కేబినెట్‌ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు

వివరాలు వెల్లడించిన మంత్రి పేర్నినాని
 

సచివాలయం: కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. ఇసుక అక్రమ నిల్వ, రవాణా చేసినా రూ. 2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పు తీసుకువచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. అదే విధంగా 1వ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనకు మంత్రిమండలి అంగీకరించిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వాహణ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు. అదేవిధంగా సంవత్సరానికి రూ. 20 వేల కోట్లకుపైబడి ఆదాయం వచ్చే ఎనిమిది ఆలయాల్లో దేవస్థాన కమిటీల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.

కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక లభ్యతని ఎక్కవగా చేయాలని సంకల్పంతో సాధ్యమైనంత ఎక్కువ చోట్ల స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాలని, కేవలం నదిలోనే కాకుండా ప్రైవేట్‌ వ్యక్తుల భూముల్లో ఉన్న ఇసుకను కూడా సేకరించి స్టాక్‌ యార్డులకు నిల్వ చేసే కార్యక్రమం చేస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని, అందివచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు చేసుకోవాలనే దుర్బుద్దితో కొంతమంది ఇసుక బ్లాక్‌ మార్కెటింగ్‌ చేయడం. ఆన్‌లైన్‌లో బుక్‌చేసి రీసేల్‌ చేయడం, అర్ధరాత్రి రీసేల్‌ చేయడం, ప్రభుత్వ నిఘా లేని చోట ఇసుక తవ్వి తీసుకువచ్చి అమ్మే కార్యక్రమాలు చేయడం. ఇలాంటివి చేస్తున్న ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది.

ఇసుక అక్రమ నిల్వ చేసినా.. అక్రమంగా రవాణా చేసినా. బ్లాక్‌ మార్కెట్‌ చేసినా, పునర్విక్రయం చేసినా ఉక్కుపాదం మోపాలని నిర్ణయిస్తూ.. అక్రమార్కులకు కనీస జరిమానా రూ.2 లక్షలు, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పు కోసం కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నాం. ఇసుక నిల్వ, విక్రయం హక్కు మైనింగ్‌ డిపార్టుమెంట్‌కు మాత్రమే ఉంది.

ఇసుక లభ్యత కోసం గడిచిన నాలుగు మాసాలుగా ఉన్న ఇబ్బంది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌ డిపార్టుమెంట్‌ను కేంద్రీకరించి వారంలో మొత్తం సరిదిద్దాలని,
ప్రతి నిత్యం 1.50 లక్షల టన్నుల నుంచి 2 లక్షలు ఉండేలా చర్యలు చేపట్టి.. వారం నుంచి పది రోజుల్లో మొత్తం ఇసుకకు ఉన్న డిమాండ్‌ మొత్తాన్ని రియలైజ్‌ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నాం.

రాష్ట్రంలో ఉన్న 9 వేల పరిశ్రమలు, తద్వారా వచ్చే కాలుష్యం బారి నుంచి ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వాహణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 9 వేల పరిశ్రమల్లో 2వేల పైచిలుకు రెడ్‌ కేటగిరి పరిశ్రమలుగా.. ఇందులోంచి వచ్చే పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలన్నీ ఆడిట్‌ చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం పర్యవేక్షణ బాధ్యతలే తీసుకుంది. మా ప్రభుత్వం డిస్‌పోజల్‌ మెకానిజం కూడా బాధ్యతగా తీసుకుంది. పర్యావరణ వ్యర్థాలపై ఆడిట్‌ లేదు. ఏ పరిశ్రమలో ఎంత వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. అవి ఎంతశాతాన్ని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారనేదానికి ఆడిట్‌ జరగడం లేదు. ఏపీ ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును ఆమోదించాం.

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాతృభాష అయిన తెలుగు, ఉర్దూ సబ్జెక్టు కచ్చితంగా చదివేట్లు నిర్ణయం. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన ప్రారంభించాలని నిర్ణయం చేశాం. సమాజ హితం గురించి మాట్లాడేవారు.. ఎవరైనా పోటీ ప్రపంచంలో నిర్దేశిత వృత్తుల్లో, జీవనంలో నిలబడడం కోసం ఇంగ్లిష్‌ మాధ్యమంలోకి మారినవారే.. రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో 98.5 శాతం ఆంగ్లంలోనే విద్యాబోధన, కేవలం 1.5 శాతం ప్రైవేట్‌ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియంలో బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటే 34 శాతం ఇప్పటికీ ఇంగ్లిష మాధ్యమంలో విద్యబోధన జరుగుతుంది. అగ్రకులాలోని పేదవారు, వెనుకబడిన కులాల వారు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కవగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారి కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలుగు ఒక సబ్జెక్టు కచ్చితంగా చదివితీరాల్సిందే.

సముద్రంలో వేటకు వెళ్లి జీవనం సాగించే మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షలు చెల్లించేందుకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదించింది.

రాష్ట్రంలో ఉన్న అనేక మున్సిపాలిటీలు, నగరాల్లో గడిచిన చాలాకాలంగా నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ల నిర్మాణం జరిగింది. వాటిల్లో ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నవారిలో పేద, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కవ. అలా ఇంటి స్థలం కొనుగోలు చేసి 31 ఆగస్టు 2019 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకొని 30 అడుగులు రోడ్డు ఉన్న వారికి మాత్రమే రెగ్యులరైజేషన్‌ చేయనున్నాం. ఇది కేవలం వ్యక్తులకు మాత్రమే.. వ్యవస్థలకు కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసినవారు మున్సిపాలిటీల్లో రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు అంశాలను పొందుపరుస్తూ తీర్మానం.

ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ పాలసీ 2018, ఏపీ విండ్‌ పవర్‌ పాలసీ –2018, విండ్‌ సోలార్‌ హైబ్రీడ్‌ పవర్‌ పాలసీ 2018లను సవరణ చేయాలని నిర్ణయించాం. అటువంటి సవరణలకు కేవలం డిస్కంలు, ట్రాన్స్‌కం కంపెనీలకు నష్టాలు జరగకుండా ఉండేందుకు సవరణలకు కేబినెట్‌ ఆమోదం.

రాష్ట్రంలో 84 న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా.. గ్రామ న్యాయాలయాల చట్టం 2008ని సవరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. గ్రామస్థాయిలో వివదాలను సత్వరం పరిష్కరించడం కోసం తద్వారా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం.. న్యాయాధిపతి ఏర్పాటుకు, సిబ్బంది నియామకం కోసం అన్ని రకాల ఆమోదాలు కేబినెట్‌ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన అగ్నిమాపక శాఖలో డైరెక్టర్‌ పోస్టు లేకుండా పోవడం వల్ల తెలంగాణకు కేటాయించడం వల్ల డైరెక్టర్‌ పోస్టును, 9 డీఎఫ్‌ఓ ర్యాంకుతో అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టులను కూడా ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ తీర్మానం.

రాష్ట్రంలోని సంవత్సరానికి రూ.20 కోట్లపైబడి ఆదాయం వచ్చే ఎనిమిది దేవస్థానాలకు ట్రస్టుబోర్డు మెంబర్‌ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వరహాలక్ష్మీనరసింహస్వామి (సింహాచలం), అన్నవరం మేఘవెంకట సత్యనారాయణస్వామి దేవాలయం, ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, కాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం, భ్రమరాంబమల్లేశ్వరస్వామి ఆలయం శ్రీశైలం, లక్ష్మీతిరుపతమ్మ ఆలయం పెనుగంచిప్రోలు, స్వయంబు వరసిద్ధివినాయకస్వామి దేవస్థానం కాణిపాకం ఈ ఆలయాల్లో కమిటీలు వేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మంత్రి మండలి దృష్టికి మొక్కజొన్న పంట ధరలు పడిపోవడంతో రైతుకు నష్టం జరుగుతుందని, వారం రోజుల క్రితం క్వింటాల్‌ రూ.2200 ఉన్న ధర రూ. 15 వందలకు పడిపోవడాన్ని ముఖ్యమంత్రి, మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి విజయనగరం, కర్నూలు జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వారి ఆదేశాలను మంత్రిమండలి ఆమోదించింది. రైతుల దగ్గర ఎంత పంట ఉన్నా.. రూ. 1750 మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. 

Read Also: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా

Back to Top