మాట్లాడుకున్నామన్నారు. నిన్న సీఎం వైయస్‌ జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి వివరాలు చెప్పడానికి, సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్లానని మీడియాలో వార్తలు రావడం విచారకరమన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. నిన్న సీఎం వైయస్‌ జగన్‌తో జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి నాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని మోహన్‌బాబు చెప్పారు. నేను కూడా వచ్చి ఉండేవాడిని, నాకు కబురు అందకరాలేదని సీఎంకు చెప్పండి అని చెప్పారు. తప్పకుండా చెబుతానని చెప్పాను. క్షేమ సమాచారాలు మాట్లాడుకున్న తరువాత వారి అబ్బాయి మంచు విష్ణు, మోహన్‌బాబు శాలువా కప్పారు. వీడ్కోలు పలికారు. 

మోహన్‌బాబు వ్యక్తిగతంగా అభిమానంతో పిలిచిన మీదట వారి ఇంటికి కాఫీకి వెళ్లాను. ఇంతకుమించి ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వడానికి కాదు. నిన్నటి మీటింగ్‌కు సంబంధించిన వివరాలు చెప్పడానికి, సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్లానని మీడియాలో వార్తలు రావడం విచారకరం. ఎందుకిలా చేశారని మీడియా మిత్రులను అడిగితే.. మంచు విష్ణు ట్వీట్‌ చేశారని చెప్పారు. విష్ణును అడిగితే ట్వీట్‌ మార్చి మళ్లీ చేశానని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఉండదు. 

చలన చిత్ర పరిశ్రమకు సమస్యను సృష్టించింది చంద్రబాబు అయితే.. దాన్ని పరిష్కరించింది సీఎం వైయస్‌ జగన్‌. ఆనాడు హైకోర్టు సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించడానికి కమిటీ ఏర్పాటు చేసి.. నిర్ణయించి జీవో విడుదల చేయమని చెప్పింది. కమిటీ వేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ప్రజలను దోచుకునే అవకాశాన్ని, బ్లాక్‌ టికెట్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రజలను దోచుకునే వ్యవస్థ లేకుండా పారదర్శక రేట్లతో సినిమా చూసే అవకాశం కల్పించింది వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. 

సీఎం వైయస్‌ జగన్‌తో మీటింగ్‌ అనంతరం సినిమావారంతా ఆనందంగా ఉన్నామని చెబుతుంటే.. చంద్రబాబు ప్రతీదానికి దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు. 14 ఏళ్ల అధికారం అని చెప్పుకునే చంద్రబాబు సినిమా పరిశ్రమ కోసం చేసింది ఏమైనా ఉందా..? మీడియాలో పబ్లిసిటీ, రాజకీయాలకు, ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం, వారిని పిలిచి ఫొటోలు దిగి.. ఆ ఫొటోలు వాడుకోవడం తప్పితే.. ఎవరికి ఉపయోగపడ్డాడు..? అన్నిట్లో వివక్ష. కొంతమందికి ఒకరకంగా, నచ్చనివారి పట్ల మరోరకంగా బాబు వ్యవహరించాడు. ఇవన్నీ గుణశేఖర్‌ను అడిగితే చెప్పేవారు. సాక్షాత్తు చిరంజీవి సోదరుడు విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో చెప్పారు. సినిమా ఇండస్ట్రీని అవలక్షణాలపాలు చేసిన పాలకుడు చంద్రబాబు. సినిమా ఇండస్ట్రీ కాలర్‌ ఎగిరేసుకునే పరిస్థితి తెచ్చింది వైయస్‌ జగన్‌’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.

 

Back to Top